Thursday, May 2, 2024

ఛత్తీస్‌గఢ్ బొగ్గు కుంభకోణం కేసు… కాంగ్రెస్ నేతల నివాసాలపై ఈడీ దాడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఉదయం అనేక ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు, పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగాయి. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో ఈనెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది.

దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ఎమ్‌ఎల్‌ఎ దేవేంద్ర యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్, రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ సుశీల్ సన్నీ అగర్వాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ నివాసాలతోసహా దాదాపు 14 ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు, కొంతమంది ఎమ్‌ఎల్‌ఎలకు చెందిన నివాసాల పైనే ఈ దాడులు జరిగాయి. ఈ కోల్ లెవీ స్కాంలో కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ రామ్‌గోపాల్ అగర్వాల్‌కు రూ.52 కోట్లు ముడుపులు ముట్టినట్టు డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.ఆరిడోంగ్ మైనింగ్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

కొందరు రాజకీయ నేతలు, అధికారులు దాదాపు రూ.540 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, 2021లో బొగ్గు రవాణాలో ప్రతి టన్ను బొగ్గుకు అక్రమంగా రూ.25 వంతున వసూలు చేశారని, సీనియర్ బ్యూరోక్రాట్స్, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, మధ్యవర్తుల ప్రమేయం ఇందులో ఉందని ఈడీ వర్గాలు ఆరోపించాయి. ఈ కుంభకోణం నిధులను ఖైరాఘడ్ ఉప ఎన్నికకు వినియోగించారని ఈడీ ఆరోపించింది. గత ఏడాది అక్టోబరులో ఈడీ జరిపిన దాడుల్లో రూ. 4 కోట్ల నగదు, ముఖ్యమైన కీలక పత్రాలు దొరికాయి. ఇప్పటివరకు రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ చౌరాసియా, సూర్యాకాంత్ తివారీ, ఆయన బాబాయి లక్ష్మీకాంత్ తివారీ, ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐఎఎస్ అధికారి సమీర్ విష్ణోయ్, బొగ్గు వ్యాపారి సునీల్ అగర్వాల్ తదితరులు మొత్తం తొమ్మిది మంది అరెస్టు అయ్యారు. వారి ఆస్తులు కూడా అటాచ్ అయ్యాయి.

పోరాడి గెలుస్తాం: సిఎం భూపేష్ బఘేల్
ఈడీ దాడుల నేపథ్యంలో సీఎం భూపేష్ బఘేల్ సోమవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. భారత్ జోడో యాత్ర విజయవంతమై అదానీకి సంబంధించిన నిజానిజాలు బట్టబయలు కావటంతో బీజేపీ నిరుత్సాహానికి గురైందన్నారు. ఈడీ దాడులు దృష్టి మరల్చే ప్రయత్నమని, దేశానికి నిజాలు తెలుసునని, ఏదేమైనా పోరాడి గెలుస్తామని బఘేల్ పేర్కొన్నారు. ఈమేరకు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News