Thursday, May 2, 2024

111 జిఒ ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

111 జిఒ పరిధిలోని ప్రాంతాల్లో రహదారుల విస్తరణ

హిమాయత్ సాగర్, గండిపేట, హుస్సేన్ సాగర్‌లకు కాళేశ్వరం జలాలు
గోదావరి అనుసందానం డిజైన్ ఖరారు చేయాలని అధికారులకు ఆదేశం

జంట జలాశయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

21రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు

జిల్లాలు, మండలాల్లో అధికారికంగా వేడుకల నిర్వహణ

15రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ 
మైనార్టీ కమిషన్‌లో జైన్ ప్రతినిధి

ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ 1, 2 ఫేజ్‌లకు అనుమతి

టిఎస్‌పిఎస్‌సిలో 10 పోస్టులు మంజూరు 
మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్

మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులపాటు జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నూతన సచివాలయంలో గురువారం తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆర్ధిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 21 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో సంబురాలు జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో రోజు ఒక్కో రంగంపై ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
కులవృత్తులను బలోపేతం చేసేందుకు, వారికి ఆర్థికంగా చేయూత అందిచేందుకు విధి విధానాలను రూపొందించాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించినట్లు వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారుడు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే విధంగా పథకం రూపకల్పన చేయాలని సిఎం సూచించారన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

111 జిఒను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం
111 జిఒను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ జిఒ ఎత్తివేయాలని 84 గ్రామాల ప్రజలు ఎంతోకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో 111 జిఒను ఎత్తివేస్తామని సిఎం హామీ ఇచ్చారని, 111 జిఒను ఎత్తివేసి సిఎం కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఈ జిఒ పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నామని ఎన్నో ఏళ్లుగా ఆందోళన చెందుతున్నారని, దీనిపై స్పందించిన సిఎం 84 గ్రామాలకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎలాంటి విధి విధానాలు అమలులో ఉంటాయో, 111 జిఒ పరిధిలోని గ్రామాలకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. గోదావరి నీళ్లతో హిమాయత్ సాగర్, గండిపేటను నింపుతామని తెలిపారు. కాళేశ్వరం జలాలతో హిమాయత్ సాగర్, గండిపేట, హుస్సేన్ సాగర్‌ను అనుసంధానిస్తామన్నారు.

కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్, గండిపేట అనుసంధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హుస్సేన్ సాగర్ గోదావరి జలాలను అనుసంధించాలని కేబినెట్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు హరీశ్‌రావు తెలిపారు. గోదావరి, కృష్ణ,మంజీర నది నుంచి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్‌కు వస్తుంది, కాబట్టి ఉస్మాన్‌సాగర్, గండిపేట చెరువులకు రింగ్ మెయిన్ చేయాలని, ఎస్‌టిపిలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శంకర్‌పల్లి, చేవెళ్ల రోడ్లకు 150 నుంచి 200 ఫీట్లకు అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ను కూడా గోదావరి జలాలతో అనుసంధానం చేయాలని సిఎం అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో 6 డిహెచ్‌ఎంఒ పోస్టులు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 జిల్లాలకు అనుగుణంగా డిఎంహెచ్‌ఒ పోస్టులను మంజూరు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా హైదరాబాద్ పరిధిలోని 6 జోన్లకు అనుగుణంగా 6 డిఎంహెచ్‌ఒలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 38 డిఎంహెచ్‌ఒలు పని చేస్తారని అన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడానికి డిఎంహెచ్‌ఒ పోస్టులను పెంచినట్లు చెప్పారు. బస్తీ దవాఖానాలతో ప్రజలకు ఇప్పటికే ఎంతో మేలు జరిగిందని, నగరంలో ఆరు డిఎంహెచ్‌ఒలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక వైద్యం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. 40 మండలాల్లో కొత్త పిహెచ్‌సిలు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఇప్పటివరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారని, వీటిలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను నియమించలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు.ఆరోగ్య శాఖ రీ ఆర్గనైజేషన్‌లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం..
రైతు బిడ్డ సిఎం కెసిఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మార్పుల కోసం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వడగళ్ల వాన వల్ల ఎంతో నష్టపోయాం, పంట కాలం నెల ముందుకి జరపాలని ప్రణాళిక రచిస్తామని చెప్పారు. నాడు 10 జిల్లాలో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలే అని, నేడు దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అంటే దానికి సిఎం కెసిఆర్ నిర్ణయాలే కారణమని తెలిపారు.

అకాల వర్షాల వల్ల నష్టపోవడం వద్దు అని నెల ముందు పంట జరపాలని యోచిస్తున్నామని, ఎలా ముందుకు తేవాలి అనే దానిపై సబ్ కమిటీ నివేదిక ఇస్తుందని అన్నారు. నకిలీ విత్తనాలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై పిడి యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క రైతు కూడా మోసపోవద్దు అని, దీనిపై కూడా సబ్ కమిటీ పని చేస్తుందని తెలిపారు. మక్కలు, జొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరుపున గ్యారెంటీ ఇస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఉమామహేశ్వర లిఫ్టు ఇరిగేషన్ స్కీంకు అనుమతి
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర లిఫ్టు ఇరిగేషన్ స్కీం ఫేజ్ 1, ఫేజ్ 2లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ విషయంపై ఆ నియోజకవర్గ ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.

విఆర్‌ఎల క్రమబద్దీకరణకు నిర్ణయం
రాష్ట్రంలోని విఆర్‌ఎలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. విఆర్‌ఎలను క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని సిసిఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు కేబినెట్ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

15 రోజుల్లో గొర్రెల పంపిణీ
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వనపర్తి జర్నలిస్టు అసోసియేషన్‌కు 10 గుంటల స్థలం కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు చేసినట్లు తెలిపారు. మైనార్టీ కమిషన్‌లో జైన్ కమ్యూనిటీ కలుపుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కమిషన్ సభ్యులుగా జైన్ కమ్యూనిటీకి చెందిన వారికి ఒకరికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

టిఎస్‌పిఎస్‌సిలో 10 పోస్టులు మంజూరు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ చేపట్టే టిఎస్‌పిఎస్‌సిలో 10 పోస్టుల మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించేందుకు అదనపు పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు.
మూడు గంటలకుపైగా కొనసాగిన కేబినెట్
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నూతన సచివాలయంలో సుమారు మూడు గంటలకు పైగా తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం.. సాయంత్రం 6:15 గంటల వరకు కొనసాగింది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News