Tuesday, April 30, 2024

అణచివేతే సమాధానమా?

- Advertisement -
- Advertisement -

Central Govt repression on Farmer movement

 

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? అని రాచరిక వ్యవస్థల్లో ప్రజలు తరచూ అనుకునేవారు. అందుకే అది ఒక సామెతగా చిరస్థాయిని పొందింది. ఇప్పటి పదహారణాల ప్రజాస్వామ్య దేశమనిపించుకుంటున్న భారత్‌లో వీసమెత్తు చెదిరిపోకుండా ఈ సామెతను సజీవంగా ఉంచుతున్న మన కేంద్ర పాలకులను 130 కోట్ల నోళ్లతో కొనియాడవలసిందే. దేశంలోని భూమి, ఆకాశం, గాలి, నీరు కూడా కలలోనైనా తమ చేతలను, నిర్ణయాలను వేలెత్తి చూపరాదన్నది ప్రధాని మోడీ ప్రభుత్వం నిశ్చితాభిప్రాయమని రోజురోజుకీ మరింతగా రూఢి అవుతున్నది. ఎవరైనా అందుకు భిన్నంగా వ్యవహరిస్తే వారిని కటకటాలపాలు చేసి తీరుతామని తరచూ ఆచరణ ద్వారా హెచ్చరిస్తున్నారు. ఏడు పదులు దాటి వృద్ధాప్యంతో తీసుకుంటున్నవారైనా 20- 22 ఏళ్ల యువత అయినా ఇందుకు అతీతులు కారని స్పష్టం చేస్తున్నారు. తగిన జవాబుతో ప్రశ్న నోరు మూయించడం, విమర్శను ప్రతి విమర్శతో ఎదిరించి వీగిపోయేలా చేయడం ప్రజాస్వామిక లక్షణం. దేశ భద్రతకు, ఆంతరంగిక శాంతికి విఘాతం కలగబోయేటప్పుడు తప్ప, ప్రశ్నను, భిన్నాభిప్రాయాన్ని, అహింసాయుత నిరసన హక్కును గౌరవించే వారే నిజమైన ప్రజాస్వామిక పాలకులనిపించుకుంటారు.

ప్రస్తుత మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజకీయ ప్రత్యర్థుల పైనా, మేధావి విమర్శకులపైనా, ప్రజాహితం కోరి ఉద్యమించే కార్యకర్తలపైనా అందరిపైనా నిరంకుశ శాసన ప్రయోగం, పోలీసు బలగాలను ఉసిగొల్పడం, జైళ్లను వినియోగించడమే కర్తవ్యంగా భావిస్తున్నారని అనుకోవలసి వస్తున్నది. పాలకులు తాముగా ప్రజాస్వామ్య నీతులు చెబుతుంటారు. పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థల ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటుతుంటారు. వారి ఆధీనంలోని పోలీసులు మాత్రం ఎత్తి చూపేవారినీ, ఎదురు చెప్పేవారినీ తమ పద్ధతిలో తాము చూసుకుంటుంటారు. పాలకుల మాటకు చేతకు వ్యత్యాసం రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ వైరుధ్యాన్ని చూసి విస్తుపోడం దేశ ప్రజల వంతు అవుతున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో 70 రోజులకు పైగా సాగుతున్న రైతు ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టే లక్షంతో ఒక కార్యాచరణ ప్రణాళిక (టూల్ కిట్) రూపకల్పనలో పాలుపంచుకుందన్న అభియోగంతో బెంగళూరుకి చెందిన దిశ రవి అనే 22 ఏళ్ల కళాశాల విద్యార్థిని, పర్యావరణ ఉద్యమకారిణిని ఢిల్లీ పోలీసులు ఇటీవల చడిచప్పుడు లేకుండా అరెస్టు చేసి తీసుకుపోయారు.

దేశ ప్రతిష్ఠను మంటగలిపే దురుద్దేశంతో ఖలిస్థాన్ ఉగ్రవాద శక్తులతోనూ సంబంధాలు పెట్టుకొని టూల్ కిట్‌ను తయారు చేశారనే ఆరోపణను ఆమె మీద మోపినట్టు సమాచారం. ఈ చర్యను జాతీయ ప్రతిపక్షాలు ఒక్క కంఠంతో ఖండించాయి. దిశ రవితో పాటు ముంబై న్యాయవాది నిఖితా జాకబ్, పుణె ఇంజినీర్ శంతనులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. పిన్న వయసులోని అమ్మాయిపై ఇంత కఠిన చర్య తగునా అని అడిగిన వారికి ముంబై పేలుళ్ల ఉగ్రవాది కసబ్ కూడా పిన్నవాడేనని బాధ్యత గల పాలక వర్గ పెద్ద ఒకరు ఎదురు ప్రశ్నతో సమాధానం చెప్పడం భావ్యమా? దేశ ప్రజలు దైవభక్తికో, దేశభక్తికో పడిపోయి తమకు ఓట్లు వేసి గెలిపించి ఉండవచ్చు, కాని దేశానికి ఏది మంచో, ఏది చెడో వివేకంతో విక్షణ జ్ఞానంతో తెలుసుకొని అపరిమితమైన చెడు జరగబోతున్నదని గట్టిగా అనిపించినప్పుడు వారు దానిని ప్రతిఘటించే ఉక్కు బలసంపన్నులు కూడా కాగలుగుతారు. రైతు ఉద్యమం నేడు ఈ స్థితిలోకి దేశంలోని మెజారిటీ ప్రజలను నెడుతున్నదనడం అవాస్తవం కాబోదు.

అంతేకాదు ఈ ఉద్యమం అంతర్జాతీయ సమాజాన్ని కూడా విశేషంగా ప్రభావితం చేస్తున్నది. ఇంత సువిశాల దేశంలో రైతులకు, భూమికి గల విడదీయరాని బంధాన్ని కాపాడినప్పుడే పర్యావరణానికి మంచి జరుగుతుందని, తిండి పెట్టే రైతు కన్నీరు పెట్టే దుస్థితి మరింత ముదరకూడదని ప్రపంచ స్థాయి పర్యావరణ పరిరక్షణ ప్రచార సారథి, స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ కూడా భావించారు. దిశ రవి తనకున్న ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో తన టెలిగ్రామ్ ఖాతాను ఉపయోగించి టూల్ కిట్‌ను తయారు చేసి ఆమెకు పంపించారన్నది ఈ కేసులో పోలీసుల అభియోగం. ఇది దేశ ప్రతిష్ఠను మంటగలిపే చర్య అని మన కేంద్ర పాలకులు భావిస్తున్నట్టు స్పష్టపడుతున్నది.

అటువంటప్పుడు తమ భవిష్యత్తును కాపాడుకోవాలనే దృష్టితో దీక్షతో రెండున్నర మాసాలుగా ఉద్యమం చేస్తున్న వేలాది మంది రైతులు, వారికి మద్దతిస్తున్న దేశంలోని పలు వర్గాలకు చెందిన అసంఖ్యాక ప్రజానీకం కూడా దేశద్రోహులేనా? దేశంలో ప్రజాస్వామ్యమే బోనెక్కి ఉరి కంబమెక్కడానికి కూడా సిద్ధంగా ఉందనే అభిప్రాయం ఈ వ్యవహారం నేపథ్యంలో ఎవరికైనా కలిగితే తప్పు పట్టగలమా? కేంద్ర పాలకులు ఇప్పటికైనా పరిణతితో ఆత్మవిమర్శ చేసుకొని దిశ రవి మీదగాని, ఆమె తయారు చేశారంటున్న టూల్‌కిట్‌కు ప్రేరణ అయిన రైతు ఉద్యమకారుల మీద గాని ప్రజాస్వామ్య దృష్టితో స్పందించాలి. అదే అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు ప్రతిష్ఠలను పెంచుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News