Wednesday, May 1, 2024

దవాఖానాల్లో కరోనా కలకలం

- Advertisement -
- Advertisement -

Corona for 70 doctors and staff at Gandhi Hospital

సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. వైద్యులు, నర్సులు, పిజిలు, హౌస్ సర్జన్లతో పాటు పలువురు వైద్య విద్యార్థులకు, ఇతర సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ తేలిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రావు తెలిపారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 139 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వీరిలో 35 మంది గర్భిణులు కూడా ఉన్నారని వెల్లడించారు. కరోనా సోకిన వైద్య సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం అందించ నున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అలాగే ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో ఇన్ పేషెంట్లుగా ఉన్న 57 మంది, 9 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయిస్తున్నట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తల తీసుకుంటున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమా శంకర్ వెల్లడించారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో తాజాగా 20 మంది నర్సులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే 79 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా సోకగా, వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో మిగతా వైద్యులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ రిపోర్టులు బయటకు వస్తే కరోనా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో వైద్యులకు కరోనా సోకడంతో అక్కడి సిబ్బంది, రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కొత్తగా 2,447 కొవిడ్ కేసులు

రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 80,138 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,447 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,11,656కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,112 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,060కు చేరింది. తాజాగా కరోనా నుంచి 2,295 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,85,399 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.31 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 10,732 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

ఎంజీఎంలో కరోనా కలకలం
మనతెలంగాణ/ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్య సిబ్బందిలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో అటు వైద్యులు, ఇటు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సోమవారం వైద్యులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 69 మందికి కరోనా సోకినట్లు తెలింది. దీంతో వైద్య సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రి కార్యనిర్వాహణాధికారి బత్తుల శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శ్రీనివాస రావును కలిసిన వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 69 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అందులో రోగులకు వైద్యం అందించే 9మంది ఆస్పత్రి హౌస్ సర్జన్స్, 15మంది స్టాఫ్ నర్స్‌కు, 9మంది పారా మెడికల్ సిబ్బందికి, 16మంది సపోర్ట్ స్టాప్‌కు కరోనా సోకినట్లు తెలిపారు. ఇంకా పరీక్షలు నిర్వహిస్తే కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలుపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News