Sunday, April 28, 2024

లా కమిషన్ నివేదికపై చర్చ జరగాలి: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల సీజన్‌లో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి) అంశాన్ని బిజెపి రెచ్చగొడుతోందని ఆదివారం కాంగ్రెస్ విమర్శించింది. యుసిసి వాంఛనీయం కాదు, ఆచరణీయము కాదు అన్న లా కమిషన్ నివేదికపై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేసింది. స్త్రీపురుషులకు సమాన న్యాయం ఉండాలి, ఎలాంటి లింగభేద తేడాలు ఉండకూడదని కూడా కాంగ్రెస్ కోరుకుంటోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ అన్నారు. న్యాయమూర్తి బిఎస్. చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ నివేదిక 2018లో యుసిసికి అనుకూలత వ్యక్తం చేయలేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. యుసిసి రిపోర్ట్‌పైన పార్లమెంటులో చర్చ జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం పార్లమెంటులో యుసిసిపై చర్చను అనుమతించడంలేదని పేర్కొన్నారు.

“ఎన్నికల సమయంలో బిజెపి వారు ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి విచ్ఛిన్నకర అంశాలను లేవనెత్తుతుంటారు. కానీ ఎన్నికలు అయిపోగానే తర్వాత వాటిని మర్చిపోతుంటారు” అన్నారు. గుజరాత్‌లో యుసిసిని తెస్తామని బిజెపి వాగ్దానం చేసిన తర్వాత జైరామ్ రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం యుసిసి అనేది జాతీయ సమస్య, తమ పార్టీ అన్ని రాష్ట్రాలలో దానిని తెస్తుంది అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News