కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతి
మేడారం కీర్తిని ప్రపంచానికి చాటుతాం
ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు
పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మ
సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు
68 కేజీల నిలువెత్తు బంగారం సమర్పించిన సిఎం
అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారంలో వన దేవతలను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు 68 కేజీల నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం మేడారంలో గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు, పూజారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సిఎం తెలుసుకున్నారు. ఆలయాన్ని విస్తరణ, అభివృద్ధిని ముక్తకంఠంతో పూజారులు, ఆదివాసీ సంఘాలు ఏకీభవించారు. ఆదివాసీ సంసృ్కతి, సంప్రదాయాలకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆదివాసీ సంఘాలు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..మేడారం వన దేవతల కీర్తిని ప్రపంచానికి చాటుతామని అన్నారు. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని, ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలి
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు
మేడారంలో వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించాలని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క సారలమ్మ ఆలయం ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైన వారి జన్మ ధన్యమవుతుందని అన్నారు. ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది….ఆదాయం ఆశించి కాదు.. భక్తితో పనిచేయాలని సూచించారు. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలన్నారు.
జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైనచోట చెక్ డ్యామ్‌లు నిర్మించాలని, రాబోయే వంద రోజులు సమ్మక్క సారలమ్మ మాలధారణ చేసినట్లుగా నిష్ఠతో పనిచేయాలన్నారు. నిధులు గ్రీన్ చానల్‌లో విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పనులు పూర్తి చేయించుకునే బాధ్యత మీపై ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే మహా జాతరకు విచ్చేసే భక్తులకు మరింత సౌకర్య వంతంగా ప్రభుత్వ పక్షాన కల్పించాలనే ద్యేయంతో, గిరిజనుల సంసృ్కతి, సాంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని సమ్మక్క సారమ్మల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆదివాసీ సంసృ్కతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే, వారిని భాగస్వాములను చేస్తూ ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు.
జాతర తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక
అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిందని, ఈ జాతర తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆదివాసీలు దేశానికి మూలవాసులని, పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మ తల్లులని అన్నారు. తాను ఎంఎల్‌ఎగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తున్నాన నని అన్నారు. 2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డమీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని, సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించి, శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామనివివరించారు. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో మీ అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చామని అన్నారు.
సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే తమ ప్రభుత్వ అభిమతం అన్నారు. ఇది డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో కొలిచేదని, ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలన్నారు. మేడారం జాతర తెలంగాణ సాంసృ్కతిక గొప్పతనాన్ని, గిరిజనుల పోరాట చరిత్రను ప్రతిబింబిస్తుందని, ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందేలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మేడారంలో సమ్మక్క- సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల డిజైన్లను విడుదల చేశారు. తెలంగాణ ప్రాంతంలో ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ ప్రాంగణం కూడా ఒక గొప్ప దేవాలయమని, ఈ జాతరకు ఎన్నో ఏళ్ల చరిత్ర పోరాట ప్రతిమ రాచరికంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.
జాతర ప్రాశస్త్యం అనేక శతాబ్దాలు గుర్తిండిపోయేలా ప్రణాళికలు: సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించడం కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గద్దెల పునరుద్ధరణలో భాగంగా భక్తుల విశ్వాసం, నమ్మకం, ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాతర ప్రాశస్త్యం అనేక శతాబ్దాలు గుర్తిండిపోయేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. వనదేవతల ప్రాంగణాన్ని పూర్తిగా గ్రానైట్ రాయి తో నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర 13వ శతాబ్దంలో మొదలైందని మరో వెయ్యి సంవత్సరాలు జాతర వైభోగం, ఆదివాసి సాంప్రదాయాలు, గుర్తుండేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు.
గతంలో సమ్మక్క సారలమ్మ మహా జాతరను అధికారికంగా నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరామని, అదే మాదిరిగా తన కోరికను తీరుస్తూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగి జాతరను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించామని, అదే మాదిరిగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని, కనుక వెంటనే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ ఆసీసుల ద్వారా సకల జనులు బాగుంటారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తల్లుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. వెయ్యేళ్ళ పాటు పటిష్టమైన రీతిలో ఉండేలా నిర్మాణం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గద్దెల విస్తరణ విషయంలో అనేక అపోహలు ఉన్న నేపథ్యంలో నిర్మాణం ఏ విధంగా జరగాలని, ఆచార సాంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడడం కోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉందని తల్లుల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎసిలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎంఎల్‌ఎలు తెల్లం వెంకట్రావు, బాలు నాయక్, కడియం శ్రీహరి, డా. మురళీనాయక్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వెడ్మా బొజ్జు, సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు,ముందు ములుగు జిల్లా, ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం, మేడారంనకు హెలికాప్టర్ లో 12 గంటల 27 నిముషాలకు చేరుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలకు మంత్రులు దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు సభ్యులు పోరిక బాలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎంఎల్‌సిలు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్‌పి డాక్టర్ శబరీష్ పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుండి కమాండ్ కంట్రోల్ రూం ప్రాంగణంలో ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గిరిజన కొమ్ము కోయనృత్యంతో, గిరిజన సంప్రదాయం ప్రకారం గద్దెల వద్దకు సిఎంకు ఘన స్వాగతం పలికారు.
Also Read: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం