Saturday, April 27, 2024

విపక్ష కూటమి సమస్య రాహుల్

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల వరకు ఓపిక పడితే, 2024లో రాహుల్ గాంధీ మంత్రి వర్గంలో సిద్దరామయ్యను చేర్చుకొని, శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఖాళీ చేస్తారులే అనే మాటలు కూడా వినబడ్డాయి.

అయితే దేశంలో కాంగ్రెస్, బిజెపి బలాబలాలు పరిమితంగా ఉన్నాయనే విషయాన్నీ గ్రహించలేకపోతున్నారు.ఆ రెండు పార్టీలు కూడా దాదాపు ఒకే ప్రాంతంలో బలంగా ఉంటూ ఉండడంతో ఒక పార్టీ ఓటమి చెందితే, మరోపార్టీ గెలుపొందడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలలో; వచ్చే డిసెంబర్‌లో జరుగబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో కూడా అదేవిధంగా జరిగే అవకాశం ఉంది.
అయితే ఒక్కొక్క రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడంలో మాత్రం ఈ రెండు పార్టీలు వెనుకబడి వున్నాయని గమనించాలి. ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రమే సమాజ్‌వాది పార్టీని కాదని బిజెపి అధికారంలో ఉంది. మరే ముఖ్యమైన రాష్ట్రంలో కూడా బిజెపి, కాంగ్రెస్ ఒకరిపై మరొకరు విజయం సాధించకుండా మరేదైనా పార్టీపై గెలుపొంది అధికారం పొందుతున్న దాఖలాలు లేవు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూకశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో.. అంటే సంగం కన్నా ఎక్కువ రాష్ట్రాలలో ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రత్యర్థులు కావు.

మరో పార్టీ అండలేకుండా ఈ రెండు జాతీయ పార్టీలలో ఏ పార్టీ కూడా అధికారంలోకి రావడం అసాధ్యం కాదు. అందుకనే 2024 ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్‌లకు నిజమైన సవాళ్లు ప్రాంతీయ పార్టీల నుండి ఎదురుకానుంది. కర్ణాటకలో అధికారం కోల్పోయాక, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలలో సహితం ప్రాబల్యం కోల్పోతున్న తరుణంలో బిజెపి 2014, 2019లలో మాదిరిగా సొంత బలంపై కేంద్రంలో అధికారంలోకి రావడం సులభం కాబోదు.
బిజెపిని ఓడించడం కోసం ప్రతిపక్షాలు అన్నీ ఒక వేదికపైకి రావాలని అందరూ చెబుతున్నా సాధ్యం కాలేకపోవడానికి కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరియే కారణం అని ఈ సందర్భంగా గ్రహించాలి. అందుకనే బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా లేని జాతీయ కూటమి అవసరం అనే వాదనలను దేశంలో మమతా బెనర్జీ, కెసిఆర్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన పురోగతి సాధించలేక పోవడానికి ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ అనుసరిస్తున్న ‘పెద్దన్న’ ధోరణి కావడం గమనార్హం. కాంగ్రెస్ లేకుండా బిజెపి వ్యతిరేక కూటమి సాధ్యం కాదని చెప్పడం వరకు అర్థం చేసుకోవచ్చు. అయితే, అటువంటి కూటమికి కాంగ్రెస్ మాత్రమే నాయకత్వం వహించాలి అనడం, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఒప్పుకోవాలని అనడమే ఇబ్బందికరంగా మారుతుంది.

ఉమ్మడి ప్రతిపక్ష వేదిక ఏర్పాటు కోసం ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే ఇంటికి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో కలసి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెళ్లిన్నప్పుడు దారుణమైన అనుభవం ఎదురైంది. వారి చర్చలలో పాల్గొన్న రాహుల్ గాంధీ దేశంలో అన్ని ప్రతిపక్షాల నాయకులను కలిసి, తన నాయకత్వానికి మద్దతు సమీకరించండి అన్నట్లుగా మాట్లాడారు. రాహుల్ గాంధీ మాట్లలపై ఆ తర్వాత ఖర్గే వద్ద నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా అందరినీ రాహుల్ సామంత పార్టీలు అనుకొంటున్నారా? అందరం ఉమ్మడిగా కలిసి పని చేయాలి గాని, అందరిని తీసుకొచ్చి రాహుల్ కోసం పని చేయించడం మాకేమి సంబంధం?‘ అని నిలదీశారు. దానితో రాహుల్ మాటలను అంత సీరియస్‌గా తీసుకోవద్దని సముదాయించే ప్రయత్నం ఖర్గే చేశారు.
తానేదో రాకుమారుడు అయిన్నట్లు, బిజెపి గద్దె దిగితే ఇక అధికారం తనదే అన్నట్లు అనుసరిస్తున్న రాహుల్ గాంధీ వైఖరి కారణంగా ప్రతిపక్షాలలో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కలిగించలేక పోతున్నది. మొదటిసారిగా సూరత్ కోర్టు తీర్పు సాకుగా వెంటనే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసినప్పుడు ఆయనకు మద్దతుగా మమతా బెనర్జీ, శరద్ పవార్, కెసిఆర్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు మాట్లాడారు.కానీ, రాహుల్ సారథ్యంలో పాల్గొనే ఏ సమావేశంలో లేదా కార్యక్రమంలో ఇటువంటి నాయకులు పాల్గొన్న సందర్భం లేదు. అయితే ఇతర పక్షాలను కలుపుకొని వెళ్లడంలో సోనియా గాంధీ కొంత పరిణితి ప్రదర్శించేవారు. కానీ రాహుల్ గాంధీలో అటువంటి లక్షణాలు కనిపించడం లేదు. 2018లో ఎన్‌డిఎ నుండి బైటకు వచ్చిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సహితం రాహుల్ గాంధీతో చేతులు కలిపడం జాతీయ స్థాయిలో ఆయనపట్ల కొంత చులకన భావం ఏర్పడేందుకు దారితీసింది.
ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి, అక్కడ ఉమ్మడిగా మీడియా సమావేశంలో పాల్గొంటూ వచ్చి చేరమని ఫోన్ చేయడంతో శరద్ పవార్ ఆశ్చర్యపోయారు. ‘ఏమాత్రం పరిమితిలేని నేత రాహుల్. ఇప్పటి వరకు నేను వెళ్లి కలవనేలేదు. ఎంతో అనుభవం ఉందనుకొంటున్న చంద్రబాబు వెళ్లి కలవడమే కాకుండా, నన్ను కూడా రమ్మంటున్నాడు’ అంటూ చుట్టూ ఉన్నవారి వద్ద విస్మయం వ్యక్తం చేశారు. రాహుల్ నాయకత్వం పట్ల కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తన చుట్టూ ఉన్న రాజకీయ ప్రతిపాదికలేని భజనపరులతో పార్టీని నడిపించే ప్రయత్నమే బెడిసికొడుతున్నట్లు స్పష్టం అవుతుంది. రాజస్తాన్‌లో సచిన్ పైలట్, మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాలను ముఖ్యమంత్రులుగా చేయాలని రాహుల్ ఐదేళ్ల క్రితం పట్టుబడితే సోనియా, ప్రియాంక గాంధీ కలిసి వారించారు.
నిజంగా వారిద్దరినీ ముఖ్యమంత్రులుగా చేసి ఉంటే ఈపాటికి ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఏవిధంగా ఉండేదో కదా! ఛత్తీస్‌గఢ్ లో సహితం రాహుల్ అభిప్రాయానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ఎంపిక జరిగింది. కర్ణాటకలో మాత్రం ముఖ్యమంత్రి ఎంపికలో కొంత పరిణితి ప్రదర్శించినట్లు కనిపిస్తున్నది. ఏదేమైనా బిజెపిని ఓడించాలి అంటే ఇతర ప్రతిపక్షాలతో కలసి పని చేయడానికి రాహుల్ సిద్ధపడాలి. అలా కాకుండా, ఇతర ప్రతిపక్షాలు వచ్చి తన నాయకత్వంలో పని చేయాలి అనుకొంటే కాంగ్రెస్ ఏకాకిగా మిగిలే ప్రమాదం ఉంది. మహారాష్ట్రాలో సహితం మూడేళ్ళ క్రితం శివసేన, ఎన్‌సిపిలతో కలసి ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ విముఖత చూపితే, కాంగ్రెస్ సిద్ధంకాని పక్షంలో తాము పార్టీని వదిలి వెళ్లి ప్రభుత్వంలో చేరుతామని కాంగ్రెస్ ఎమ్యెల్యేలు స్పష్టం చేయడంతో రాహుల్ ఒప్పుకోక తప్పలేదు.
ఏ రాష్ట్రంలో అయితే స్థానికంగా బలమైన నాయకులు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ ఎన్నికలలో చెప్పుకోదగిన విజయాలు సాధించగలుగుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో అదే జరుగుతుంది. స్థానికంగా బలమైన నాయకత్వం లేని తెలంగాణ, పంజాబ్, అసోం, ఒడిశా వంటి రాష్ట్రాలలో ప్రతికూలతను ఎదుర్కోక తప్పడం లేదు. అసోం, పంజాబ్ వంటి రాష్ట్రాలలో బలమైన కాంగ్రెస్ నాయకులు కేవలం రాహుల్ గాంధీ ఒంటెత్తు పోకడల కారణంగా కాంగ్రెస్‌కు దూరం కావడంతో పార్టీ బలహీనమై పోయిందని ఈ సందర్భంగా గుర్తించాలి. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కర్ణాటకలో బిజెపి ఓటమికి సహితం నాయకత్వ సంక్షోభమే ప్రధాన కారణంగా వెల్లడయింది.
నేడు ప్రతి రాష్ట్రంలో బలమైన నాయకత్వాలు ఆవిర్భవించడం, ప్రజలలో బలమైన ఆకాంక్షలు ఏర్పడుతూ ఉండడంతో జాతీయ రాజకీయ పక్షాలు సహితం అందుకు అనువుగా వ్యవహరించాలి. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు, ఒకే దేశం ఒకే పన్ను అన్న విధంగా దేశం మంతటా ఒకే రకమైన రాజకీయ వ్యూహాలు ఫలవంతం కాబోవని కాంగ్రెస్, బిజెపి – రెండూ గ్రహించాలి. వాస్తవానికి కర్ణాటక ఎన్నికలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మరే రాష్ట్రంలోనే కాకుండా, చివరకు ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో సహితం అంతగా కష్టపడి ప్రచారం చేసి ఉండరు. కానీ స్థానికంగా ఏ నాయకుడిని ప్రజల ముందు చూపించకుండా, స్వయంగా ప్రధాని ప్రచారం చేయడం ఒక విధంగా బిజెపికి ఎదురు దెబ్బ తగిలేందుకు దారితీసింది.
హైదరాబాద్ నుండి ఒక ప్రముఖుడు పక్షం రోజుల పాటు కర్ణాటక బిజెపి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు కన్నడం వచ్చని, కన్నడంలో మాట్లాడగలరని ఆయన ప్రయాణించిన కారు డ్రైవర్ కు తెలియదు. ఆ కారు డ్రైవర్ దాదాపు ప్రతి రోజూ ఎవ్వరో ఒకరితో ఫోన్‌లో ‘మా దగ్గరకు వచ్చి ఎవ్వరికి ఓటు వేయాలో చెప్పడానికి ఈయన ఎవ్వరు? మాకు నాయకులు లేరా? మేము నిర్ణయం తీసుకోలేమా? లోక్ సభ ఎన్నికలలో వచ్చి ఆయన ఓట్లు అడగవచ్చు గాని అసెంబ్లీ ఎన్నికలతో ఆయనకు ఏమి సంబం ధం?’ అంటూ ప్రధాని మోడీ ప్రచారం గురించి మాట్లాడటం గమనించారు. అందుకనే బిజెపి, కాంగ్రెస్ ప్రభావానికి పరిమితులు ఉన్నాయని గ్రహించాలి. దేశంలో వివిధ ప్రాంతాలలోని ప్రజల అభిలాషులలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగానే ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క ప్రాంతీయ పార్టీ బలమైన ప్రభావం చూపుతున్నదని అర్థం చేసుకోవాలి. ప్రాంతీయ వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారానే జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు సాధ్యం కాగలదు. 2024 ఎన్నికలలో అప్పుడే నిర్ణయాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News