Sunday, April 28, 2024

వితరణశీలురకు విన్నపం

- Advertisement -
- Advertisement -

Donors

 

లోకాన్ని ఏ వ్యాధి, ఉపద్రవం ముంచక ముందే నిరుద్యోగం, ఉపాధి లేమీ విపరీతంగా ఉండేవి. ఇప్పుడు కాలు బయట పెట్టడానికి వీలులేని కరోనా లాక్‌డౌన్‌లో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకుంటేనే గుండె బేజారెత్తుతుంది. అగ్ర రాజ్యం అమెరికాలోనే నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నదన్న వార్తలు గమనిస్తే మన దేశంలో ఇంకెంత దారుణ స్థితి నెలకొని ఉందో అన్న ఆందోళన కలుగుతుంది. 1930లలో అలముకున్న మహా ఆర్థిక విపత్తు నాటి పరిస్థితి అమెరికాలో మళ్లీ తలెత్తింది. ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు. గత వారం రోజుల్లోనే 40 లక్షల మందికి పైగా నిరుద్యోగ సాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ఆ మేరకైనా వెసులుబాటు ఉంది. ఉద్యోగాలు కోల్పోయేవారు ప్రభుత్వం నుంచి సాయం పొందే హక్కు కలిగి ఉన్నారు. అటువంటి ఏర్పాటు లేని మన వంటి దేశాలలో మామూలు రోజుల్లోనే పని దొరికితే పచ్చడన్నం లేకపోతే పస్తు అనే దుస్థితి. దేశంలో రోజు కూలీలు, వలస కార్మికులే దాదాపు 50 కోట్ల మంది వరకు ఉంటారు. పని కోసం ప్రతి రోజూ రోడ్ల కూడళ్ల వద్ద నిలబడి ఎవరు పిలిస్తే వారి వెంట వెళ్లి గృహ నిర్మాణం వంటి రంగాల్లో శ్రమ చేసి దిన భత్యం సంపాదించుకుంటారు.

చిన్నచిన్న వస్తూత్పత్తి కేంద్రాల్లో, ఇస్త్రీ, క్షురకర్మ వంటి వృత్తుల్లోనూ కుదిరి ఏ పూట భత్యం ఆ పూట సమకూర్చుకుంటారు. తోపుడు బళ్ల మీద పళ్లు, కూరగాయలు అమ్ముకొని పొట్ట పోషించుకుంటారు. ఇళ్లల్లో పని మనుషులుగా శ్రమను అమ్ముకుంటారు. వీరిలో ఎక్కువ మంది మారుమూల గ్రామాల నుంచి రాష్ట్రాలు దాటి మహా నగరాలకు వెళ్లి కాయకష్టం చేసుకునేవారే. శ్రమ చేసి సంపాదించుకున్న డబ్బుతో ఇళ్లు గడుపుకునే వీరి ఆత్మాభిమానం చెప్పుకోదగినది. దేహీ అని యాచించడమంటే ఒళ్లు సిగ్గుతో చచ్చిపోతుంది. నెల రోజులకు మించి సాగుతున్న లాక్‌డౌన్‌లో వీరి పరిస్థితి ఒడ్డున పడిన చేప పిల్లలను తలపిస్తున్నది. వలస కార్మికులను, స్థానిక నిరుపేదలను ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇంటికి నెలకు 12 కిలోల బియ్యం, రూ. 1500 నగదు ఇస్తున్నది. దూర ప్రాంతాలకు చెందిన వలస కార్మికులకు ఆహారం, వసతితో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నది. కరోనా వల్ల అమెరికాలో సంభవిస్తున్నదాని కంటే ఎక్కువగా ఉద్యోగ నష్టం ఇండియాలో ఏర్పడిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది.

భారత దేశంలో అసంఘటిత రంగ కార్మికుల్లోని 90 శాతం మంది అనగా 40 కోట్ల మంది దారిద్య్రంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఇండియా, నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ వల్ల కంటైన్‌మెంట్ చర్యల వల్ల అత్యధిక సంఖ్యలో కార్మికులు దెబ్బ తింటున్నారని స్పష్టం చేసింది. ఈ లాక్‌డౌన్‌తో ఇంతకుముందెన్నడూ ఎదురుకానంతగా వలస కార్మికుల సమస్య ముందుకొచ్చింది. వీరికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించవలసిన అవసరం కలుగుతున్నది. ఇటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తీసుకోవలసిన చర్యలను రూపొందించవలసి ఉంది. దేశంలో కరోనా ఇప్పటి వరకు 775 మందిని బలి తీసుకున్నది. వైరస్ సోకిన వారి సంఖ్య 25 వేలకు చేరుకుంటున్నది. 301 మరణాలతో మహారాష్ట్ర ముందున్నది. 127 మంది మృతులతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 92 మంది, ఢిల్లీలో 53 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 29 మంది మరణించారు.

పరిస్థితిని గమనిస్తుంటే లాక్‌డౌన్ నుంచి ఇప్పట్లో విముక్తి లేదేమో అనిపిస్తున్నది. అటువంటప్పుడు నిరుపేదల బతుకులు మరెంత దయనీయంగా మారుతాయో చెప్పలేము. గత నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్షా 70 వేల కోట్ల సహాయ ప్యాకేజీ ఎందుకూ చాలదని, దాని ద్వారా అందిస్తున్న నెలకు రూ. 500 నగదు అతి తక్కువ అని అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు బయల్దేరాయి. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రపంచంలోనే అతి చిన్నదని దేశ స్థూల ఉత్పత్తిలో 1 శాతం కంటే తక్కువని ఒక్కొక్క పేద గృహస్థుకీ నెలకు రూ. 3000 నగదు ఇవ్వాలనే అభిప్రాయం వెలువడుతున్నది. ఈ పరిస్థితుల్లో మన సమాజంలో సంప్రదాయంగా వస్తున్న ప్రైవేటు సంస్థల, వ్యక్తుల ఔదార్యం అవసరం పెరుగుతున్నది. పలు ప్రభుత్వేతర సంస్థలు పిఎం కేర్స్ నిధికి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు విరాళాలిస్తున్నాయి. వీలైనంతగా సాయం చేస్తున్నాయి. అయితే ఇన్ని కోట్ల మంది పేదలకు, వలస కార్మికులకు ఎవరు ఎంత చేసినా చాలదు. స్థానికంగా ఎక్కడికక్కడ ఏదో రూపంలో మేమున్నామంటూ పెద్ద మనసు గలవారు ముందుకు రావలసి ఉన్నది. దానంగా కాకుండా అసలు సిసలు సంపద సృష్టికర్తలైన కార్మిక లోకానికి విధ్యుక్త ధర్మంగా మేలు చేయవలసి ఉంది.

 

Donors should make Donations and make good
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News