Thursday, March 23, 2023

బడ్జెట్‌కు ‘లైన్ క్లియర్’?

- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే మొదలుకానున్నాయి. అసెంబ్లీని ప్రొరోగ్ చేసి, మళ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటించేందుకు ప్రభుత్వం, రాజ్‌భవన్ వర్గాలు సమాలోచనలు జరిపాయి. ఈ మేరకు బడ్జెట్‌ను ఆమోదించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంగీకరించినట్లుగా తెలిసింది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించలేదంటూ హైకోర్టులో సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇటు ప్రభుత్వ, అటు రాజ్‌భవన్ తరపు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అంగీకరించినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే న్యాయస్థానానికి వెల్లడించారు.

అలాగే, అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతించనున్నట్లు రాజ్‌భవన్ న్యాయవాది అశోక్ ఆనంద్ న్యాయస్థానికి తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణను ముగించింది. ఈ పరిణామాలన్నింటిపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయ నిపుణులతో సమీక్షించారు. అనంతరం శాసససభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైతో చర్చలు జరిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని, ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించినట్లుగా తెలిసింది.దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి, శాసనసభ సమావేశాల నిర్వహణకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయించే ప్రక్రియపై కూడా గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. దాంతో రాష్ట్ర బడ్జెట్ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడినట్లయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News