Saturday, April 27, 2024

వైద్య, విద్యలకు నిధులు పెరిగేనా?

- Advertisement -
- Advertisement -

మన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన విద్య, ఆరోగ్య రంగాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు తగ్గిస్తూ రావడం శోచనీయమని ఆయా రంగాల నిపుణులు భావిస్తున్నారు. దేశ ప్రజలందరికీ రూ. 10 లక్షల ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ ఆ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలులోకి తెచ్చి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన తరుణంలో ఇలా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తగ్గించడం సరికాదని ఆరోగ్య రంగ నిపుణులు అంటున్నారు. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన 2019- 20 ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి 2.4 శాతం నిధులు కేటాయించారు. కానీ ఆ తర్వాత 2020-2021, 2023-24 లలో విద్యా రంగానికి కేటాయింపులు 2% కంటే తక్కువే కావడం గమనార్హం.

2019- 20 ఆర్థిక సంవత్సరంలో విద్యా రంగానికి 3.3% నిధులు కేటాయించారు. కానీ ఆ తర్వాత 2021 -22లో ఆ కేటాయింపులను 2.2 శాతానికి, 2023 -24లో 2.5 శాతానికి తగ్గించినట్లు సవరించిన బడ్జెట్ అంచనాలను బట్టి తెలుస్తున్నది. 142 కోట్ల జనాభా గల సువిశాల భారత్ ప్రజారోగ్య పరిరక్షణకు ఈ నిధులు ఏ మూలకూ చాలవనేది సుస్పష్టం. ఆయుష్మాన్ భారత్ కింద బీమా మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచడం హర్షణీయం. మన విద్యార్థులు, యువతను శాస్త్ర సాంకేతిక, మానవ విజ్ఞాన శాస్త్రాలలో నిష్ణాతులను చేసి అంతర్జాతీయం సామర్థ్యంలో మేటిగా నిలపాలంటే వారికి నాణ్యమైన విద్యనందించాలి. అందుకోసం విద్యపై చేసే వ్యయాన్ని భారీగా పెంచాలి. విద్యకు జిడిపిలో 6% ఖర్చు చేస్తేనే భావిభారత పౌరుల నైపుణ్యాలు పెరుగుతాయని, నూతన విద్యా విధానంలో స్పష్టంగా పేర్కొన్న ప్రభుత్వం ఆచరణలో ఇలా నిధులు తగ్గించడం సరికాదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. అసంఘటిత కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ల కోసం చేసే వ్యయాన్ని కూడా 2022 -23లో 9.7 శాతానికి, 2023- 24లో 10 శాతానికి తగ్గించడం గమనార్హం.

విద్య, ఆరోగ్యం వంటి సామాజిక సంక్షేమ పథకాలకు మోడీ ప్రభుత్వం ఇలా నిధులు తగ్గించడం విచారకరం. 1920-21 లో ఈ రంగాలకు 12 శాతం కేటాయింపులు ఉండేవి. తీసుకున్న రుణాలపై వడ్డీల చెల్లింపులు, ప్రజలకు ఆహారం, ఇంధనం, రైతులకు సబ్సిడీ ధరలకు ఎరువుల సరఫరాకు బడ్జెట్‌లో 3వ వంతు నిధుల కేటాయింపు ఉంటుంది. దేశ సరిహద్దుల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు మరో 12 శాతం నిధులను ఖర్చు చేయవలసి ఉన్నందున విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు నిధుల కోత విధించక తప్పదని అంటున్నారు. యూరప్ దేశాలు కూడా 20వ శతాబ్దం ఆఖరి వరకు తమ దేశాల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కువ బడ్జెట్ మొత్తాలను ఖర్చు చేసేవి.

కానీ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఇటీవలి సంవత్సరాలలో విద్య, బాలల సంక్షేమం, అస్వస్థుల ఆరోగ్య రక్షణ, ఉద్యోగ విరమణ చేసిన వృద్ధులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దుర్బల వర్గాలకు, ఇతరులకు సామాజిక సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాయని ఐఎంఎఫ్ పత్రిక వెల్లడించింది. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు తగ్గగా, మరోవంక కరోనా మహమ్మారి ప్రబలి 2020-21లో ఆహార సబ్సిడీల వ్యయం పెరిగింది. కరోనా ప్రబలిన తొలి ఏడాది బడ్జెట్‌లో 15.4% ఆరోగ్య సబ్సిడీల కోసం ఖర్చు చేశారు.

అయితే ఆ తర్వాత వీటిని హేతుబద్ధం చేసి 2021- 22లో ఆ వ్యయాన్ని 7.2 శాతానికి, 2023-24 లో 4.38 శాతానికి తగ్గించారు. దేశంలో కరోనా ప్రబలడానికి ముందు 2019 -20లో బడ్జెట్‌లో 4.04 శాతం మొత్తాన్ని ఆహార సబ్సిడీగా ఖర్చు చేశారు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో కూడా ఆహార సబ్సిడీ అంతే. అయితే గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించి నందున 81 కోట్ల మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత బియ్యం, ఇతర ఆహార ధాన్యాల సరఫరా వ్యయం, సబ్సిడీ మొత్తం మరింత పెరగనుంది. వచ్చే ఐదేళ్లలో ఇందుకు రూ. 5 లక్షల కోట్లు ఖర్చు కాగలదని అంచనా. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రస్తుతం రైతులకు ఏటా 3 విడతలుగా రూ. 2 వేల వంతున 3 విడతలలో రూ. 6 వేలు వారి ఖాతాలకు కేంద్రం జమ చేస్తున్నది. ఈ సాయాన్ని కనీసం మరో రూ. 2 వేలు పెంచుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రూ. 10 వేలు సాయంగా ఇవ్వాలని, వర్షాభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పంపిణీ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినా భారత్‌లో వినియోగదారులకు వంటగ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలు తగ్గించనందున, బియ్యం, నూనెలు, పప్పుల ధరలు పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వంట గ్యాస్ ధరలు భారీగా పెంచడాన్ని నిరసిస్తూ కర్నాటక ప్రజలు ముఖ్యంగా మహిళలు పువ్వు పార్టీని గద్దెదించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో తామే అధికారానికి వస్తామని కమలనాథులు హూకరించినా ప్రజలు ఆ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే అనుగ్రహించారు. హిందీ రాష్ట్రాలలో కమలం వికసించినా దక్షిణ, తూర్పు రాష్ట్రాల ప్రజలు ఆ పార్టీపై ఆగ్రహంగానే ఉన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో మహిళలు, దళితులు, ఆదివాసీలను ఆకట్టుకుని తాయిలాలు ఇచ్చి ముందస్తు వ్యూహంతో మోడీ ఆకట్టుకున్నారు. హస్తం, తదితర లౌకిక పార్టీలు దీటైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనందున ప్రతిపక్షాలలో చీలికలు తెచ్చి, ఏకం కాకుండా కకావికలు చేసిన మోడీ మూడోసారి అధికారం తనదేననే ధీమాలో ఉన్నారు. ఇప్పుడు మహిళలను ఆకట్టుకోవడానికి వంటగ్యాస్ ధర రూ. 300 తగ్గిస్తామంటున్నారు. ఈ తగ్గింపునకు ఉజ్వల పథకం వారికీ ఇతర పేద, మధ్య తరగతి ప్రజలకూ వర్తింపజేస్తే వారికి ఊరట కలుగుతుంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించే తాత్కాలిక బడ్జెట్‌లో కొంత వరకైనా ఊరట కలిగిస్తారని జనం ఆశాభావంతో ఉన్నారు. గత బడ్జెట్‌లో ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, మారుమూల ఆదివాసీ ప్రాంతాలలో రక్తహీనత వల్ల బలహీనంగా ఉన్న నిరుపేదలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బలవర్ధక ఆహారం అందిస్తామని గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదు. కరోనా సాకుతో వయో వృద్ధులు, మహిళలు, జర్నలిస్టులకు రైలు ప్రయాణాలకు మునుపటి ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలు రద్దు చేసిన ఘనత మోడీక్స్ ప్రభుత్వానిది. ఈసారి అయినా ఆ రాయితీలు పునరుద్ధరించాలని వారు కోరుకుంటున్నారు. ఎంత భక్తి వున్నా కేవలం రామభజన ఒక్కటే చాలదు. అన్నవస్త్రాలూ కావాలి. ప్రజల జీవనోపాధి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పుడే ఏ పాలకునికైనా ప్రజలు జేజేలు పలుకుతారు. శుష్కప్రియాలు… శూన్యహస్తాలయితే ప్రజలకు ఊరట ఎక్కడ.

పతకమూరు
దామోదర్ ప్రసాద్
9440990381

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News