Monday, August 11, 2025

సంక్షేమ హాస్టల్‌లలో కార్పొరేట్ కంపెనీల టెండర్లు.. ఆందోళనలో చిరు వ్యాపారుల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్ అర్బన్: తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్‌లలో నిత్యావసర సరుకులను సరఫరా చేసేందుకు కార్పొరేట్ కంపెనీల నుండి టెండర్లు పిలవడంతో స్థానిక చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో గత 11 ఏళ్లుగా కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, గుడ్లు స్థానికంగా ఉన్న రైతుల ద్వారా వ్యాపారులు సరఫరా చేస్తూ వందలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు. దాదాపు 15మంది కాంట్రాక్టర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు మొదలైనప్పటి నుండి ఎలాంటి పరిస్థితులు ఎదురైన హాస్టల్‌లకు కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, గుడ్లు నిరంతరం సరఫరా చేస్తున్నారు.

బిల్లులు సకాలంలో రాకపోయిన హాస్టల్‌లో చదువుతున్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారికి నిత్యావసరమైన ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వారిని పక్కన పెడుతూ కార్పొరేట్ కంపెనీలకు టెండర్లు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని పలువురు కూరగాయలు పండించే రైతులు, సరఫరా చేసే కార్మికులు, కాంట్రాక్టర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని లబోదిబోమంటున్నారు. విద్యార్థులకు ఆకలి తీర్చడానికి తమ సొంత పిల్లలుగా భావించి సకాలంలో వారికి కావల్సిన కూరగాయలు, పండ్లు, మాంసాహారం అందిస్తున్నామని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రభుత్వంపై కూడా తమకు రావాల్సిన బిల్లులపై కూడా ఒత్తిడి తేవడం లేదని అయినప్పటికి తమ కుటుంబాలను రోడ్డున వేసి బడా కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగించడం మానుకోవాలని పలువురు ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు విన్నవించుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం కొత్త పాలసీ విధానాన్ని తీసుకవచ్చే ప్రయత్నంతో టెండర్ విధానంలో మార్పులు చేసి అధికంగా లక్షల్లో ఈఎండీ చెల్లించాలని నిబంధనతో ఎళ్ల తరబడి కొనసాగుతున్న కాంట్రాక్టర్లు లక్షల్లో ఈఎండీ చెల్లించలేని పరిస్థితిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాంట్రాక్టర్లకు, కార్మికులకు, రైతులకు జరగబోయే నష్టంపై ముందస్తుగా గుర్తించి సంక్షేమ హాస్టల్‌లకు సరఫరా చేస్తున్న కూరగాయలు, పండ్లు, మాంసాహారం నిలిపి వేసి రోడ్డెక్కడానికి సిద్థం అవడంతో సంక్షేమ హాస్టల్‌లలో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు ఆకలితో అలమట్టించే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. తక్షణమే తమకు న్యాయం చేయాలనే విన్నపాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News