Thursday, May 2, 2024

విరాట్ కోహ్లిపై ఆగని విమర్శలు

- Advertisement -
- Advertisement -

Criticism of Kohli's decisions in Australia series

 

మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల కాలంలో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతను తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ క్రికెటర్లతో సహా అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన సిరీస్‌లో కోహ్లి వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పుపడుతున్నారు. వన్డే సిరీస్‌లో జట్టు కూర్పుపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆకాశ్ చోప్రా, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ తదితరులు కోహ్లి తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్‌ను ఓపెనర్‌గా దించక పోవడంతో పాటు సీనియర్ బౌలర్లు మహ్మద్ షమి, జస్‌ప్రిత్ బుమ్రా సేవలను సరిగ్గా ఉపయోగించుకోక పోవడంపై విమర్శలు వచ్చాయి. తొలి వన్డేలో యువ ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైని భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయినా అతనికి తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఆడించాడు. ఈసారి కూడా సైని ఘోరంగా విఫలమయ్యాడు. అంతేగాక చాహల్ కూడా రెండు మ్యాచుల్లో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.

సైని స్థానంలో వేరే బౌలర్‌ను తీసుకోవాల్సిన సమయంలో అతనికే మళ్లీ ఛాన్స్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రాహుల్‌ను మిడిలార్డర్‌లో దించడంపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఒకవేళ రాహుల్ ఓపెనర్‌గా బరిలో దిగివుంటే రెండు మ్యాచుల్లో కూడా భారత్ గెలుపు అవకాశాలు అధికంగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో కీలక బౌలర్లు షమి, బుమ్రాలను పక్కన బెట్టడంపై కూడా వివాదం నెలకొంది. ఐపిఎల్‌లో బుమ్రా అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. రానున్న టెస్టు సిరీస్ నేపథ్యంలో బుమ్రాను పక్కన బెట్టాల్సి వచ్చిందని కోహ్లి చెప్పడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. టి20లలో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయాల్సి ఉంటుందని, అంత మాత్రాన బుమ్రా, షమిలు అలసి పోతారని భావించడం కోహ్లి కెప్టెన్సీ వైఫల్యానికి నిదర్శనమని నెహ్రా, గంభీర్, సెహ్వాగ్ తదితరులు వ్యాఖ్యానించారు.

అంతేగాక టి20లో శ్రేయస్ అయ్యర్, గిల్‌లను పక్కన బెట్టి మనీష్, శాంసన్‌లను ఆడించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అంతేగాక కీలకమైన తొలి మ్యాచ్‌లో చాహల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోక పోవడాన్ని కూడా మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ఇప్పటికైన కోహ్లి తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఇదిలావుంటే కోహ్లి మాత్రం తన నిర్ణయాలు సరైనవేనని స్పష్టం చేస్తున్నాడు. ప్రతి క్రికెటర్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఇలా వ్యవహరించాల్సి వస్తుందన్నాడు. అయినా ఎన్ని విమర్శలు వచ్చినా తాను మాత్రం ఇలాగే ముందుకు పోతానని తేల్చి చెప్పడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News