Friday, May 3, 2024

అకాడెమీ అవార్డులా! పందేరాలా?

- Advertisement -
- Advertisement -

కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు అవార్డులు అంటే వందిమాగధులకు పందేరాలయినాయి. ప్రతిభతో పనిలేకుండానే ‘మనోడు’ అయితే చాలు వీరతాళ్ళు వేసేస్తున్నారు. ఆధిపత్య కులాలకు చెందిన అకాడెమీ పీఠాధిపతులు తమ తదనంతరమూ తమని సాహితీలోకంలో బతికించే బాధ్యుల్ని ఎంపికచేసుకొని వారికి అవార్డులను బహుమానాలుగా అందిస్తున్నారు. భజన బృంద గానాలకు పరవశులవుతూ, తమ ఆశ్రితులను అందలం ఎక్కిస్తున్నారు. తమ ఛత్రఛాయల్లోని వారికి అకాడెమీ ఖర్చులతో వివిధ ప్రాంతాల్లో కొన్ని కొన్ని సార్లు విదేశాల్లో సైతం సాహితీ సభల్లో పాల్గొనే అవకాశాలను కల్పిస్తున్నారు. నాకిది, నీకది అని అవార్డులను పంచుకుంటున్నారు. పైగా దానికి సామాజిక సమతుల్యత అనే ముసుగు. ఎప్పుడో ఒక అవార్డు అర్హులకిచ్చి అంతా సవ్యంగానే ఉన్నదనే భరోసాను కల్పిస్తారు. నిజానికి సాహిత్య అకాడెమీ సభ్యులు ‘దార్శనికత’తో తమ చేతికి మట్టి అంటించుకోకుండా తమకు అనుకూలంగానే గాకుండా చెప్పుచేతుల్లో ఉండే వారిని, ఇంకా చెప్పాలంటే తాము చెప్పింది చేసే ‘జ్యూరీ’ని నియమించి తమ కార్యాల్ని నెరవేర్చుకుంటున్నారు.

ఇది నిన్న మొన్న ప్రకటించిన బాల, యువ పురస్కారాలకు మాత్రమే పరిమితం గాదు. గత కొన్నేండ్లుగా ఈ దుష్ట సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది. ఈ పరంపరే అసలైన తెలుగు సాహిత్యాన్ని చెదలు పట్టిస్తున్నది. ‘ప్రతిభ’ను కాటేస్తున్నది. ‘జ్యూరీ’ని నియమిస్తున్నప్పుడే సలహాలు, సూచనల పేరిట వారికి నిర్దేశాలు ఇస్తారు. ఈ క్రమంలోనే లోపాయకారిగా తాము అవార్డు ఇవ్వాలనుకున్న వారికి అది దక్కేలా సమగ్రమైన ప్రణాళికతో కుట్రను అమలుపరుస్తారు. ఈ కుట్ర గురించి ‘జ్యూరీ’ సభ్యులకు కొన్నిసార్లు అర్థమయినా స్వప్రయోజనాల కోసం కాంప్రమైజ్ అవుతున్నారు. ఇవన్నీ సాక్ష్యాలు, ఆధారాలతో రుజువు చేయలేని విషయాలు. అయితే కొంచెం ఇంగితంతో ఆలోచిస్తే ఈ విషయాలన్నీ ఈజీగానే అర్థమవుతాయి. వరుసగా నాలుగేండ్లు ఒకే జిల్లా వాళ్లకు ‘కేంద్ర’ అవార్డులు ఎలా వస్తాయి అని ఎవ్వరూ అడుగరు.

ఎవరన్నా గట్టిగ నిలదీస్తే అదంతా ‘ప్రతిభ’ ఆధారంగానే జరిగింది. అయినా అప్పుడు మేము బాధ్యతల్లో లేము అని తప్పుకుంటారు. టెక్నికల్‌గా అది కరెక్టే కావొచ్చు. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఆ తాను ముక్కలే అని అర్థమయితది. గతంలో 2011 (సామల సదాశివ) తర్వాత పదేండ్లకు కూడా తెలంగాణ వారికి అవార్డులు రాలేదని పత్రికల్లో విమర్శ పెడితేగానీ ఈ ప్రాంతం వారిని అర్హులుగా గుర్తించలేదు. ఇదీ కాళోజి అన్నట్టు అగాథమీ ఘనత. పాత కౌన్సిల్ స్థానములో ఇటీవల కొత్త కౌన్సిల్ కొలువుదీరింది. ఇందులోనూ ప్రతిభను కాటేసే పాములున్నాయి. కాబట్టి భవిష్యత్‌లో న్యాయం ఎంత జరుగుతదనేది వేచి చూడాల్సిందే! ఇక ప్రస్తుతం 2023 సంవత్సరానికి గాను శుక్రవారం (23062023) నాడు ప్రకటించిన అవార్డుల విషయానికి వద్దాము. యువ సాహితీ పురస్కారం, బాల సాహితీ పురస్కారం రెండూ కూడా కడప జిల్లా వాళ్ళకు దక్కినాయి.

ఇందులో బాల సాహిత్య పురస్కారం అందుకున్న డి.కె. చదువులబాబు గురించి పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవు. అయితే తక్కెడశిల జానికి యువసాహితీ పురస్కారం ఇవ్వడాన్ని సోషల్ మీడియా కేంద్రంగా చాలా మంది సాహితీవేత్తలు తప్పుపట్టారు. ఇట్లా తప్పుపట్టడానికి ప్రధాన కారణం తక్కెడశిల రాసిన కాపీ కవిత్వమే కారణం. అంతేగాకుండా పోయెట్రీ తక్కెడశిల జాని ఫేస్‌బుక్ వాల్ మీద ఉండడంతో ఈజీగానే దాని ఆధారంగా ఆయన కవిత్వాన్ని చదివి అంచనా వేసుకున్నారు. న్యాయంగానే ఆ కవిత్వాన్ని తప్పుపట్టారు. అయితే అవార్డు కవిత్వానికి గాకుండా ‘వివేచని’ పేరిట రాసిన విమర్శ గ్రంథానికి వచ్చింది. ఈ 260 పేజీల పుస్తకం వెల నాలుగు వందల రూపాయలు కాబట్టి ఎన్ని కాపీలు వేసిండో ‘సెలెక్టివ్’గా ఎంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చినాడో తెలియదు. ఎందుకంటే అమ్ముడుపోయే పుస్తకాలయితే ధర అంత ఎక్కువగా ఉండేది కాదు. మార్కెట్‌లోనూ ఉండేది.

ఈయన నాలుగైదు మారు పేర్లతో రచనలు చేస్తున్నాడు. తనకు తాను ‘అభ్యుదయ’ రచయితగా చెప్పుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 20కి పైగా పుస్తకాలను అచ్చేసిన ఈ జానిభాష అవార్డు కోసం పూర్తిస్థాయి ప్రణాళికతోనే ‘వివేచని’ ప్రచురించాడని అర్థమయితున్నది. ఎందుకంటే ఈ పుస్తకానికి ముందుమాట సాహిత్య అకాడెమీ సభ్యులుగా ఉన్నటువంటి రాచపాలెం చంద్రశేఖరరెడ్డితో రాయించుకున్నాడు. అట్లాగే ఈయన రాసిన విమర్శ వ్యాసాలన్నీ కూడా సాహిత్య అకాడెమీతో సంబంధమున్న వ్యక్తుల గ్రంథాలమీదే కావడం విశేషం. రాచపాలెం చంద్రశేఖరరెడ్డి రచనలపై, శివారెడ్డి కవిత్వంపై, ఎన్.గోపి, వోల్గా, కొలకలూరి ఇనాక్ తదితరుల రచనలపై విమర్శలు రాసిండు. నిజానికి ఇతర సందర్భాల్లో అయితే ఇట్లా రాయడం తప్పుపట్టాల్సిన విషయమేమీ కాదు. ఇట్లా సెలెక్టివ్‌గా సాహిత్య అకాడెమీతో ఏదో విధంగా సంబంధమున్న వ్యక్తులపైనే రాయడమంటే కచ్చితంగా అనుమానాలకు తావు ఇస్తోంది.

అంతేగాదు ప్రతిసారి కవిత్వానికే ఇస్తున్నాము ఈ సారి విమర్శకు అవార్డు ఇస్తే బాగుంటుందని జ్యూరీ, కౌన్సిల్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ సారే విమర్శకు ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారో, దాని వెనుక ఎవరెవరి ప్రయోజనాలు ఏమిటో తేలాల్సిన అవసరమున్నది. అయినా ప్రక్రియ ముఖ్యమా? సాహిత్యం ముఖ్యమా? జానీభాష గతంలో ఒక వెబ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ “సాహిత్యం ఎక్కువ చదవను. నా పదవ తరగతి అయిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను ఇంటర్మీడియట్ కాస్త దూరం చేసారు. నేను హోం సిక్ వల్ల తిరిగి వచ్చేసాను. దానితో ఒక్క సంవత్సరం వృధా అయినది. అప్పుడు మా అమ్మ గారు నన్ను కంప్యూటర్ క్లాస్‌లో చేర్చించారు. ఇంట్లో ఉన్నప్పుడు రామాయణం, మహాభారతం, ఇలా అన్ని పురాణాలు చదివాను. ఖురాన్ కూడా చదివాను. ఒక్క బైబిల్ తప్ప.” అని పేర్కొన్నాడు. అంటే ఆయన ఆధునిక సాహిత్యాన్ని చదువుకోలేదు అని తానే చెప్పుకున్నాడు.

కాబట్టి ఆయన విమర్శనా ప్రతిభను అంచనా వేయవచ్చు. ఆయన ఫేస్‌బుక్ వాల్‌పైన ఉన్న వ్యాసాలను చదివితే కూడా ఇదే అర్థమయితున్నది.ఫైనల్ వరకు అర్హత పొందిన తొమ్మిది పుస్తకాల్లో ఒకే ఒక్క విమర్శ గ్రంథం ‘వివేచని’ కాబట్టి దానికి అవార్డు ఇచ్చినట్టు ఓ జ్యూరి మెంబర్ ఉవాచ. అంటే ముందే నిర్ధారించుకొని తక్కెడశిల జానీభాషకు అవార్డు ప్రకటించినట్లు అర్థమయితున్నది. ఇంతకూ ఈ జ్యూరీ సభ్యులు తొమ్మిది పుస్తకాలను కూలంకషంగా చదివినారా? చదివితే కవిత్వం గాకుండా కథలు, నవలలు కూడా ఉన్నాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. ఈ అవార్డుని జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా జానీభాషకు ఇవ్వాలని నిర్ణయించినట్లు అకాడెమీ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. కాబట్టి అందరూ కూడబలుక్కునే ఈ కుట్రకు తెరదీశారని నిర్ధారించుకోవచ్చు.
2023 సంవత్సరానికి గాను తెలంగాణ యువకులు రాసిన మొత్తం ఆరు పుస్తకాలు ఫైనల్‌కు వచ్చినాయి. ఇందులో నందకిషోర్‌వి రెండు కవితా సంపుటాలు, రమేశ్ కార్తిక్ నాయక్ (కవిత్వం, కథలు) పుస్తకాలు, నర్రా ప్రవీణ్‌కుమార్ ‘పొత్తి’ నవల, రావ్‌ుదాస్ నేనావత్ కవితా సంపుటి ఫైనల్ లిస్టులో ఉన్నాయి. అయితే ఇవేవి అవార్డుకు అర్హత సాధించలేక పోయాయి. నందకిషోర్ కవిత్వం 2014, 2015, 2017, 2020, 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఫైనల్ వరకు వచ్చింది. ఈ సంవత్సరంతో అతని అవార్డు అర్హత వయసు (35) కూడా తీరిపోయింది. తెలంగాణ, బహుజన యువకుడు కవిత్వం మాత్రమే నిలబడుతుంది, తన తరపున ఎంతటి వారితోనైనా కలెబడుతుంది అని నమ్మినందుకు నష్టపోయిండు. నిటారుగా నిలబడ్డందుకు పీఠాధిపతులకు, పీఠ వాహకులకు నందూ కవిత్వం నచ్చలేదు. అందుకే అవార్డుకు అర్హుడు కాకుండా పోయిండు.
తెలంగాణ లంబాడీల జీవితాలను బయటి ప్రపంచానికి ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యానికి బలంగా పరిచయం చేస్తున్న రమేశ్ కార్తిక్ నాయక్ కవిత్వం, కథలు రెండూ కూడా ఈ సారి ఫైనల్‌కు వచ్చినాయి. రాయడం తప్ప లౌక్యం లేని తెలంగాణ అమాయకుడు కావడంతో అవార్డు మిస్సయింది. అట్లాగే మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నవలగా మార్చి త్యాగాల చరిత్రను, తల్లడిల్లుతున్న జీవితాలను నర్రా ప్రవీణ్‌కుమార్ రెడ్డి చిత్రికగట్టిండు. అయినా దానికీ అవార్డు రాలేదు. కథ, నవల, కవిత్వం ఏదీ కాదని ‘విమర్శ’ను ఎంపిక చేసిండ్రు. ఈ ఎంపిక కమిటీ (జ్యూరీ)లో ఇద్దరు తెలంగాణ వారు, ఒక ఆంధ్రా మహిళ ఉన్నారు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఈ ఎంపిక చేసిండ్రు. తెలంగాణ నుంచి భిన్న ప్రక్రియల్లో సాహితీ సృజన చేసిన వడ్డేపల్లి కృష్ణ, కవిగా ప్రసిద్ధులయిన దర్భశయనం శ్రీనివాసాచార్య, ఆంధ్రా నుంచి తెలుగు అకాడెమీ మాజీ డైరెక్టర్ ఆవుల మంజులత ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవ్వరూ కూడా నిలబడే విమర్శ రాయలేదు.

అందుకే నాసిరకమైన విమర్శను అవార్డుకు ఎంపిక చేసిండ్రు. ఇంతకూ ఆ విమర్శ గ్రంథాన్ని వీళ్ళు చదివినారా? అనే సందేహం కూడా ఉన్నది. పై ముగ్గురి జ్యూరీ సభ్యుల నియామకం దాదాపు ఏడాది కిందట జరిగింది. అంటే ఇప్పుడున్న కౌన్సిల్‌కు ఇందుకు సంబంధం లేదు. ఇంత చెత్త నిర్ణయానికి గత జనరల్ కౌన్సిల్ బాధ్యత వహించాలి. వీలయితే ఈ అవార్డు నిర్ణయాన్ని పున: సమీక్షించాలి. ప్రస్తుతం సి. మృణాళిని నేతృత్వంలోని జనరల్ కౌన్సిల్ కూడా యోగ్యులైన వారినే ఇకముందు జ్యూరీ సభ్యులుగా నియమించాలి. ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా చూడాలి. గతం కౌన్సిల్ మాదిరిగా తెలంగాణ అంటే అక్కసుతో గాకుండా విజ్ఞతగా వ్యవహరించాలి. తెలుగు సాహిత్యంలో తెలంగాణ బిడ్డలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను నిరాకరించ కూడదు. అట్లా నిరాకరిస్తే తెలంగాణ సాహిత్యకారులు మరో పోరాటం చేయక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News