Monday, May 13, 2024

కొవాగ్జిన్‌తో కొవిడ్ 617 ఆటకట్టు

- Advertisement -
- Advertisement -

Dr. Anthony Fauci praised Covaxin ability

అమెరికా నిపుణుడు ఫౌచీ ప్రశంస

వాషింగ్టన్ : భారత్ బయోటెక్ తయారీ అయిన కొవాగ్జిన్ సామర్థ్యాన్ని వైట్‌హౌస్ అధికారిక వైద్య సలహాదారు, అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌచీ ప్రశంసించారు. కరోనాలో అత్యంత ప్రాణాంతకపు 617 వేరియంట్‌ను కొవాగ్జిన్ తటస్థీకరిస్తుందని, దీని డోస్ తీసుకున్న వారిలో వైరస్ నిరోధక కణాలు తలెత్తినట్లు గుర్తించామని ఫౌచీ బుధవారం విలేకరులకు తెలిపారు. వివిధ రకాల వ్యాక్సిన్లు, వాటి పనితీరు గురించి తాము ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్న రోజువారి సమాచారం ప్రాతిపదికన ఈ విషయాన్ని తెలియచేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో తాము సేకరించిన డాటా ప్రకారం చూస్తే ఈ టీకా డోస్‌ను పొందిన భారతీయులకు 617 రకపు కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణ ఏర్పడినట్లు నిర్థారణ అయిందని తెలిపారు.కరోనా వైరస్ ఇండియాలో అత్యంత క్లిష్టమైన అనారోగ్య పరిస్థితిని తీసుకువచ్చిన విషయాన్ని గుర్తించామని, ఇదే సమయంలో అక్కడి వ్యాక్సినేషన్ ప్రక్రియ తీవ్రస్థాయి పరిణామానికి విరుగుడు అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేకించి కరోనా సెకండ్ వేవ్‌కు కారణం అవుతున్న వేరియంట్లను నిరోధించే శక్తిని ఈ టీకా మనిషికి కల్పించడం జరిగిందంటే అది కీలక పరిణామం అవుతుందన్నారు. కొవాగ్జిన్ సమర్థత గురించి న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణాత్మక వార్త ప్రచురించింది. మనిషిలోని రోగనిరోధక వ్యవస్థకు సరైన మార్గదర్శకత్వానికి ఈ టీకా దోహదం చేస్తోందని , కొన్ని రకాల కొత్త కరోనా జన్యువుణుకు వ్యతిరేకంగా అవసరం అయిన యాంటీబాడీస్ ఉత్పత్తి దిశలో ఈ టీకా దోహదం చేస్తోందని నిర్థారణ అయిందని ఈ వార్తలో తెలిపారు. భారత్ బయోటెక్ ఔషధ సంస్థ భారత్‌లోని జాతీయ వైరాలజీ సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) సంయుక్త భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. పూర్తిస్థాయి దేశవాళి కొవిడ్ టీకాగా మారింది. ప్రస్తుతం ఇండియాలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు.

ఇండియాను ఆదుకోకపోవడం దారుణం

సంక్లిష్ట ఆరోగ్య సమస్యను ఎదుర్కొనేందుకు తల్లడిల్లుతోన్న భారత్‌కు సహకరించడంలో ధనిక దేశాలు విఫలమయ్యాయని ఫౌచీ విమర్శించారు. అంతర్జాతీయ సమాజంలోని అసమానతలకు, అంతకు మించిన వివక్షతకు భారత్‌లోని ఇప్పటి పరిస్థితి నిదర్శనమని అన్నారు. ప్రపంచవ్యాప్త మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాల మధ్య సమన్వయం, అంతకు మించి సహకారం అవసరం అని ప్రెసిడెంట్‌కు అత్యంత కీలకమైన వైద్య సలహాదారుడైన ఫౌచీ వ్యాఖ్యానించారు. కరోనా తీవ్రతతో భారత్‌లో తలెత్తుతున్న పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని దేశాలకూ ఆరోగ్య సంరక్షణ విషయంలో సమాన వనరులను కల్పించేందుకు ధనిక దేశాలు పాటుపడాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పలు ధనిక దేశాలు పనిచేయడం లేదని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News