Tuesday, May 6, 2025

పది శాతం కమిషన్ ఇస్తేనే బిల్లులు: ఈటెల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పది శాతం కమిషన్ ఇస్తున్న దయనీయ పరిస్థితి
కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్న హామీకి మంగళం
అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం
: కాంగ్రెస్ ప్రభుత్వంపై మల్కాజ్గిరి ఎంపి ఈటల ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పది శాతం కమిషన్ ఇస్తే తప్ప బిల్లు చెల్లించలేని దయనీయ పరిస్థితి నెలకొందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.10 నుంచి రూ.20 లక్షల మధ్య పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ వాటిని చెల్లించలేదని అన్నారు. ఈ హామీకి పూర్తిగా మాట తప్పారని విమర్శించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాంట్రాక్టర్లు మంత్రులను పట్టుకుని పది శాతం కమిషన్ ఇస్తున్నారని, అయినా వారు తమ బిల్లులు పొందలేక గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీస్ శాఖ, ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న తమ డబ్బులు తీసుకోలేని స్థితిలో ఉన్నారని, రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పెన్షన్లు అందడం లేదని అన్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదించేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయి, రైతులు తీవ్ర నష్టంతో కన్నీళ్లు పెడుతున్నారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News