Thursday, September 25, 2025

కన్నడలో కుదరని కులాల సర్వేలు

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో కులాల సర్వేలు జరుగుతున్నా లింగాయత్, వక్కలిగ కులాల పెత్తనంతో ఏదీ ఒక కొలిక్కి రావడం లేదు. 2013లో కాంతరాజ్ సారథ్యంలోని బిసి కమిషన్, 2020-24లో జయప్రకాశ్ నేతృత్వంలోని బిసి కమిషన్ కులాలపై సర్వేలు నిర్వహించి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినా, ఆధిపత్య కులాలకు సంతృప్తి కలగక అభ్యంతరాలు లేవదీయడంతో కథ మళ్లీ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సోమవారం (22.9.2025) నుంచి మళ్లీ కులాల సర్వే చేపట్టింది. 2015లో నిర్వహించిన సర్వేను పక్కనపెట్టింది. దీని ఆధారంగా వచ్చిన సిఫార్సులను 2024లో స్వీకరించింది. కర్ణాటకలోని వెనుకబడిన తరగతుల కమిషన్ 15 రోజుల పాటు ఈ కులాల సర్వే చేపట్టనుంది. అయితే బిజెపి, కొంతమంది భూస్వాములు, రాజకీయ ఆధిపత్యనేతలు, సంఖ్యాపరంగా బలమైన సమాజాల నుంచి అభ్యంతరాల వెల్లువ ఎదురవుతోంది. కమిషన్ 1400 కులాలతో ప్రతిపాదిత జాబితా తయారు చేసి ప్రదర్శించింది.కానీ హిందువులను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై బిజెపి విరుచుకుపడింది. వక్కలిగ క్రిస్టియన్, బ్రాహ్మణ క్రిస్టియన్, లింగాయత్ క్రిస్టియన్ ఈ విధంగా తమకు తామే పెట్టుకున్న వర్గీకరణ పేర్లతో ఉన్న క్రిస్టియన్ ఉపజాతులను కులాల జాబితాలో చేర్చడంపై బిజెపితోపాటు కొన్ని కులాల వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆధిపత్య కులాలకు ప్రాతినిధ్యం వహించిన కేబినెట్ మంత్రులు కూడా ఈ పేర్లతో ఉన్న కులాలను వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందిలో పడింది.

ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఆయా కులాల నాయకులు విముఖత చూపుతున్నారు. ఈ కొత్త కులాలు తమ ప్రజాదరణను బాగా తగ్గిస్తాయన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ కారణంగానే గత కేబినెట్ సమావేశంలో విరుద్ధతలను సరిగ్గా సవరించేవరకు సర్వేను రద్దు చేయడం లేదా వాయిదా వేయడం చేయాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి వచ్చింది. వక్కలిగ కులానికి చెందిన బలమైన నాయకుడు డిప్యూటీ సిఎం డికె శివకుమార్, వీరశైవ లింగాయత్‌కు చెందిన సీనియర్ మంత్రులు ఎంబి పాటిల్, ఈశ్వర్ ఖండ్రే తెరపైకి వచ్చిన ‘కొత్త కులాల’ను వ్యతిరేకిస్తున్నారు. జాబితాలో ఈ కొత్త కులాల గందరగోళాన్ని సరిచేస్తే ‘ఇతరులు’ అనే కేటగిరిలో ఆ ‘కొత్తకులాల’ను గణించడానికి వీలవుతుందని కమిషన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఇలాంటి గందరగోళం తలెత్తడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకమే కారణమని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ పరిస్థితుల్లో కమిషన్ స్పష్టత ఇచ్చింది. గత కులగణన సమయంలో ‘కొత్తక్రిస్టియన్ ఉపకులాలు’ తమను సంప్రదించాయని, ప్రత్యేక గ్రూపులో తమను చేర్చాలని అభ్యర్థించాయని కమిషన్ వివరించింది. ఏ కులాన్ని లేదా ఉపకులాలను కలుపుకోవడం లేదా తీసివేయడంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏ మాత్రం లేదని కమిషన్ స్పష్టం చేసింది. వీరశైవ లింగాయత్ కులంలో తలెత్తే వివాదాలపై ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కూడా ఆసక్తిగా ఉంటున్నాయి.

రెండు పెద్ద కులాల సంస్థలైన ‘అఖిల భారత వీరశైవ మహాసభ’, ‘జాగథిక లింగాయత మహాసభ’ తాము వీరశైవ లింగాయత, లింగాయతలకు చెందిన వారిగా ‘ఇతరుల’ కేటగిరి లోకే వస్తామని చెప్పాలంటూ తమ సామాజిక వర్గాలకు విజ్ఞప్తి చేశాయి. ఈ రెండు సంస్థలు తమ సామాజిక వర్గాల సంఖ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ తమ కులానికి ప్రత్యేక మతం హోదా కల్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. కానీ హిందూ మతం కింద తమను ఆ కేటగిరిలో చేర్చరాదని ఈ రెండు సభలు తమ కుల సమాజాలను ప్రత్యేకించి అభ్యర్థించడం బిజెపి అంచనాలను తారుమారు చేసింది. హిందూ సమాజాన్ని విడదీయడానికి కుల సంస్థలను వినియోగించుకుంటున్నాయని మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్‌బొమ్మై, జగదీష్‌షెట్టార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. యాదృచ్ఛికంగా కేబినెట్ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే వీరశైవ మహాసభకు ప్రధాన కార్యదర్శి కాగా, కాంగ్రెస్ నాయకుడు షమ్మనూరు శివశంకరప్ప ఆ సభకు అధ్యక్షుడుగా ఉండడం గమనార్హం. వీరశైవ లింగాయత్, వక్కలిగ, బ్రాహ్మణులు, ముస్లింలు, కురుబాస్ వంటి పెద్దకులాలతో సమానమన్నట్టు ఆధిపత్య కులాలు తమకుతాము ఒప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

2015 సర్వేలో కనుగొన్న విషయాలు, దీని ఆధారంగా వచ్చిన సిఫారసులు పక్కన పెట్టడమైంది. వారంతా దశాబ్ద క్రితం నాటి వారని, ఆధిపత్య కులాల గణనను అణగదొక్కారని, తమ కులాల జనాభా లెక్కల అంచనాలను ఉపయోగించుకొని రాజకీయంగా బేరసారాలకు దిగుతున్నారని ఆరోపణలు రావడంతో ఆ సర్వేను పక్కన పెట్టారు. ఈ సర్వే ఆధారంగా కమిషన్ నివేదిక, సిఫారసులు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌కు ఎంతో కీలకం. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు మొత్తం రిజర్వేషన్ పరిధిని ప్రస్తుత 32 శాతం నుండి 51 శాతానికి పెంచాలని కమిషన్ సిఫార్సు చేసింది. అయితే వివిధ కులాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించడం అన్నది సర్వేలో కీలకమైన అంశం. ఆధిపత్య కులాలపై దృష్టి కేంద్రీకరించడం ప్రధానంగా సంఖ్యాపరమైన ఏకీకరణపై ఆధారపడి ఉంటుంది. గత నివేదికలో అత్యంత వెనుకబడిన ఇతర కులాల కేటగిరిలో చేర్చబడిన సంచార, పాక్షిక సంచార, బడుగు సమాజాలు ఈ సర్వే తమకు ప్రయోజనం కలిగిస్తాయని ఆశపడుతున్నాయి. అయినా ఆధిపత్య సమాజాల పెత్తనమే సాగుతున్న కన్నడ సీమలో ఈ సామాజిక వర్గాల గొంతుకలు అణగదొక్కబడి ఉంటున్నాయి.

Also Read: సమితి వేదికపైనా ట్రంప్ అదే పాట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News