Thursday, May 2, 2024

60 ఏళ్ల తర్వాత తగ్గిన చైనా జనాభా!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: ఆరు దశాబ్దాల తర్వాత చైనా జనాభా తొలిసారి తగ్గింది. ఈ మేరకు మంగళవారం అధికారిక డేటాను ఆ దేశం విడుదలచేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగిన చైనాలో ఇప్పుడు జనాభా తగ్గింది. జననాల రేటు కూడా రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. చైనాలో నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బిఎస్) 2022 చివరినాటికి జనాభా దాదాపు 1411750000 అని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 850000 మేరకు జనాభా తగ్గింది. జననాలు 9.56 మిలియన్లు కాగా, మరణాలు 10.41 మిలియన్లు అని ఎన్‌బిఎస్ పేర్కొంది.

గతంలో చైనా జనాభా తగ్గింది 1960 దశకం ఆరంభంలో. అప్పట్లో చైనా కరువు పరిస్థితులను ఎదుర్కొంది. మావో జెడాంగ్ అనుసరించిన వ్యవసాయ విధానంతో చైనా తిరిగి పుంజుకుంది. జనాభా విపరీతంగా పెరిగిపోతుండడంతో చైనా 1980 దశకంలో ఒక కుటుంబానికి ఒకే సంతానం అన్న నియమం తెచ్చింది. కానీ 2016లో దంపతులు ఇద్దరు పిల్లలను కనొచ్చని మినహాయింపును ఇచ్చింది. అయినా చైనీయులు ఒకే సంతానంకే మొగ్గు చూపుతున్నారు. రానున్న సంవత్సరాలలో చైనా జనాభా మరింత తగ్గిపోవచ్చునని పిన్‌పాయింట్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన జివీ ఝాంగ్ తెలిపారు. చైనా ఇంటర్నెట్‌పై ఎంత సెన్సార్ పెట్టినప్పటికీ అక్కడ జనాభా తగ్గిపోతోందన్న సమాచారం బయటికి రానే వచ్చింది. అక్కడ కొందరైతే దేశ భవితపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్లలు లేకుంటే దేశానికి, జాతికి భవితే ఉండదు’ అన్న వ్యాఖ్య కూడా ట్విట్టర్ వంటి వీబో సర్వీస్‌లో కనిపించింది.

చైనాలో కొందరు జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయినందున ఆధునిక చైనాలో పిల్లలను కని, పెంచడం చాలా కష్టం అంటున్నారు. ‘పిల్లలు కలిగి ఉండడమంటే అదో సామాజిక బాధ్యత’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘మేమెందుకు పెళ్ళిళ్లు చేసుకోవడంలేదో, ఎందుకు పిల్లలను కనడంలేదో దానిని ఎవరూ ప్రతిబింబించడంలేదు’ అని మరొకరన్నారు. ‘పిల్లలను కన్నాక మహిళలకు ఉద్యోగ భద్రత ఉండాలి’ అని కూడా మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

నేడు చైనాలో దంపతుల తొలి సంతానానికి 3000 యువాన్లు(444 డాలర్లు) ఇస్తున్నారు. అదే మూడో సంతానం కలిగి ఉంటే 10000యువాన్లు ఇస్తున్నారు. చైనా తూర్పు నగరం జినాన్‌లోనైతే రెండో సంతానానికి జనవరి 1 నుంచి 600 యువాన్ల స్టయిపెండ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు చైనాలో సగటున ప్రతి ఏడాది 1.1 శాతం జనాభా క్షీణిస్తోందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అధ్యయనం వెల్లడించింది. ఇదిలావుండగా ఈ ఏడాది భారత జనాభా, చైనా జనాభాను అధిగమించేయగలదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ‘చైనాలో జనాభా తగ్గిపోతుండడం, వృద్ధులు పెరిగిపోతుండడం చైనాకు ఓ సమస్య కాగలదు, అది చైనా ఆర్థిక స్థితిపై ప్రభావం చూపగలదు’ అని పరిశోధకుడు పెంగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News