Monday, May 6, 2024

టీకా, ఆక్సిజన్

- Advertisement -
- Advertisement -

Vaccine and Oxygen shortage is severe

ఆసుపత్రుల్లో చోటు దొరక్క, ఆక్సిజన్ అందక మరణిస్తున్న కరోనా రోగుల విషాద కథనాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇంకో వైపు టీకా కోసం ఎదురు చూసి ఎగబడి తీవ్ర నిరాశకు గురి అవుతున్న జనం దుస్థితి చలింప చేస్తున్నది. స్మశానాల్లో ఖాళీ లేక సామూహిక దహనాలు జరిపిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. మే 1 నుంచి జరపాలని ఉద్దేశించిన 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా కార్యక్రమం సకాలంలో సమగ్రంగా మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రకటించిన టీకా ఉత్సవం అభాసుపాలవుతున్నది. టీకా తీసుకోడానికి అర్హులైన జన సంఖ్య 94 కోట్లు కాగా, ఇప్పటికి 11.97 కోట్ల మందికే పంపిణీ అయ్యింది. వీరిలో మొదటి డోసు తీసుకున్న వారు 10 కోట్ల మంది కాగా, రెండు డోసులూ ముగిసిన వారు దగ్గరదగ్గర 2 కోట్ల మందే. 45 ఏళ్లు పైబడిన వారందరికీ రెండు విడతలు టీకా అందడానికి ఇంకా 38 కోట్ల డోసులు కావాలి. కేంద్రం తాజాగా మంగళవారం నాడు వెల్లడించిన దానిని బట్టి రాష్ట్రాలన్నింటి వద్ద ఒక కోటి డోసుల టీకా మాత్రమే ఉంది.

ఊహించనంత స్థాయిలో కొవిడ్ రెండవ అల విపత్తు విరుచుకుపడి కబళిస్తుంటే ఆదుకునే నాథులు లేకపోడం, కేంద్రం సర్వ జన టీకాల బాధ్యతను రాష్ట్రాల మీదికి నెట్టివేయడం గమనించే వారికి సాధారణ ప్రజల దిక్కుమాలిన స్థితి దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇంతటి మానవ నిస్సహాయత భవిష్యత్తుపై ఆశలను తుంచి వేస్తుంది. ఆగ్రాలో ఆక్సిజన్ అందక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్తను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళుతూ నోటితో ఊపిరి అందించి అతడిని కాపాడుకోడానికి ఒక భార్య చేసిన విఫలయత్నం దేశంలో కరోనా రోగుల కడగండ్లను కళ్లకు కట్టింది. వ్యాక్సిన్ కొరత గురించి అనేక రాష్ట్రాలు చాలా రోజులుగా కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఈ విషయంలో ముందున్నాయి. అలాగని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో టీకాకు కొరత లేదని కాదు. పార్టీ ప్రతిష్ఠ మంటగలుస్తుందనే భయంతో అవి కిమ్మనకుండా ఉన్నాయి. మహారాష్ట్రలో మాదిరిగానే ఉత్తరప్రదేశ్‌లో కూడా టీకా కొరత తీవ్రంగా నెలకొని ఉంది. ఘజియాబాద్‌లో అనేక ప్రైవేటు ఆసుపత్రులు టీకా కోసం అర్రులు చాస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి.

వారణాసిలో ప్రభుత్వం అనుమతించిన టీకా కేంద్రాలే మూతపడ్డాయి. వ్యాక్సిన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాలకు తమకు మధ్య తేడా చూపిస్తున్నదని మహారాష్ట్ర ఆరోపించింది. తమతో పోలిస్తే తక్కువ కరోనా కేసులు గల యుపి, గుజరాత్, హర్యానాలకు అవసరానికి మించి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న కేంద్రం రోజుకి 50 వేలు కేసులు నమోదవుతున్న తమ రాష్ట్రానికి మాత్రం ఏడున్నర లక్షల డోసులే ఇచ్చిందని మహారాష్ట్ర ఎత్తి చూపింది. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వేసేందుకు టీకా సరఫరా బాధ్యతను కేంద్రం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు సులువుగా టీకా వేయించుకోగల పరిస్థితి దేశంలో దాదాపు ఎక్కడా లేదని చెప్పవచ్చు. అసలు వ్యాక్సిన్ కొరతే లేదని, రాష్ట్రాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోడం వల్లనే అది తలెత్తిందని కేంద్రం రెండు వారాల క్రితం ఆరోపించింది. రాష్ట్రాలన్నింటి వద్ద కోటి డోసులకు మించి నిల్వ లేదని అది మంగళవారం నాడు చేసిన ప్రకటన దాని కపటాన్ని చాటుతున్నది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయగల స్థితి తమకు లేదని మహారాష్ట్ర చెప్పేసింది.

దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు ఉత్పత్తి చేస్తున్న రెండు కంపెనీలు రోజుకి 24 లక్షల డోసులు మాత్రమే అందజేయగల సామర్ధం కలిగి ఉన్నా యి. డిమాండ్ మాత్రం రోజుకి దాదాపు 40 లక్షల డోసులకు చేరుకున్నదని 20 రోజుల క్రితమే అంచనా వేశారు. ఇప్పుడు ఈ గిరాకీ మరింత పెరిగి ఉంటుంది. మే 1 నుంచి ఇంకా పెరుగుతుంది. విపత్తును ముందుగానే ఊహించి ఈ రెండు కంపెనీలకు సకాలంలో తగినంత ఆర్థిక సహాయం చేసి ఉంటే ఉత్పత్తిని ఇప్పటికే అవి విశేషంగా పెంచి ఉండేవి. ఆలస్యంగా అందిన రుణ సహాయంతో అవి చేయదలచుకున్న అదనపు ఉత్పత్తి అందుబాటులోకి రావడానికి మరి కొంత కాలం ప డుతుంది. ఆక్సిజన్ విషయంలో మరింత దయనీయ స్థితి నెలకొన్నది. దేశంలో కావలసినంత ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధం ఉందంటున్నారు. కాని దానిని దేశమంతటికీ సరఫరా చేసే వ్యవస్థ తగినంతగా లేదని చెబుతున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధం, డిమాండ్‌కు మించి 40 శాతం ఉంది గాని సకాలంలో సుదూర ప్రాంతాలకు చేరవేయడం అసాధ్యమని, తగినన్ని ట్యాంకర్లు, సిలిండర్లు కూడా లేవని వెల్లడవుతున్నది.

ఈ పరిస్థితుల్లో ఉదారంగా సాయం చేయడానికి ముందుకు వచ్చిన అమెరికా తదితర అనేక దేశాల నుంచి వ్యాక్సిన్, ఆక్సిజన్ ఇక్కడికి రావడానికి నాలుగైదు వారాలైనా పట్టవచ్చునని సమాచారం. ఈలోగా ఎంత మంది విలువైన ప్రాణాలను కోల్పోవలసి వస్తుందో, బాధితుల సంఖ్య మరెంతగా పెరిగిపోతుందో!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News