Monday, April 29, 2024

కరోనా టీకాకు పచ్చజెండా

- Advertisement -
- Advertisement -

Green Signal for Covid-19 Vaccine in India పిచ్చి కుక్క మాదిరిగా, తోక తొక్కిన పాము చందంగా ఇప్పటికి 10 మాసాలుగా ప్రపంచాన్ని మృత్యు కాటుకు గురి చేస్తున్న కోవిడ్ 19( కరోనా) మెడలు వంచి, అది తోక ముడిచి పారిపోయేలా చేయడానికి కొద్ది మాసాల క్రితం ప్రారంభమైన మానవ మహా కృషి కొలిక్కి వస్తున్నది. మిన్ను మన్ను కానకుండా ఉచితానుచిత విచక్షణ లేకుండా ఇంకా మన ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ మహమ్మారిని నిశ్శేషం చేసి దానిని పూర్తిగా జయించడమనే మహ త్తర లక్షం నూతన సంవత్సరంలో మనిషి ముందు నిలువెత్తున నిలిచింది. ఈ లక్ష సాధనలో తొలి అడుగులు ఇప్పటికే పడ్డాయి. అమెరికా కంపెనీ ఫైజర్, జర్మనీ బయోటెక్నాలజీ సంస్థ బయో ఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన ఫైజర్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. టీకా సామర్థాన్ని నిర్ధారించే నైపుణ్యం అందుకు తగిన సదుపాయాలు లేని పేద దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి అత్యంత ఉపయోగకరమైనది. ముందు వెనుకలు ఆలోచించకుండా దాని నిర్ణయాన్ని పాటించి ఆ టీకాను అవి వినియోగించుకోవచ్చు. అయితే ఫైజర్ టీకా సురక్షిత నిల్వకు అవసరమైన అతిశీతలమైన (మైనస్ 70 సెల్సియస్) గిడ్డంగి సదుపాయాలు ఇతర ఖరీదైన హంగులు పేద దేశాల్లో ఉండవు.

అలాగే గ్రామీణ భారతంలోనూ అవి దుర్లభం. ఫైజర్‌కు ధనిక దేశాల్లో ఇప్పటికే అనుమతి లభించింది. అమెరికా, బ్రిటన్, ఉమ్మడి యూరప్ మరి 12 దేశాలు ఈ టీకాను ఆశ్రయించడానికి నిర్ణయం తీసుకున్నాయి. బ్రిటన్ గత నెల 3నే దీనిని అత్యవసర వినియోగానికి ప్రయోగించింది. కెనడా డిసెంబర్ 9న, అమెరికా డిసెంబర్ 11న ఫైజర్‌ను వినియోగంలోకి తెచ్చాయి. ఫైజర్‌తో పాటు మోడెర్నా అనే మరో టీకాను కూడా అమెరికా అభివృద్ధి పరిచింది. మోడెర్నా ఇన్‌కార్పొరేషన్, అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ దీనిని అభివృద్ధి పరిచాయి. మోడెర్నా నిర్వహణ సుళువైనది. ఫైజర్‌కు ఉండి తీరవలసిన స్థాయి అతిశీతల నిల్వ సదుపాయాలు మోడెర్నాకు అవసరం లేదు. అమెరికాలో ఇప్పటికీ హద్దూ ఆపూ లేకుండా కోవిడ్ విజృంభిస్తున్నది. రోజుకి కొన్ని పదుల వేల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. అందుచేత అక్కడ టీకాను వీలైనంత ఎక్కువ మందికి శీఘ్రతరంగా అందించడం తప్పనిసరి. స్విట్జర్లాండ్ కూడా ఫైజర్‌కు పచ్చ జెండా ఊపింది. అది అత్యంత సురక్షితమైనదని స్విస్ మెడిక్ సంస్థ నిర్ధారించింది.

భారత దేశానికి సంబంధించి కోవిషీల్డ్డ్ టీకాకు దారి ఏర్పడినట్టు తెలుస్తున్నది. ఈ టీకాను ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ, ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేశాయి. దీనిని భారత దేశంలో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. భారత్ బయోటెక్ కూడా తన కోవాక్సిన్ టీకాకు అనుమతిని కోరింది. కోవాక్సిన్ మొట్టమొదటి దేశీయ కోవిడ్ విరుగుడు వ్యాక్సిన్‌గా రంగంలోకి వస్తున్నది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ జరుపుకున్న కరోనా టీకా నేడు మిగతా దేశమంతటా పరీక్షకు నిలబడుతున్నది. రాష్ట్రంలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మూడేసి ఆసుపత్రుల్లో నేడు టీకా డ్రైరన్ జరుగనున్నది. అతి త్వరలోనే దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ నిత్యం 10 లక్షల మందికి టీకా వేయించే సంసిద్ధతలో ఉందని సమాచారం. శుక్రవారం నాడు సుదీర్ఘంగా సమావేశమైన భారత ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ కోవిషీల్డ్‌తో పాటు దేశీయ కో వ్యాక్సిన్ టీకాకు కూడా పచ్చజెండా ఊపిందని తెలిసింది. ప్రపంచంలోనే రెండవ అతి ఎక్కువ జనాభా కలిగిన భారత దేశంలో కోట్లాది మందికి వీలైనంత తక్కువ సమయంలో కరోనా టీకా అందించడం అతి పెద్ద సవాలుతో కూడిన వ్యవహారం. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ టీకా నిల్వ సదుపాయాలను ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకు వెళ్లే వ్యవస్థలను నెలకొల్పారు.

టీకా వీలైనంత ఎక్కువ మందికి వేయగలిగితే అది సామూహిక రోగ నిరోధకతను కలిగించి దానిని ఇంకా వేసుకోనివారిలో కూడా వైరస్‌తో పోరాడే శక్తిని కలిగిస్తుంది. అమెరికాతో పోల్చుకుంటే మన దేశం చాలా తక్కువ కేసులతో, మృతుల సంఖ్యతో ఒక మాదిరి సురక్షిత స్థితిలో ఉన్నట్టే లెక్క. ఇందుకు మన ప్రజల ఆహారపు అలవాట్లు వంటివి దోహదం చేస్తున్నాయని భావించవచ్చు. భారతీయుల్లో రోగ నిరోధక శక్తి గణనీయంగా ఉండడం వల్లనే కోవిడ్ విజృంభణ పరిమితంగా ఉందని అనుకోడానికి అవకాశముంది. సహజ సిద్ధమైన ఆహారాన్ని అందిం చే సేంద్రియ పంటలను కాపాడుకొని బలమైన ఆహారాన్ని తీసుకునే అలవాటును కొనసాగించడమే మనకు రక్షణ కవచంగా నిరూపించుకుంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News