Wednesday, March 22, 2023

ప్రతిపక్ష కూడిక – తీసివేత!

- Advertisement -

సంపాదకీయం: 2024 లోక్‌సభ ఎన్నికలు ఎవరెవరి మధ్య జరుగుతాయో ఇంకా స్పష్టమైన యుద్ధ రేఖ కనిపించడం లేదు. ప్రతిపక్షాలన్నీ ఒక్క శక్తిగా కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అటువంటి కూటమి వివరంగా రూపు దిద్దుకోలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతలపైకి ఉసిగొల్పడం ఆపాలంటూ ఇటీవల ఎనిమిది పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. లిక్కర్ కుంభకోణం పేరు చెప్పి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నాయకుడు మనిష్ సిసోడియాను అరెస్టు చేయడం పట్ల నిరసనగా ఈ లేఖను సంధించారు. దీనిపై బిఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జెడి, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్‌సిపి, శివసేన (యుబిటి), సమాజ్‌వాదిపార్టీ, ఆప్ సంతకాలు చేశాయి. బిజెపిని దేశాధికారం నుంచి దింపడానికి ప్రతిపక్షాలు ఏకం కానున్నాయనే సందేశాన్ని ఇటువంటి పరిణామాలు బలంగానే ఇస్తున్నాయి.

అయితే అంతిమంగా బిజెపిపై ప్రతిపక్ష పోరాటం ఏ విధంగా వుంటుంది, కాంగ్రెస్ పార్టీతో కలిసి మొత్తం ప్రతిపక్షమంతా సంఘటిత శక్తిగా రూపొందుతుందా, అది లేకుండా మిగతా ప్రాంతీయ పక్షాలన్నీ విడిగా ఏకమవుతాయా అనే సందేహం ఇంకా మిగిలే వుంది. ఈ విషయమై మరొక చెప్పుకోదగిన పరిణామం శుక్రవారం నాడు చోటు చేసుకొన్నది. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుపుకొన్న సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) తాను అటు బిజెపికి, ఇటు కాంగ్రెస్‌కు సమాన దూరంలో వుంటానని ప్రకటించడాన్ని ఈ దిశగా ఒక పెద్ద పరిణామంగానే చూడాలి. ఒక్క తానే కాకుండా ఇప్పటికే ఈ వైపుగా ఆలోచిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్ళాలని ఎస్‌పి నిర్ణయించుకోడం మామూలు విషయం కాదు. మమతా బెనర్జీ గతంలో ఇదే వైఖరిని తీసుకొన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ వొంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కోల్‌కతాలో మమతా బెనర్జీని కలుసుకొన్నారు. ఈ సందర్భంగా బిజెపి, కాంగ్రెస్‌లకు సమాన దూరంలో వుండాలని వారు నిర్ణయించుకొన్నట్టు వార్తలు చెబుతున్నాయి. రాష్ట్రాల్లోని పరిస్థితిని గమనిస్తే 2024లో ఎన్నికయ్యే ఎంపిల్లో అత్యధికులు బిజెపికి గాని, కాంగ్రెస్‌కు గాని చెందని వారే వుంటారని అఖిలేశ్ యాదవ్ కోల్‌కతాలో ప్రకటించారు. కాంగ్రెస్ పాత్ర లేకుండా బిజెపిని ఓడించడం సాధ్యమేనా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. బిజెపి, కాంగ్రెస్‌లకు దూరంగా వుండాలనే వైఖరి వైపు ఇతర ప్రాంతీయ పక్షాలను సమీకరించే బాధ్యతను కూడా తృణమూల్, ఎస్‌పిలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే కాంగ్రెస్‌ను ఎటువంటి పరిస్థితుల్లోనూ కలుపుకోరాదని ప్రాంతీయ పక్షాలు నిర్ణయించుకొంటాయా, షరతులకు లోబడిన పొత్తును దానితో కుదుర్చుకోడానికి అవి సిద్ధంగా వున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. కూటమిలో తమతో సమానమైన భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే దానితో పని చేయడానికి అభ్యంతరం లేదనే సూచనలు ఇటీవల ప్రాంతీయ పక్షాల శిబిరం నుంచి వెలువడిన మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించాలనే ఉత్సాహంలోనే వున్నట్టు తెలుస్తున్నది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల మాట్లాడుతూ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షానికి నాయకత్వం వహించి కేంద్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందని అన్నారు. ఇది సహజంగానే ఇతర విపక్షాలకు అసంతృప్తి కలిగించి వుంటుంది.

అయితే బిఆర్‌ఎస్, తృణమూల్, ఎస్‌పి వంటి ప్రాంతీయ పక్షాలు అసాధారణ బలాన్ని పుంజుకొన్నాయి. అవి కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే అవకాశాలు దాదాపు శూన్యం. కాని రాహుల్ గాంధీని బాగా ముందుకు తోయడం ద్వారా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొనగలననే దృష్టితో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రజలను బాగా ఆకట్టుకొన్నదనే అభిప్రాయం ఏర్పడడంతో ఆయన మరో విడత యాత్రను చేపట్టడానికి నిర్ణయించుకొన్న సంగతి తెలిసిందే. అలాగే లండన్ పర్యటనలో ఆయన ఇచ్చిన ప్రసంగాలను వివాదాస్పదం చేయడం ద్వారా ఆయనకు బిజెపి విశేష ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తున్నది.

ఆ విధంగా రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా చూపించడం ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఎంత మాత్రం మింగుడు పడని విషయం. కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పక్షాలన్నీ కూటమి కట్టినా, వాటి ప్రమేయం లేకుండా కాంగ్రెస్ వొంటరిగా పోటీ చేసినా బిజెపిని గద్దె దించాలనే లక్షం నెరవేరక పోగా ఈ చీలిక దానికి మరింత తోడ్పడే సూచనలే వున్నాయి. అందుచేత ప్రధాని పదవి అంశాన్ని ఎన్నికల తర్వాత కాలానికి వాయిదా వేసి కాంగ్రెస్‌తో కూడిన ప్రతిపక్ష కూటమిని నిర్మించడం ద్వారానే బిజెపిని ఓడించడం సాధ్యమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి అనువుగా తృణమూల్ కాంగ్రెస్, ఎస్‌పి వంటి పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌లకు సమాన దూరం అనే వైఖరిని విడనాడుకోవలసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News