Sunday, April 28, 2024

ఉక్రెయిన్‌లో ఆవరించిన యుద్ధమేఘాలు

- Advertisement -
- Advertisement -

Clouds of war looming over Ukraine

సరిహద్దుల్లో 1,30,000 రష్యాసైనిక దళాలు
ఐరోపాదేశాలు అప్రమత్తం. ఉక్రెయిన్‌కు రక్షణగా నిలిచిన అమెరికా
ఉక్రెయిన్‌కు ఐరోపా నుంచి విమాన సర్వీసులు రద్దు

వాషింగ్టన్ : ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు ముసురుకొంటున్నాయి. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి సరిహద్దుల్లో దాదాపు 1,30, 000 రష్యా సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించి ముందు జాగ్రత్త చర్యగా ఉక్రెయిన్ రాజధానికి ఐరోపా దేశాలు చాలావరకు విమాన సర్వీసులను రద్దు చేశాయి. నాటో కూటమి దేశాలు ఆదివారం తాజాగా ఉక్రెయిన్ రక్షణ కోసం నౌకలతో ఆయుధాలను చేరవేశాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్సీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో గంటసేపు చర్చలు జరిపారు. రష్యాదాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇద్దరు నేతలు రష్యాదాడులను నిరోధించడానికి దౌత్యపరమైన మంతనాలు సాగించారని శ్వేతభవనం వెల్లడించింది. రష్యా దాడులకు సిద్ధమౌతుందన్న హెచ్చరికలను మొదట ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ అంతగా పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి దారి తీసింది. నాటోసభ్య దేశమైన లిథుయానియా నుంచి విమాన విధ్వంసక క్షిపణులు , పేలుడు పదార్ధాలు ఉక్రెయిన్‌కు రక్షణ కోసం ఆదివారం చేరుకున్నాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తాము దాడి చేస్తామన్న ఆరోపణలను ఖండించారు. పుతిన్, బైడెన్ శనివారం గంటకు పైగా చర్చించినా యుద్ధం ముప్పు తగ్గే ప్రతిపాదన ఏదీ రాలేదు. పశ్చిమదేశాలకు సంబంధించి డచ్చి ఎయిర్‌లైన్ కెఎల్‌ఎమ్ ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులు రద్దు చేసింది. నల్లసముద్ర గగనతలం ప్రమాదకర జోన్‌గా ఉక్రెయిన్ ఎయిర్ ట్రాఫిక్ రక్షణ సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు విమానసర్వీసులను నల్లసముద్రం మీదుగా నడపరాదని హెచ్చరించింది. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మాస్కో, ఉక్రెయిన్ నేతలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికా, నాటో కూటమి దేశాలు రష్యాతో యద్ధానికి తాము ఉక్రెయిన్‌కు మిలిటరీ బలగాలను పంపాలన్న ఉద్దేశం లేదని ప్రకటించాయి. ఏదైనా ముట్టడి జరిగినా, అమెరికా ఆంక్షలు విధించినా ఐరోపా దేశాలకు ఇంధన వనరుల సరఫరా ఆగిపోతుందని, ప్రపంచ మార్కెట్‌పై విపరీత ప్రభావం ఉంటుందని ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

అయితే బైడెన్ ఐరోపా దేశాలకు అభయతారకంగా నాటో తూర్పు భాగంలో సైనిక బలగాలను పంపుతున్నారు. పోలెండ్‌కు అదనంగా 3000 మంది రక్షణ దళాలను పంపిస్తున్నారు. జర్మనీ నుంచి రొమానియాకు 1000 మంది సైనికులను తరలించారు. ఉక్రెయిన్ సరిహద్దులో పోలండ్ కొంత కలిసి ఉండడమే దీనికి కారణం. ఉక్రెయిన్‌లో రష్యాకు అత్యంత సన్నిహితంగా ఉండే పాలకుడు ప్రజా తిరుగుబాటు ఉద్యమంతో పదవీ భ్రష్టుడైన తరువాత 2014 నుంచి రష్యా, ఉక్రెయిన్ల మధ్య తీవ్ర సంఘర్షణ దిగ్బంధం కొనసాగుతోంది. రష్యా దీనికి ప్రతీకారంగా ఉక్రెయిన్ అధీనం లోని క్రిమియన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని తూర్పు ఉక్రెయిన్ లో వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చి పోరాటానికి ఆజ్యం పోయడంతో 14,000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున సాగే ఈ పోరు ఫ్రాన్సు, జర్మనీ మధ్యవర్తిత్వంతో కొంత ఆగినా ఘర్షణలు మాత్రం కొనసాగుతున్నాయి. రాజకీయ పరిష్కార ప్రయత్నాలు ఆగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News