Sunday, May 19, 2024

కొవాగ్జిన్ ‘బూస్టర్ డోసు’ ప్రయోగానికి సిద్ధం

- Advertisement -
- Advertisement -

Covaxin ‘booster dose’ ready for launch

 

క్లినికల్ ట్రయల్స్‌కు డిసిజిఐ అనుమతి

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలను రెండు డోసులుగా ఇస్తున్న విషయం తెలిసిందే. అయితేఈ టీకాల వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు ఎంతకాలం ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. దీంతో మూడో డోసు (బూస్టర్ డోసు) అవసరం ఎంతయినా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌కు ‘బూస్టర్ డోసు’ ప్రతిపాదించింది. ఈ బూస్టర్ డోసు క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ)నిపుణుల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొవాగ్జిన్ మూడో డోసుపై ప్రయోగాలు జరగనున్నాయి. కొవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడం కోసం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిబంధనల్లో మార్పులు చేయాలని కోరుతూ భారత్ బయోటెక్ సంస్థ డిసిజిఐ నిపుణుల కమిటీకి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. వీటిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం 6 ఎంసిజి మోతాదులో ప్రయోగాలు సాగించవచ్చని నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది.

మూడో డోసు ఇచ్చిన తర్వాత ఆరునెలల పాటు కమిటీ సూచించిన నిబంధనలను పాటించాలని భారత్ బయోటెక్‌కు సూచించింది. అంతేకాకుండా ప్రయోగాల ప్రాథమిక, ద్వితీయ లక్షాల వివరాలను కూడా కమిటీకి అందించాలని కూడా భారత్ బయోటెక్‌ను కోరింది. మార్చి 23వ తేదీన జరిగిన డిసిజిఐ నిపుణుల కమిటీ సమావేశంలో బూస్టర్ డోసుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిబంధనల్లో మార్పులు, ప్రయోగాల లక్షలపై భారత్ బయోటెక్‌తో సుదీర్ఘంగా చర్చించింది. ఈ బూస్టర్ డోసు ప్రయోగాల్లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లకు రెండో డోసు తీసుకున్న ఆరునెలల గడువు అనంతరం మూడో డోసు ఇచ్చి పరీక్షిస్తారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా 81శాతం సమర్థతను కనబరిచినట్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. సుమారు 25,800 మంది వలంటీర్లపైనిర్వహించిన ప్రయోగాల్లో కొవాగ్జిన్ టీకా సురక్షితమని తేలిందని రుజువైందని భారత్ బయోటెక్ మార్చిలో వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News