Saturday, July 27, 2024

సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22 మందికి పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Corona for 22 People in Same Family in Suryapet

 

యాదాద్రి టౌన్‌షిప్‌ను జల్లెడపడుతున్న వైద్యులు
సూర్యాపేటలో ఇది రెండోసారి

మన తెలంగాణ/సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌లో ఒకే కుటుంబంలోని 22 మందికి కరోనా పాజిటివ్ తేలింది. గత వారం క్రితం టౌన్‌షిప్‌లో ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించకపోవడంతో బంధువులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే కుటుంబంలో కరోనా లక్షణాలు ఉన్న 38 మందికి పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు అంతా ఆందోళన చెందుతున్నారు. ఆ రోజు ఎంత మంది ఎక్కడి నుంచి వచ్చారనేది ఆరా తీస్తున్నారు. వారితో ఉన్న అనుబంధాలను, సంబంధాలను అంచనా వేస్తూ ప్రభుత్వ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఆందోళనలో బంధుమిత్రులు
టౌన్‌షిప్‌లో ఒక ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందడంతో ఆయన బంధుమిత్రులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మోతె మండలంలోని రాఘవాపురం గ్రామానికి చెందిన ఆయనకు సంబంధించిన బంధువులంతా కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు సమాచారం. దీంతో పాటు సూర్యాపేట పట్టణంలోని పలువురు ఉద్యోగులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. అదే కుటుంబంలోని వారికి కరోనా పాజిటివ్ తేలడంతో వారితో కాంటాక్టు అయిన వ్యక్తులందరూ కరోనా పరీక్షలకు వెళ్లాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య సిబ్బంది సంబంధిత వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. పట్టణంలోని ప్రముఖ వ్యక్తులు కూడా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు తెలుస్తోంది. వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

జల్లెడ పడుతున్న సిబ్బంది
హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన యాదాద్రి టౌన్‌షిప్‌లో 10 నుండి 20 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నారు. చుట్టు పక్కల కూడా రెండు టౌన్‌షిప్‌లు ఉండడం తో పాటు సంబంధిత వ్యక్తులకు సూర్యాపేటలో బంధువులు ఉన్నారు. వారు కూడా పరామర్శించినట్లు తెలుస్తోంది. దీంతో టౌన్‌షిప్‌లోని వారందరిని వైద్య ఆరోగ్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఇంటి ఇంటికి వెళ్లి కరోనా టెస్టులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన 22 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఎవరూ కూడా ఇతరులతో సంబంధం పెట్టుకోవద్దని, ఇల్లు దాటి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

అప్రమత్తం చేస్తున్నాం : డిఎంహెచ్‌ఓ హర్షవర్ధన్
టౌన్‌షిప్‌లో కరోనా వ్యాధి 22 మందికి నిర్ధారణ అయిందని సూర్యాపేట డిఎంహెచ్‌ఓ హర్షవర్ధన్ తెలిపారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచామని వివరించారు. టౌన్‌షిప్‌లో ప్రతి కుటుంబాన్ని పరిక్షీస్తున్నామని, అదే విధంగా సంబంధిత వ్యక్తులతో సంబంధం ఉన్న మొదటి, రెండవ కాంటాక్టు సభ్యులను కూడా గుర్తించే పనిలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారని వివరించారు. ఎవరైనా అంత్యక్రియలకు హాజరైన వారు ఉంటే విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్వచ్ఛందంగా స్పందించి వైద్య ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని, ఎలాంటి భయాందోళనకు ప్రజలు గురి కావద్దని కోరారు.

Corona for 22 People in Same Family in Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News