Friday, March 29, 2024

మోడీ.. ‘మోసకారి’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికలోకం భగ్గుమంటోంది. సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్‌పరం చేయబోమని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర ఇటీవల తెలంగాణ పర్యటకు వచ్చిన సందర్భంగా రామగుండం లో జరిగిన సభలో ప్రకటించినప్పటికీ సింగరేణి గనుల వేలానికి శనివారం బెంగుళూర్‌లో జరిగిన కోల్ ఇండియా సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై సింగరేణి బొగ్గు గనుల కార్మికులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసిన కేంద్రం తాజాగా.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు చాపకిందనీరులా ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గుబావుల బ్లాక్‌లను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే కొన్ని బ్లాక్‌లకు టెండర్లను కూడా ఆహ్వానించారు. తాజాగా, మరికొన్ని బ్లాక్‌ల వేలానికి నిర్ణయం తీసుకోవడం పై సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. తాజాగా.. శనివారం తీసుకున్న గనుల వేలం నిర్ణయంపై సింగరేణి కారిడారిల్లో కార్మికులంతా ఆందోళనకు దిగారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నరేంద్ర మోడీ కన్ను బొగ్గుగనులపై పడింది. బొగ్గు వెలికితీత పనులను కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టేందుకు మార్గం సుగమం అయ్యింది. 1957నాటి గనుల చట్టాలను మార్చి సింగరేణిలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ వాణిజ్య బొగ్గు తవ్వకాల చట్టాన్ని తీసుకొచ్చింది. 1957, 1992లో వచ్చిన చట్టాలను సవరించి 2015లో వాణిజ్య, బొగ్గు వ్యాపార చట్టాన్ని తీసుకొచ్చింది.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియాను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని బొగ్గు గని కార్మిక సంఘాల నాయకులు, టిబిజికెఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కొల్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల వాటా బూచిని చూపి ప్రైవేటీకరణ చేసేందుకు తెరవెనుక కుట్ర పన్నుతున్నారని వారంటున్నారు. బొగ్గు తవ్వకాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం, కార్మికుల సంఖ్యను కుదించేచర్యలో భాగంగా చట్ట సవరణ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. దేశంలో 8 రాష్ట్రాల్లో కోల్ ఇండియా, సింగరేణి ఆధ్వర్యంలో బొగ్గు నిక్షేపాలను వెలికితీసి విక్రయిస్తున్నారు. దీనివల్ల వచ్చిన లాభాలను సైతం కార్మికులకు వాటాలను పంచుతున్నారు. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వాలది కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా 49శాతమే. అయితే సింగరేణిలో కార్పొరేట్ శక్తులు తలదూర్చిన తరువాత క్రమేపీ కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది.

ఒకనాడు సింగరేణిలో 1.16లక్షల మంది కార్మికులు పనిచేయగా ఇప్పుడు ఆ సంఖ్య 45వేలకు పడిపోయింది. మరోవైపు బొగ్గు నిక్షేపాలను వెలికితీసే పనులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. కొయగూడెం ఒసి ప్రాంగణంలోనిని నాలుగు బొగ్గు బ్లాక్‌లతో పాటు, కళ్యాణ ఖని, శ్రావణపల్లి, సత్తుపల్లి ఒసి బ్లాక్ 5, పెనగడపతో పాటు సత్తుపల్లి బ్లాక్ 3, మందమర్రి, ఇల్లెందు బ్లాక్‌లను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొయగూడెం బ్లాక్ 3ని అరవిందో కంపెనీకి అప్పగించగా ఆ సంస్థ బొగ్గు వెలికితీయడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత నెల 12న రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడూతూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనలు, ఆలోచనలు ఏమి కేంద్రం వద్ద లేవని, ఈ వదంతులంతా హైదరాబాద్ నుంచే ప్రారంభం అయ్యాయని, ఇవన్ని అవాస్తవమని ప్రకటించారు.

సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదని, కేంద్రం వాటా 49శాతమేనని, దీంతో సింగరేణిపై ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, 51శాతం వాటా రాష్ట్రానిదే అయినప్పుడు సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రం ఎలా చేస్తుందని ప్రధాని ఆ సభలో ప్రశ్నించారు. కేంద్రానికి అలాంటి ఆలోచన గాని ఇష్టమూలేదని ప్రధాని ప్రకటించిన పక్షంరోజులకే నాలుగు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంపై బొగ్గు గని కార్మిక సంఘ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శనివారం తీసుకున్న నిర్ణయంపై కొత్తగూడెంలో తెలంగాణ ఆమరవీరుల స్థూపం వద్ద టిఆర్‌ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

అదేవిధంగా దేవిధంగా మండలం కొయగూడెం గని వద్ద టిబిజికెఎస్ నాయకులు మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మణుగురులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నేతృత్వంలో, సత్తుపల్లిలో ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య నేతృత్వంలో, మందమర్రి, పెద్దపల్లి, రామగుండంలో బొగ్గుగని కార్మికులు, టిఆర్‌ఎస్ నేతలు భారీ ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. గనుల ప్రైవేటీకరణను విరమించకుంటే మరో ఉద్యమానికి కార్మికులు సిద్ధమవుతారని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News