Saturday, November 2, 2024

కొవాగ్జిన్‌కు తిరుగులేదు

- Advertisement -
- Advertisement -

వ్యాక్సిన్ల విషయంలో మాకు గ్లోబల్ లీడర్ షిప్ ఉంది
బిఎస్‌ఎల్ 3 విధానంలో టీకాలను ఉత్పత్తి చేస్తున్నాం
కొవాగ్జిన్ కరోనాకు అసలైన మందు
ప్రజలంతా ఇంటర్నెట్‌లో వాటిని ఒపిగ్గా చదువుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా
కొంత మంది అనవసరంగా రాజకీయలు చేస్తున్నారు
నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు
భారత్ బయోటెక్ సంస్థ ఎండి కృష్ణ ఎల్లా వెల్లడి


మన తెలంగాణ/హైదరాబాద్: టీకాల తయారీలో తమకు గ్లోబల్ లీడర్ షిప్ ఉందని భారత్ బయోటెక్ సంస్థ ఎండి డా కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ఇప్పటికే తమ సంస్థతో వివిధ దేశాల ప్రతినిధులు కూడా భాగస్వాములుగా ఉన్నారని ఆయన అన్నారు. కరోనా నిరోధానికి తాము బిఎస్‌ఎల్ 3 విధానంలో కొవాగ్జిన్ టీకాను తయారు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ తరహా ఉత్పత్తి ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. కరోనా నియంత్రణకు అసలైన మందు కొవాగ్జిన్ మాత్రమేనని ఆయన అన్నారు. కానీ కొందరు ఈ టీకాను నీళ్లతో పోల్చడం బాధకరమన్నారు. ఇప్పటికే బయోటెక్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న టీకాపై ఐదు పబ్లికేషన్లు వచ్చాయని, అవన్నీ ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయని ఆయన తెలిపారు. కావున ప్రజలు అపోహలు చెందకుండా వాటిని ఒపిగ్గా చదువుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇప్పటికే 16 వాక్సిన్లను తయారు చేసి సుమారు 123 దేశాలకు తాము సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొవాగ్జిన్ విషయంలో పలువురు రాజకీయ నాయకులు విమర్శలు చేయడాన్ని ఆ సంస్థ చైర్మన్ డా కృష్ణ ఎల్లా తప్పుబడుతూ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..వ్యాక్సిన్ల తయారీలో తమ సంస్థకు సుదీర్ఘమైన అనుభవం ఉందన్నారు. ఈక్రమంలోనే ఎంతో శ్రమించి కొవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేశామన్నారు. భారత్‌లో ఒక టీకా అందుబాటులోకి రావడానికి ఎంత కష్టపడాలో ఫారిన్ కంపెనీలన్నింటికి తెలుసని ఆయన అన్నారు. అయితే కొవాగ్జిన్‌కు ఎమర్జెన్సీ ఆమోదం దక్కడం ఓ గొప్ప సంకేతమమని డా కృష్ణా ఎల్లా అన్నారు. భారత్ అభివృద్ది చేసిన ఉత్పత్తికి ఇది అరుదైన ఘనతని, దేశం గర్వించదగిన సందర్బమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతి తక్కువ కాలంలో దీన్ని తయారు చేయడం భారత శాస్త్రీయ సామర్థంలో ఇది మైలు రాయని అన్నారు. ఇన్నోవేషన్ పరిస్థితిని దేశం అంచనా వేయగలిగిందన్నారు. అయితే తాము కేవలం భారత్‌లో మాత్రమే తమ టీకాలను చేయట్లేదని, కోవాగ్జిన్ కోసం బ్రిటన్‌లోనూ ట్రయల్స్ నిర్వహించామన్నారు. అంతేగాక డేటా అంశంలో పారదర్శకంగా లేమని చెప్పడం అతస్యమని ఆయన అన్నారు.
ప్రజలకు రక్షించడమే తమ లక్ష్యం…
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడమే తమ లక్షమని భారత్ బయోటెక్ ఎండి కృష్ణ ఎల్లా తెలిపారు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన వారికి తమ వ్యాక్సిన్ అందించేందుకు కూడా పనిచేస్తున్నామని ఆయన వివరించారు. కొవాగ్జిన్ టీకా అత్యంత సురక్షితమైందని, ఆ టీకాతో రోగ నిరోధక శక్తి కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. అయితే మనవాళ్లు వ్యాక్సిన్‌పై రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కుటుంబానికి చెందిన ఒక్కరు కూడా ఎటువంటి రాజకీయ పార్టీతో లింకులో లేరన్నారు. తాము కేవలం ఇండియాలో మాత్రమే క్లినికల్స్ ట్రయల్స్ నిర్వహించడం లేదని, బ్రిటన్‌తో పాటు 12 దేశాల్లో క్లినికల్స్ ట్రయల్స్ చేసినట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్, నేపల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోనూ తమ టీకా ట్రయల్స్ జరిగినట్లుగా ఎల్లా పేర్కొన్నారు. తమ కంపెనీకి వ్యాక్సిన్ ఉత్పత్తిలో అపార అనుభవం ఉన్నప్పటికీ కొందరు అనుభవం లేదని చెప్పడం శోచనీయమన్నారు. 123 దేశాల్లో ఇప్పటికే తమ వ్యాక్సిన్ ఉత్పత్తులను వాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ కంపెనీకి చాలా విస్తృతమైన అనుభవం ఉందని, సైంటిఫిక్ జర్నల్స్‌లోనూ తమకు గుర్తింపు ఉన్నట్లు ఎల్లా తెలిపారు. కొవాగ్జిన్ డేటా విషయంలో పారదర్శకంగా లేరని ఆరోపణలు వస్తున్నాయని, ఓపిక ఉన్న వాళ్లు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే అంతర్జాతీయ పత్రికల్లో సుమారు 70 ఆర్టికల్స్‌లో వచ్చినట్లు ఆయన వివరించారు.
4 యూనిట్లలో ఉత్పత్తి చేయబోతున్నాం…
కొవాగ్జిన్ ఉత్పత్తి కొరకు తామకు డ్రగ్ రెగ్యులేటరి ఆథారిటీ అత్యవసరం కింద నాలుగు యూనిట్లలో అనుమతులు ఇచ్చినట్లు డా కృష్ణ ఎల్లా తెలిపారు. వీటిలో సుమారు 700 మిలియన్ సామర్థంలో టీకాను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం హైదరాబాద్‌లోనే సుమారు 200 మిలియన్ మోతాదుల సామర్ధంతో టీకాలను తాయరుచేస్తున్నామన్నారు. అంతేగాక ఇతర నగరాల్లో 500 వరకు ఫ్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. 2021 వరకు దాదాపు 7600 మిలియన్ మోతాదుల సామర్ధంతో టీకాలను ఉత్పత్తి చేసి ప్రజలందరికీ అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే 20 మినియన్ల టీకాలు రెడీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను శాస్త్రవేత్తగానే కంపెనీను ప్రారంభించి, ఈ స్థాయిలోకి తీసుకొచ్చినట్లు డా కృష్ణ ఎల్లా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాము ఏకంగా 24వేల వాలంటీర్లతో 3 వ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. మూడో దశ ఫలితాలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.

Covaxin 200% Safe says Bharat Biotech MD Krishna Ella

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News