Tuesday, May 7, 2024

ఉపాధ్యాయ విద్యలో మార్పులు

- Advertisement -
- Advertisement -

Teacher Education

 

అందుబాటులోకి రానున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి

హైదరాబాద్ : ఉపాధ్యాయ విద్యలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుకు ఏడాది కాల వ్యవధి ఉండేది. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో బి.ఇడి కోర్సు కాల వ్యవధిని నాలుగు సెమిస్టర్లు(రెండు సంవత్సరాలు)కు పెంచారు. అయినా ఉపాధ్యాయ విద్యలో నాణ్యత ప్రమాణాలు అంతగా మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ బి.ఇడి కోర్సును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

2030 నాటికి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ– బి.ఇడి కోర్సు అర్హతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల విడుదలైన జాతీయ విద్యావిధానం వెల్లడించింది. ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరగాలని, నాణ్యతలేని కళాశాలలను వీలైనంతవరకు మూసివేయాలని జాతీయ విద్యా విధానం నివేదిక సూచించింది. కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, ఉపాధ్యాయ నిష్పత్తి 30:1, సామాజికంగా వెనుకడిన ప్రాంతాల్లో 25:1 తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. విద్యాసంస్థలు బహుళ బి.ఇడి కోర్సులను నిర్వహించాలని, నాణ్యతలేని ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసివేయాలని తెలిపింది.

ఇంటర్ అర్హతతో ఇంటిగ్రేటెడ్ బి.ఇడి
ఇంటర్ అర్హతతో నాలుగేళ్ల బిఎస్‌సి.బిఇడి, బిఎ.బిఇడి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉపాధ్యాయ కోర్సుపై నేషనల్ కౌన్సెల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(ఎస్‌సిటిఇ) గతంలో రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరించాయి. ఈ కోర్సులు రాష్ట్రాల వర్సిటీలలో కూడా అమలు చేసేందుకు ఎన్‌సిఇటి కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని నాలుగు రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్‌ఐఇ)లలో ఇప్పటికే డిగ్రీ, బి.ఇడి కోర్సుల సిలబస్‌లను సమీకృతం చేసి ఈ ప్రోగ్రామ్స్‌లను నిర్వహిస్తున్నారు.

ఇంజనీరింగ్, మెడిసిన్ తరహాలో సీరియస్‌గా ఉపాధ్యాయ వృత్తిలో చేరాలను విద్యార్థులు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశం పొందుతారని భావిస్తున్నారు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమెస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులు చదివినవారు బిఎస్‌సి.బిఇడి కోర్సు, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులు చదివినవారు బిఎ.బిఇడి కోర్సులో చేరేందుకు అర్హత కల్పిస్తారు. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సు ద్వారా నాలుగేళ్లలో రెండు డిగ్రీలు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం న్యాయవిద్యలో ఇంటర్ అర్హతతో బిఎ.ఎల్‌ఎల్‌బి, బి.కాం.ఎల్‌ఎల్‌బి, బిబిఎల్‌ఎల్‌బి వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉండగా, త్వరలో ఉపాధ్యాయ విద్యలో సైతం ఈ తరహా ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

Changes in Teacher Education
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News