Saturday, April 27, 2024

ప్రభుత్వ బడుల పిల్లలూ ఆవిష్కర్తలే

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ బడుల పిల్లలూ ఆవిష్కర్తలే

ఆవిష్కరణలు ఎవరి గుత్త సొత్తు కాదు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలు తీసుకువచ్చారు
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలి
మనదేశ జనాభాలో అధిక శాతంలో యువత ఉంది
వారి తెలివితేటలకు సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు
తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 గ్రాండ్ ఫినాలేలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త ఆవిష్కరణలు అనేవి ఎవరి గుత్త సొత్తు కాదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. కార్పోరేట్ స్కూళ్లో, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వారికే గొప్ప ఆలోచనలు వస్తాయి, మిగతా వారికి రావనేది వాస్తవం కాదని అన్నారు. యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. యునిసెఫ్ ఇండియా, ఇంక్విల్యాబ్ ఫౌండేషన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి మంత్రి కెటిర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెరియర్ గైడెన్స్, ఇంటింటా చదువుల పంట పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్,ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రదర్శనలో ఉత్తమ ఆవిష్కరణలుగా ఎంపికైన మూడు ఉత్పత్తులకు మంత్రి కెటిఆర్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొద్దిగా ప్రోత్సాహం అందిస్తే గొప్ప ఆవిష్కరణలు తీసుకువస్తారని అన్నారు. పిల్లలు మంచి ఆత్మవిశ్వాసంతో నిబ్బరంగా వారు తయారు చేసిన ఉత్పత్తులపై ఎలాంటి బెరుకుగానీ, జంకుగానీ లేకుండా ఇంగ్లీష్‌లో గొప్పగా ప్రజంటేషన్ ఇచ్చారని కొనియాడారు. తమకు కలిగిన ఇబ్బంది ఇంకొకరికి కలుగకూడదని ఆలోచించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మిషన్ భగీరధ ద్వారా వస్తున్న నీళ్లు వృథా కాకుండా బిందె తీస్తే బంద్, వ్యవసాయ పనిముట్లు వంటి సృజనాత్మకమైన ఆలోచనలతో మంచి ఉత్పత్తులు తీసుకువచ్చిన విద్యార్థులను మంత్రి కెటిఆర్ అభినందించారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని అన్నారు. ఈ రోజు ఒక చిన్న అంకుర ఆలోచనలతో మొదలయ్యే పరిశ్రమ రేపు వేలమందికి ఉపాధి కల్పించే మల్టీ నేషనల్ కంపెనీ ఎదుగుతుందని ప్రధాని మోడీ అన్న మాటలను గుర్తు చేశారు. విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్ధిన ఉపాధ్యాయులను మంత్రి కెటిఆర్ అభినందించారు. తల్లిదండ్రులు విద్యార్థుల్లో దాగివున్న సృజనను, ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. సృజనాత్మక ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు, ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత చేరుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
మనకు ప్రపంచానికే పరిష్కారాలు చూపించే సత్తా ఉంది
భారతదేశంలో 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారు ఉన్నారని, 50 శాతం జనాభా 27 ఏళ్ల లోపు ఉందని అన్నారు. ప్రపంచంలో మనదేశంలో యంగెస్ట్ దేశమని వ్యాఖ్యానించారు. యువతను తెలివితేటలను సరిగ్గా విశ్లేషించి సరైన పద్దతిలో వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. ప్రపంచానికే పరిష్కారాలు చూపించే సత్తా మనకుందని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో టి హబ్, వి హబ్‌తో రిచ్ అనే పేరిట పరిశ్రమలను, సంస్థలను అనుసంధానం చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆవిష్కరణలు తీసుకువచ్చేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. పిల్లలను అన్ని విధాలా ప్రోత్సహించేలా పాఠశాలలు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ఆ దిశగా సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తీసుకువచ్చే నూతన ఆవిష్కరణలకు కోర్సులో క్రెడిట్లు ఇవ్వాలని, తద్వారా వారి సమయం వృథా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సు మూడవ సంవత్సరంలోనే పరిశ్రమలకు అనుసంధానం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 14 వేల పరిశ్రమలు వచ్చాయని, 2 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కానీ మన రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో స్థానిక పిల్లలకు వచ్చిన అవకాశాల శాతాన్ని మరింత మెరుగ్గా పెంపొందిచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ ఉద్దేశంతోనే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యారంగంలో కొన్ని మార్పులు తెస్తే అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిష్ఫలం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆవిష్కరణలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులు సందర్శించారు.
విద్యార్థి దశలోనే సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా వాటికి పరిష్కారం చూపించేలా విద్యార్థులను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా ప్రజంటేషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో టి సాట్, దూరదర్శన్ ద్వారా తరగతులు ప్రసారం చేయడం ద్వారా కింది స్థాయి వరకు పిల్లలు క్లాసులు చూడగలుగుతున్నారని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కెరియర్ గైడెన్స్ కార్యక్రమం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలకు ఇబ్బంది కలుగకుండా చదువును కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని సిఎం తమకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా మంచి ఆవిష్కరణలు తీసుకువచ్చిన విద్యార్థులు మంత్రి అభినందించారు.

తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020లో ఎంపికైన ఉత్తమ ఆవిష్కరణలు

మొదటి బహుమతి : ఆర్గానిక్ జీరో వేస్ట్ స్త్రీ రక్షా ప్యాడ్స్
తయారు చేసిన విద్యార్థులు : స్వాతి, శైలజ, లలిత
పాఠశాల : ముల్కలపల్లి జెడ్‌పిహెచ్‌ఎస్ స్కూల్, యాదాద్రి భువనగిరి జిల్లా
ద్వితీయ బహుమతి : మల్టీ పర్పస్ బ్యాగ్ ఫర్ అగ్రికల్చర్ యూజ్
తయారు చేసిన విద్యార్థులు : రాజేష్, అభిషేక్, వేణు
పాఠశాల : దంతలపల్లి జెడ్‌పిహెచ్ స్కూల్, మహుబూబాబాద్ జిల్లా
తృతీయ బహుమతి : ఆర్గానిక్ చాక్‌పీస్
తయారు చేసిన విద్యార్థులు : హేషిత్, కొమ్మావార్ రుద్ర
పాఠశాల : తెలంగాణ మోడల్ స్కూల్, అదిలాబాద్

KTR attend to TS school innovation challenge 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News