Monday, October 14, 2024

పెట్టేయ్ కేసు..రాసేయ్ ఎఫ్‌ఐఆర్?

- Advertisement -
- Advertisement -

నగరంలో ఓ డీసీపీ వింత వైఖరి, ఎడాపెడా కేసులు నమోదు చేయాలని సీఐ, ఎస్‌ఐలపై ఒత్తిడి, అవసరం లేకున్నా ఎఫ్‌ఐఆర్‌లు రాసేయాలని హుకుం, ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో సుమారు 800కు పైగా కేసుల నమోదు?, నిరంకుశ ధోరణితో కింది స్థాయి సిబ్బందికి తిప్పలు, బదిలీల కోసం కొందరి ప్రయత్నాలు.

మామూలుగా ఏదైనా పోలీస్ స్టేషన్లలో కేసులు తక్కువగా నమోదు అయితే అధికారులు ఆనందం వ్యక్తం చేస్తారు. కోర్టులు ఇటీవలు కూడా ఎక్కువగా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండా సాధ్యమైనంత కేసులు రాజీలు చేయాలనే సూచిస్తోంది. కానీ నగరంలోని ఒక డిసిపి మాత్రం ప్రతీ చిన్నదానికి కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో ఒక్కో స్టేషన్‌లో సుమారు 100పైగా కేసులు నమోదు కావటం విశేషం. దీంతో ఆయా స్టేషన్ల పరిధిలోని వేరే స్థానాలకు బదిలీ చేయించుకోవటం ప్రయత్నాలు చేస్తున్నారు.
మన తెలంగాణ/పంజాగుట్ట

మన తెలంగాణ/పంజాగుట్ట: అయిన దానికి..కాని దానికి కేసు పెట్టాలంటాడు. చిన్న ప్రమాదం జరిగినా అక్కడికి వాలిపోతాడు. ఫొటోలు తీయండి..ఎఫ్‌ఐఆర్‌లు రాయండి అంటూ తరుముతాడు. అవసరం లేని కేసుల్లోనూ ఆర్భాటం ప్రదర్శిస్తుంటాడు. సీఐలు, ఎస్‌ఐల విధులనూ ఆయనే శాసిస్తుంటాడు. చివరకు ‘బాబోయ్ మాకు ఈ జోన్ వద్దు…మేం ఇక్కడి నుంచి బదిలీ అయి వెళ్లిపోతాం..’ అని సదరు సీఐలు, ఎస్‌ఐలు భీతిల్లిపోయేలా చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు…సాక్ష్యాత్తు నగరంలోని ఓ కీలక మండలానికి చెందిన డీసీపీ. ఆయన వ్యవహార శైలితో జోన్ పరిధిలోని పోలీసులు అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

ఎంత నిజాయితీ ఉన్నా…

ఆయనొక నిజాయితీ కలిగిన అధికారి కావొచ్చు, విధుల్లో కఠినంగా వ్యవహరించవచ్చు. తప్పేం లేదు..కానీ ప్రతి చిన్న ఘటనకు సీఐని మొదలు ఎస్‌ఐలను పరుగులు పెట్టిస్తూ, రాత్రి పగలు తేడా లేకుండా కింది స్థాయి సిబ్బందిపై చిందులు వేస్తూ వ్యవహరిస్తున్న తీరు ఆ డీసీపీ పరిధిలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల సీఐ, ఎస్‌ఐలకు కునుకు లేకుండా చేస్తోంది. నగరంలో కీలక మండలంలో ఇటీవల కొత్తగా వచ్చిన ఈ డీసీపీ వ్యవహార శైలితో దాదాపు అన్ని స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు ఈ జోన్ నుండి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్నారట. ఒకరిద్దరు సీఐలు ఇప్పటికే ఈ పరిధి నుండి బదిలీ చేయించుకొని బయట పడేందుకు ప్రయత్నలు మొదలెట్టారట.

సమస్య ఏంటంటే..

ఇంతకీ ఈ కీలక పోలీస్ జోన్‌లో ఎందుకు ఈ సమస్య వస్తోందంటే.. సదరు డీసీపీ గారు చిన్న ఘటన జరిగినా వెంటనే ఎఫ్‌ఐఅర్ చేయమని ఆదేశించడం, చిన్న రోడ్డు ప్రమాదం జరిగినా క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకొని ఫొటోలు పంపాలని ఆదేశాలివ్వడం స్థానిక సీఐలు తట్టుకోలేక పోతున్నారు. అయితే ఇక్కడ ఎఫ్‌ఐఅర్ చేయడం తప్పు కానప్పటికీ..ఎఫ్‌ఐఅర్ అవసరం లేని ఘటనలపై బలవంతంగా ఎఫ్‌ఐఅర్ చేయాల్సి రావడం వీరిని ఇబ్బంది పెడుతోంది. ఒకరు బైక్ మీద నుండి కింద పడ్డా వెంటనే ఎఫ్‌ఐఅర్ చేయాలంటే ఎలా కుదరుతుందరి వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెలలోనే రెట్టింపవుతున్న కేసుల సంఖ్య..

సుప్రీంకోర్టు సూచన ప్రకారం కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, ఇలా వరుస కేసుల వల్ల ఈ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఒక్క నెలలలోనే ప్రతి స్టేషన్‌లో అకస్మాతుగా సుమారు 50 నుండి 100 చొప్పున కేసుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని బట్టి డీసీపీ ఒత్తిడి ఎలా ఉందో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఈ పరిధిలోని మొత్తం పోలీస్ స్టేషన్లలో ఒక నెలలో నమోదైన కేసుల సంఖ్య సుమారు 800 దాటింది. ఈ మొత్తం కేసుల సంఖ్య ఒక జిల్లాలో ఏడాది కాలంలో నమోదయ్యే కేసులతో సమానం అంటే ఆశ్చర్యం కలగక మానదు. వాస్తవానికి ఒక స్టేషన్‌లో కేసు నమోదు కావడం లేదు అంటే ఉన్నతాధికారులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తారు. క్రైమ్ రేట్ తగ్గినట్టు భావిస్తారు. కానీ ఈ జోన్ పరిధిలో మాత్రం ప్రతి స్టేషన్లో ప్రతిరోజు ఎఫ్‌ఐఆర్‌లు చేయాల్సిందే. ఒక దశలో ఎఫ్‌ఐఆర్ చేయడానికి ఫిర్యాదులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారంటే ఆ అధికారి వేధింపులు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవుతుంది.

ఫిర్యాదుదారు వద్దన్నా..

చివరికి ఫిర్యాదు చేసినవారు ఇంత చిన్న దానికి కేసు ఎందుకు సారు..కౌన్సెలింగ్ చేయండి ప్లీజ్ అని బతిమిలాడుకొనే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంటి పక్కన చెత్త వేస్తున్నారని ఒకరు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం అంటే చాలా బాధాకరమైన అంశంగా భావించవచ్చు. పైగా కేసుల సంఖ్యని తగ్గించే లోక్ అదాలత్‌లలో కూడా రాజీ కుదరకుండా గట్టిగా కేసు నమోదు చేయాలని డీసీపీ ఆదేశిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిధిలోని సీఐలు ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటే చాలు గజగజ వణికి పోతున్నారు. చిన్న ప్రమాదం జరిగినా గట్టి సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయాలని ఆదేశించడం సీఐలకు ఇబ్బందిగా మారింది. ఇందుకు కారణం సదరు డీసీపీ గతంలో ట్రాఫిక్ విభాగంలో ఇది వరకు గట్టిగా పనిచేశారు. ఆ అనుభవాన్ని రంగరించి లా అండ్ ఆర్డర్‌లో రుద్దతున్నారు అని కొందరు కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. తన కింది స్థాయి సిబ్బందికి ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు రికార్డు స్థాయిలో మెమోలు జారీ చేసిన ఘనత ఈయనకు ఉందట. దీంతో దీంతో అనేక మంది సీఐలు, ఎస్‌ఐలు ఈ డీసీపీ అంటేనే హడలిపోతున్నారు.

ఒత్తిడి తగ్గిస్తే..‘విజయానికి’ సహకరిస్తాం

కాగా సదరు డీసీపీ తమపై కేసుల కోసం ఒత్తిడి చేయకపోతే విధి నిర్వహణలో ఆయన ‘విజయాని కి’ తప్పక సహకరిస్తామని ఈ జోన్ పరిధిలోని సీ ఐ, ఎస్‌లు అంటున్నారు. చిన్న ఘటనకి కూడా కేసు నమోదు చేస్తే అవగాహన లేని అమాయ కు లు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సదరు డీసీపీ గారు మానవతా దృక్పథంతో ఈ వరుస కేసు నమోదుల వ్రతానికి కాస్త ముగింపు పలకాలని, విధి నిర్వహణలో మాత్రం కఠినంగా వ్యవరించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News