Sunday, September 15, 2024

గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం

- Advertisement -
- Advertisement -

అవసరమైన కార్యాచరణను, ప్రణాళికలను వేగవంతం చేయాలి
పోలీస్ విభాగం అధ్వర్యంలో ఉన్న 32 ఎకరాల స్థలాన్ని
వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలి
ఈ ఏడాది నుంచే నర్సింగ్ కాలేజీలను ప్రారంభించాలి
తాత్కాలికంగా అద్దె భవనాల్లో వాటిని నిర్వహించాలి
అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: గోషామహల్ లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని సిఎం అధికారులకు సూచించారు. గోషామహల్‌లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్ కాంప్లెక్స్‌కు దాదాపు 32 ఎకరాల స్థలముంది. ప్రస్తుతం పోలీస్ విభాగం అధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. అక్కడే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను ముఖ్యమంత్రి చర్చించారు. గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి 32 ఎకరాల్లో భవన నిర్మాణానికి నిర్ణయం రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌లను రూపొందించాలన్నారు. 22 జిల్లాల్లో జిల్లా సమాఖ్య భవనాలకు ఎకరం చొప్పున స్థలాన్ని కేటాయించాలని, వచ్చే ఏడాదిలోపు కొత్తగా 15 నర్సింగ్ కాలేజీ భవనాలను నిర్మించాలని దీనికి అధికారులు ప్రణాళికలు పూర్తి చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు.

50 ఏళ్ల అవసరాలను అంచనా వేసుకొని
ఈ సమావేశంలో భాగంగా రాబోయే 50 ఏళ్ల అవసరాలను అంచనా వేసుకొని, కొత్త ఆసుపత్రి నిర్మాణ డిజైన్లు ఉండాలని సిఎం అధికారులను అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని ఆయన చెప్పారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకాడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలని సిఎం ఆదేశించారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబా టులో ఉండాలని ఆయన సూచించారు.

కేవలం కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు కాకుండా ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండేలా డిజైన్లు ఉండాలని సిఎం అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి అనుభవజ్ఙులైన ఆర్కిటెక్ట్‌లతో డిజైన్ లను తయారు చేయించాలని అన్నారు. ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడుతామని ముఖ్యమంత్రి చెప్పారు.

పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలి
మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌లను సిఎం ఆదేశించారు.

ఇప్పుడు గోషామహల్ లో ఉన్న పోలీస్ స్టేడియం, స్పోర్ట్ కాంప్లెక్స్ ను అక్కడికి తరలించేలా చూడాలని సిఎం చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని, 15 నర్సింగ్ కాలేజీ భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు వీలుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచే నర్సింగ్ కాలేజీలను ప్రారంభించాలని, తాత్కాలికంగా అద్దె భవనాల్లో వీటిని నిర్వహించే ఏర్పాట్లు చేయాలన్నారు.

22 జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భవనాలు
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే పది జిల్లాల్లో సమాఖ్య భవనాలున్నాయని, మిగతా 22 జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఒక్కో జిల్లాలో సమాఖ్య భవనాలకు ఒక ఎకరం స్థలం కేటాయించేందుకు అంగీకరించారు. ముందుగా స్థలాలను గుర్తించాలని అధికారులను సిఎం ఆదేశించారు. హైదరాబాద్ లోని శిల్పారామం పక్కనే మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని వెంటనే ఆ విభాగానికి బదిలీ చేయాలని సిఎం ఆదేశించారు.

మహిళా శక్తి సంఘాలు తయారు చేసే తమ ఉత్పత్తులతో అక్కడ ఏడాది పొడవునా వివిధ స్టాళ్లు నిర్వహించేలా భారీ ఏర్పాట్లు చేయాలని సిఎం చెప్పారు. ప్రపంచ స్థాయి అతిథులు, వివిధ రంగాల ప్రముఖులు, జాతీయ స్థాయి నేతలు ఎవరూ హైదరాబాద్‌కు వచ్చినా తప్పకుండా సందర్శించే స్థలంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ఏడాది పొడవునా నిర్వహించే ఎగ్జిబిషన్‌లా వివిధ రకాల ఉత్పత్తులు అక్కడ అందరికీ అందుబాటులో ఉంచాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News