Sunday, April 28, 2024

దళిత, గిరిజన అభ్యున్నతి కెసిఆర్ ఊపిరి

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల సభలో కాంగ్రెస్ ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేకి శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ

గౌరవనీయులైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే జీ

తెలంగాణలోని చేవెళ్ల బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే ప్రకటించిన ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్‌కు ప్రతిస్పందనగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్, ఆయన గోబెల్స్ కూటమి తప్పుదోవ పట్టించే వ్యూహాల గురించి మీకు తెలియజేసేందుకు ఒక కనువిప్పు లాంటి లేఖ ఇది. రెండు మూడు నెలల్లో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకుని మీరు ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్‌ను ప్రకటించి ఉండవచ్చు. కానీ తెలంగాణలో సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా దళితులు, గిరిజనుల అభ్యున్నతి, సాధికారత కోసం అనేక కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేస్తోందని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.

దురదృష్టవశాత్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు, దళితులు, గిరిజనుల అభ్యున్నతికి, సాధికారతకు కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న చరిత్రాత్మక కృషి, కెసిఆర్ హయాంలో అమలవుతున్న వివిధ ఎస్సీ, ఎస్టీ సాధికారత పథకాలు గురించి చెప్పకుండా మిమ్మల్ని మభ్యపెడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి దళితులు, గిరిజనుల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయాన్ని సాధించే బహుముఖ వ్యూహంతో సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2014 – 2023 మధ్య ఈ వర్గాలకు చెందిన ప్రజల కోసం ప్రత్యేకంగా రూ.1,81,462 కోట్లు ఖర్చు చేసింది. భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇంత ఖర్చు పెట్టలేదని నిస్సంకోచంగా చెప్పగలను.

మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ వంటి ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతి కోసం ఎంత ఖర్చు చేశారో తెలియజేయగలరా? తెలంగాణ ఉద్యమ కాలం నుంచి డా. బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సిఎం కెసిఆర్ నిరంతరం పాటిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ బాబా సాహెబ్ నుండి ప్రేరణ పొందింది. రాజ్యాంగంలో ఆయన రూపొందించిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని సిఎం కెసిఆర్ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. డా. బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకునేందుకు, భారతదేశ చరిత్రలో అత్యున్నతమైన నాయకుడికి నివాళులర్పించేందుకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఎన్‌టిఆర్ గార్డెన్స్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది. ఈ భారీ విగ్రహం కేవలం అంబేద్కకు నివాళులర్పించడం మాత్రమే కాదు, ఈ దేశంలో నివసించే దళితులు, గిరిజనులు అణగారిన వర్గాలకు కూడా గొప్ప గౌరవం.

పాలనలో అంబేద్కరిజం
ఆచరణాత్మక ఆదర్శప్రాయమైన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవం రోజువారీ పాలనలో కూడా ప్రతిబింబించేలా పరిపాలన చేస్తున్నారు కెసిఆర్. డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే బాబాసాహెబ్ పేరు మీద కొత్తగా నిర్మించిన అద్భుతమైన డా. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ఉంది. ప్రజల కోసం విధానాలను రూపొందించి అమలు చేస్తున్నప్పుడు వర్తమానం, భవిష్యత్‌లో ఉన్న పాలకులు బాబా సాహెబ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలనే గొప్ప స్పృహతో సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు కెసిఆర్.

సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం బాబాసాహెబ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విజయవంతమైంది. కెసిఆర్ హయాంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లను 6% నుంచి 10%కి పెంచారు. ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 15%కి పెంచింది. 15% పరిమితిని తొలగించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించింది. కానీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపునకు కెసిఆర్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను విస్మరించి, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీలను తప్పుదోవ పట్టించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపుదలకు కాంగ్రెస్ నిజంగా కట్టుబడి ఉంటే, కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినట్లే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముందుగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా మల్లికార్జున ఖర్గే హామీ ఇవ్వాలి.

భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలనే చర్చను ప్రారంభించాలన్న కేసీఆర్ ఆలోచనను రేవంత్ రెడ్డి, టీం ఎగతాళి చేసి తిరస్కరించిందంటే కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను అంచనా వేయవచ్చు.
సమానత్వం, సాధికారతకు విద్య గొప్ప మార్గమని ప్రతిపాదించారు బిఆర్ అంబేద్కర్. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమానత్వం, సాధికారత, సామాజిక న్యాయం అనే నమ్మకంతో ఎస్సీ, ఎస్టీ పిల్లల చదువుకు సిఎం కెసిఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను నిర్మించింది. ఈ పాఠశాలల్లో నేడు మొత్తం 2,80,897 మంది విద్యార్థులు చదువుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ. 1,50,000 ఖర్చు చేస్తుంది. ఈ అంశంలో ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా తెలంగాణకు దగ్గరగా రాగలదా? వెనుకబడిన వర్గాల పిల్లలను చదివించడంపై సిఎం కెసిఆర్ ఎంతగానో దృష్టి సారించారు.

2014లో దాదాపు 365 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాలలు ఉండగా, 2023లో ఈ సంస్థల సంఖ్య 805కి చేరుకుంది. ఇది ఎస్‌సి, ఎస్‌టి పిల్లల విద్య పట్ల కేసీఆర్ ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనం. ప్రతి విద్యా సంవత్సరంలో దాదాపు 2.50 లక్షల మంది ఎస్‌సి విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ విద్యకు మద్దతుగా ప్రభుత్వం గణనీయమైన బడ్జెట్‌ను ఖర్చు చేస్తోంది. ప్రీ- మెట్రిక్ స్కాలర్ షిప్‌లు పథకం కింద ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.65,000/- నుండి రూ.1,50,000/-కి, రూ. 75,000/- నుండి రూ. పట్టణ ప్రాంతాల్లో 2,00,000/- పెంచింది. ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య 578417. ఖర్చు చేసిన మొత్తం: రూ. 368.06 కోట్లు. 2014 వరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఒకే స్టడీ సర్కిల్ ఉండేది, తెలంగాణ ప్రభుత్వం నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో కొత్తగా 11 ఎస్సీ స్టడీ సర్కిల్‌లను ఏర్పాటు చేసింది.కెసిఆర్ ప్రభుత్వం అన్ని స్థాయిలలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యకు మద్దతు ఇస్తోంది.

విదేశీ విద్య కోసం రూ. 20 లక్షల స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నారని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకు వస్తున్నాము. ఇప్పటి వరకు 7000 మందికి పైగా ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు ఈ పథకం నుండి లబ్ధి పొందారు. విద్యతో పాటు ఎస్‌సి, ఎస్‌టి యువతలో వ్యవస్థాపక అభివృద్ధిపై కూడా కెసిఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్‌లో ఎంఫిల్, పిహెచ్‌డి పూర్తి చేసిన వారికి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం, అహేతుకం. ఇది యువతను తప్పుదారి పట్టించడానికి ఒక ఎర లాగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఇస్తామని సిఎం కెసిఆర్ వాగ్దానం చేస్తుంటే, కాంగ్రెస్ సరైన అంచనా, నిబద్ధత లేకుండా రూ.5 లక్షలు ఇస్తుందా? మీరు నిజంగా ఈ వాగ్దానానికి కట్టుబడి వుంటే, మీరు అధికారంలో ఉన్న కర్ణాటకలో వెంటనే అమలు చేయాలని కోరుతున్నాను. ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్‌లో చేసిన వాగ్దానాలు బిఆర్‌ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలకు కాపీ.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌టి గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది. దాదాపు 1,00,942 ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందుతోంది. ఇందుకోసం కేసీఆర్ సర్కార్ 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 221 కోట్లు ఖర్చు చేసింది. 3467 గిరిజన ఆవాసాలలో విద్యుత్తు వినియోగానికి, మోటార్లు, మిల్లులు, ఇతర అవసరాలకు అవసరమైన 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. పూర్తిగా భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు చెందిన పేద ఎస్సీ మహిళా లబ్ధిదారులకు పంట సహాయంతో పాటు 3 ఎకరాల భూమిని అందించే లక్ష్యంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. గత ఎనిమిదేళ్లలో కెసిఆర్ సర్కార్ 17,097.09 ఎకరాలు కొనుగోలు చేసి 6998 మంది అర్హులైన లబ్ధిదారులకు అందించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు అలాంటి ఉదాహరణ ఏదైనా చూపించగలరా?. తెలంగాణ సిఎం కెసిఆర్ ఇప్పటికే 3146 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించారు. వారికి స్వయం పాలన, స్వపరిపాలన ఉండేలా అధికారం ఇచ్చారు. పల్లె ప్రగతి కార్యక్రమం కిందమారుమూల గిరిజన ప్రాంతాలు, దళిత ఆవాసాలలో కూడా రక్షిత మంచినీటిని అందించడం ద్వారా ఈ గ్రామాలలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది.

దళిత, గిరిజన ఆవాసాల పరివర్తన
ఒకప్పుడు ప్రధాన స్రవంతికి దూరమై పేదరికం, నిర్లక్ష్యానికి గురైన దళితుల ఆవాసాలు సీఎం కేసీఆర్ సంకల్పంతో చక్కని ప్రగతి సాధించాయి. ఈ గ్రామాల్లో గతంలో లాగా పారిశుధ్యం, పరిశుభ్రత సమస్యలు ఇప్పుడు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన స్థానిక పాలన, ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడం వల్ల మలేరియా, వైరల్ జ్వరాలు, ఇతర అంటు వ్యాధులు బాగా తగ్గాయి. తెలంగాణ ఇప్పుడు 100% ఒడిఎఫ్ రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానంలో వుందని చెప్పాలి. సిఎం కెసిఆర్ పాలనలో దళితులు, గిరిజనుల జీవితాలు ఎలా మారిపోయాయో చూడాలంటే మల్లికార్జున ఖర్గే తెలంగాణలోని ఏదైనా గిరిజన గ్రామాన్ని లేదా దళిత నివాసాలను సందర్శించాలి. ప్రభుత్వం బంజారాహిల్స్‌లో బంజారా ఆత్మగౌరవ భవన్‌ను నిర్మించింది. రాష్ట్రం సంత్ సేవాలాల్ జన్మదిన వేడుకలను జరుపుకునేలా చేస్తున్నది.

ఉమ్మడి జిల్లా కేంద్రం, ఐటిడిఎ ప్రధాన కార్యాలయంతో పాటు మొత్తం 12 ఎస్‌టి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7200 చదరపు అడుగుల విస్తీర్ణంలో గిరిజన భవనాలు నిర్మిస్తున్నారు. రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. హైదరాబాద్‌లో 82 వేల చదరపు అడుగులలో కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌ను ఏర్పాటు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజన సంస్కృతి, పండుగలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వాటిని రాష్ట్ర పండుగలుగా ఘనంగా జరుపుకోవడానికి తోడ్పాటు అందిస్తోంది. సంత్ సేవాలాల్ జయంతి, కొమరం భీమ్ జయంతి, వర్థంతి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. గిరిజన సంస్కృతి, గౌరవాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం బోరాపూర్ జాతర, జంగూబాయి జాతర, నాచారం జాతరలను నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు ప్రభుత్వం రూ. 354 కోట్లు ఖర్చు చేస్తోంది. శ్రీ ఖర్గేజీకి నా సూటి ప్రశ్న ఏంటంటే, గతంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ముఖ్యమంత్రయినా.. గిరిజన సంస్కృతికి, పండుగలకుకేసీఆర్ గారు ఇచ్చినంత ప్రాధాన్యత ఇచ్చారా?.

భూములకు తగిన పరిహారం
జలయజ్ఞం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కింద 2013 వరకు లక్షల ఎకరాల అసైన్డ్ భూములను సమైక్య ఎపిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సహేతుకమైన పరిహారం లేకుండా బలవంతంగా లాక్కుంది. అలాగే ఉమ్మడి ఎపిలో వేల ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వాలు బలవంతంగా స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించారు. కానీ కెసిఆర్ ఆ క్రూరమైన వ్యవహారానికి స్వస్తి పలికారు. కెసిఆర్ ప్రభుత్వం భూములు సేకరించింది కానీ చట్ట ప్రకారం మార్కెట్ ధరలకు తగిన పరిహారం చెల్లించారు. తప్పుడు కేసులు, బూటకపు ఆందోళనలు చేసినప్పటికీ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్య సౌకర్యాలు అనూహ్యంగా మెరుగుపడ్డాయి. ఉదాహరణకు గిరిజన ప్రాంతాలతో సహా తెలంగాణ వ్యాప్తంగా కెసిఆర్ ప్రారంభించిన ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల ద్వారా దళిత, గిరిజన మహిళలు ఉచితంగా ప్రసవాలు జరుగుతున్నాయి. తెలంగాణలో శిశు మరణాల రేటు 39 నుంచి 21కి, మాతాశిశు మరణాల రేటు 92 నుంచి 43కి తగ్గింది. మరో విప్లవాత్మకమైన కాన్సెప్ట్‌గా 16 నిత్యావసర వస్తువులతో కూడిన కెసిఆర్ కిట్‌ను మాతృమూర్తికి అందజేస్తున్నారు. ప్రతి ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీకి రూ.12,000 ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు, పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితే రూ.1,000 అదనంగా అందజేస్తున్నారు.

బస్తర్, ఎఒబి ప్రాంతాలలో గ్రీన్ హంట్ పేరుతో గిరిజనులపై యుపిఎ ప్రభుత్వం చేసిన ఘోరమైన నేరాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. శ్రీ ఖర్గే జీ గారు.. గద్దర్ అన్నపై కాల్పులు జరపడానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన చనిపోయే వరకు ఆ బుల్లెట్లు గద్దరన్న శరీరంలోనే ఉండిపోయాయని మీకు గుర్తు చేస్తున్నాను. మీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా చంద్ర బాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు హంతకులలే సంతాపం తెలిపినట్లుగా ఉంది. ఇప్పుడు ఓట్ల కోసం, చిల్లర రాజకీయాల కోసం గద్దర్ అన్న ఫోటోను ప్రదర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం చిల్లర రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెట్టడమే. వీటినే శవరాజకీయాలు అంటారు. తన పేరు, ఫొటోను చిల్లర రాజకీయాలకు వాడుకోవడం, ఈ పొలిటికల్ డ్రామా అంతా చూస్తూ గద్దర్ అన్న ఆత్మ క్షోభిస్తుంటుంది. దళితులు, గిరిజనులపై మీకున్న బూటకపు ప్రేమను తెలంగాణ ప్రజలు నమ్ముతారని భావిస్తున్నారా శ్రీ ఖర్గే జీ?.

తెలంగాణలో కాంగ్రెస్ ముద్ర వేయాలంటే, కేవలం బిఆర్‌ఎస్ ప్రభుత్వం నుండి కాపీ కొట్టడం లేదా సిఎం కెసిఆర్‌ను అనవసరంగా విమర్శించడం కంటే రాష్ట్రానికి పథకాలు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కెసిఆర్ కంటే మెరుగ్గా పని చేయడానికి ప్రయత్నించాలి. డియర్ ఖర్గే జీ.. భారత రాజకీయాల్లో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవజ్ఞుడైన నాయకుడైన మీకు.. సిఎం కెసిఆర్‌పై బురదజల్లడం, మాటలతో మభ్యపెట్టడం పనికిరావని బాగా తెలుసు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఇలాంటి పద్ధతులను పదే పదే తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గుణపాఠాలు నేర్చుకోనట్లుంది. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌తో ఉన్నారని, ఆయన తెలంగాణలో ప్రజల ఆశీస్సులు పొందిన, అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడని ఢిల్లీలోని కాంగ్రెస్ అధినాయకత్వం తెలుసుకోవాలి.

ఇది ఏ వారసత్వం వల్ల కాదు, ఆయన చేసిన చరిత్రాత్మక అభివృద్ధి వల్లే. అత్యంత శక్తివంతమైన నాయకుడయ్యారు కెసిఆర్. ఒకప్పుడు నిత్యం కరువు పీడిత, వెనుకబడిన రాష్ట్రాన్ని ఈ రోజు భారత దేశంలో అత్యంత ప్రగతిశీల, సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా మార్చా రు కెసిఆర్. పేద, అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం అతని సంపూర్ణ సంకల్పం,దార్శనికత, అవిశ్రాంతమైన కృషి, అన్నింటికంటే అచంచలమైన నిబద్ధత ద్వారా ఇది సాధ్యమైంది. డియర్ ఖర్గే జీ మీ నకిలీ, నిస్సారమైన ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్ దళితులు, గిరిజనులని మభ్యపెట్టలేదు. ఎంత మభ్యపెట్టినా, తప్పుదారి పట్టించినా తెలంగాణలో మూడోసారి సిఎం కెసిఆర్ అధికారంలోకి రావడాన్ని ఆపలేరు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News