Sunday, April 28, 2024

రాజ్యాంగ సంస్థల దయనీయత

- Advertisement -
- Advertisement -

fine for not wearing the Face Mask

 

వ్యాక్సిన్ కొనుగోలు పై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాస్క్ ధరించనందుకు థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అక్కడి అధికారులు ఇటీవల ఆరు వేల భాట్ లు (సుమారు రూ. 14 వేలు) జరిమానా విధించారు. బ్యాంకాక్ గవర్నర్ అశ్విన్ క్వాన్‌ముయాంగ్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల క్రితం నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్ తన 60వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం 13 మంది పాల్గొన్నారు. అయితే అక్కడి నిబంధనల ప్రకారం ఏ వేడుక అయినా, ఏ సమావేశమైనా కేవలం 10మంది మాత్రమే పాల్గొనాలి. నిబంధనలను ప్రధాని ఉల్లంఘించారని ఆమెకు 20 వేల నార్వేజియన్ క్రోన్ లను పోలీసులు జరిమానా విధించారు.

గతేడాది జూన్‌లో బల్గేరియా ప్రధాని బోయ్కో బొరిసోవ్ ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లిన సమయంలో మాస్క్ ధరించనందుకు సుమారు 300 లెవ్స్ (రూ.13 వేలు) జరిమానా విధించారు. అంతేకాకుండా ఆయన వెంట వెళ్లిన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు కూడా భారీగా జరిమానా విధించారు. బల్గేరియా ప్రధానికి మాత్రమే కాకుండా ఆ దేశంలో అధికారంలో ఉన్న గెర్బ్ పార్టీ భారీ సమావేశం నిర్వహించడం, భౌతిక దూరం నిబంధనలను అతిక్రమించినట్లు తేలడంతో రూ. 3 వేల లెవ్‌లు (రూ.1.30 లక్షలు) జరిమానాగా విధించారు. ఇదే కారణంతో ప్రతిపక్ష సోషలిస్టు పార్టీకి కూడా ఇంతే మొత్తం జరిమానా విధించారు.

ఇవి కొన్ని దేశాలకు సంబంధించిన ఉదాహరణలు మాత్రమే. ఆయా దేశాల్లో చట్టాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తారో వీటి ద్వారా తెలుస్తోంది. చాలా దేశాల్లో ప్రధాన మంత్రులు, అధ్యక్షులకే కాదు, నిబంధనలు ఉల్లంఘించిన మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులకు కూడా అక్కడి పోలీసులు, స్థానిక అధికారులు జరిమానాలు విధిస్తుంటారు. కానీ ఇలాంటివి మన దేశంలో చూడొచ్చా అంటే.. చూడలేమనే చెప్పవచ్చు. దేశ ప్రధానమంత్రి, హోం మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు మాస్క్‌లు ధరించకున్నా, నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నా అసలు పట్టించుకునేవారు కరువయ్యారు. దానికి కారణం పాలకులు తమ మీద ఎక్కడ కక్ష గడుతారేమోననే భయం.

సామాన్యులపైనే ప్రతాపం..

భారతదేశంలో పెద్దలను విడిచి పేదలపైనే ప్రతాపం చూపిస్తారు. మాస్క్ ధరించకుంటే పెద్ద ఎత్తున జరిమానా విధిస్తామని ఇప్పటికే రాష్ట్రాలు ప్రకటించాయి. మాస్క్ ధరించకుంటే తెలంగాణలో రూ. 1000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా రూ. 1000 వరకు, కర్ణాటకలో సభలు, సమావేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ. 10 వేల వరకు, మాస్క్ లేకుండా బయటకు వస్తే నగరాల్లో రూ.250, గ్రామాల్లో రూ.100 జరిమానా విధిస్తున్నారు. అదే ఢిల్లీలో రూ. 500 నుంచి రూ. వేల వరకు, మహారాష్ట్రలో రూ. 200, ఒడిశాలో రూ. 2 వేల నుంచి రూ. 5వేలు జరిమానా విధిస్తున్నారు. అయితే ఇవి ఎక్కువగా అమలయ్యేది సామాన్యులపైనే.

చట్టం ఇక్కడ కొందరికి చుట్టమే..

అధికారంలో ఉన్న వారికి, పలుకుబడి కలిగిన వారికి చట్టాలు, నిబంధనలు వర్తించవనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనికి నిదర్శనం ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు. మార్చి 27వ తేదీ నుంచి వివిధ దశల్లో పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగాయి. మే రెండో తేదీన దీని ఫలితాలు రానున్నాయి. అయితే ఎన్నికల సమయంలో దేశ ప్రధానమంత్రి, హోంమంత్రితో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు వ్యవహరించిన తీరు ప్రజలను విస్మయానికి గురి చేసింది.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా అనేక ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. మాస్క్ పెట్టుకోకుండానే ముందుకు సాగారు. ఇదంతా టివిల్లో ప్రత్యక్ష ప్రసారం సైతం జరిగింది. ప్రతిపక్ష పార్టీల నాయకులది సైతం ఇదే తీరు. ఎక్కడా నిబంధనలు పాటించ లేదు. మాస్కులు లేవు, ఫిజికల్ డిస్టెన్స్ లేదు. శానిటైజర్లూ వాడలేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుంపులు గుంపులుగా కనిపించారు. అయితే సామాన్యులపై జరిమానాతో విరుచుకుపడే అధికారుల కంటికి ఇవేమీ కనిపించలేదు. అధికారంలో ఉన్న ప్రధానమంత్రి, హోం మంత్రులకు ఫైన్ విధించాలనే ఆలోచనలైతే దూరం ప్రతిపక్ష పార్టీల నాయకులను సైతం పట్టించుకోలేదు.

దీంతో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతేకాకుండా తెలంగాణలో నాగార్జున సాగర్ ఎన్నికల వల్ల కరోనా ఉధృతి పెరిగిందనేది స్పష్టమవుతోంది. ఇటీవల ఎన్నికల ప్రచారం ముగిసిన మున్సిపాలిటీల్లో సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎక్కడా నిబంధనలు పాటించినట్టు కనిపించలేదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటి రెడ్డి తదితరులు నిర్వహించిన ర్యాలీల్లో కూడా ఎక్కడా భౌతిక దూరం కనిపించలేదు.

ఆలస్యంగా స్పందిస్తున్న న్యాయస్థానాలు

కారణాలేవో తెలియదు గానీ న్యాయస్థానాలు మాత్రం చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాయి. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ‘కరోనా సెకండ్ వేవ్ రావడానికి కేంద్ర ఎన్నికల సంఘమే కారణం. అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలి’ అంటూ మద్రాస్ హై కోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే దీని కంటే ముందే సుమారు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి. పశ్చిమబెంగాల్ లో కూడా ఒక విడత ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. న్యాయ స్థానం సీరియస్ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే మే రెండో తేదీన రాజకీయ పార్టీలు ఎలాంటి సంబరాలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది. అయితే న్యాయస్థానం ఇదే కాస్త ముందు స్పందించి ఉంటే ఎన్నికల ర్యాలీలపై కూడా నిషేధం విధించే అవకాశముంటుండేదేమోననే చర్చ ప్రజల్లో జరుగుతోంది.

స్వతంత్ర సంస్థలు ప్రభావితం

భారత రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా పని చేసే హక్కు ఉన్న సంస్థలను అధికారంలో ఉన్న పాలకులు ప్రభావితం చేస్తూనే ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నా.. బిజెపి అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో ఇది మరీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు, సిబిఐ, ఐటి, ఇడి దాడులు, న్యాయస్థానాల్లో వస్తున్న కొన్ని తీర్పులు ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం భారత దేశంలో రాజకీయ జోక్యం లేని సంస్థ ఏదీ లేదనే చెప్పవచ్చు. సాంకేతికంగా సంస్థలు స్వయంప్రతిపత్తి కలిగిఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ అధికారంలో ఉన్న పార్టీలు వాటిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

తమ మాట వింటున్న ఆయా సంస్థలకు అధికారులుగా వ్యవహరిస్తున్న వారికి రిటైర్మెంట్ తరువాత వివిధ రకాలుగా ప్రయోజనాలు చేకూర్చి మేలు చేకూరుస్తున్నాయి. మాట వినని వారి పట్ల కక్ష గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోలేదని, భౌతిక దూరం పాటించలేదని ప్రధాన మంత్రి, హోం మంత్రి, కేంద్ర మంత్రులతోపాటు ప్రతిపక్ష పార్టీల వారికి మన అధికారులు జరిమానా విధిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News