కథ: అర్జున్ సర్కార్ (నాని) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం (హిట్)లో ఎస్పీగా పనిచేస్తుంటాడు. చాలా కోపిష్టి.. ముక్కుసూటి వ్యక్తి అయిన అర్జున్.. నేరస్థులతో చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. సమాజానికి హానికరమైన వ్యక్తుల అంతుచూసే దాకా వదలడు. అతను కాశ్మీర్‌లో పనిచేస్తుండగా.. ఒక విచిత్రమైన కేసు అతడికి ఎదురవుతుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో అతడికి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. చివరికి అతనే హత్యలు చేసి జైలు పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఈ కేసేంటి.. దాన్ని ఛేదించేందుకు అర్జున్ ఎక్కడిదాకా వెళ్లాడు.. చివరికి అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ‘హిట్’ పేరుతో ఒక ఫ్రాంఛైజీ సృష్టించి రెండు వరల్డ్ క్లాస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు అందించాడు శైలేష్ కొలను. ఇప్పుడు నాని రూపంలో ఇంకా పెద్ద స్టార్ ఈ ఫ్రాంఛైజీలోకి రావడంతో ‘హిట్ 3’ మీద అంచనాలు పెరిగిపోయాయి. శైలేష్ మార్కు ఉత్కంఠభరిత కథాకథనాలకు.. నాని అద్భుతమైన నటన కూడా తోడు కావడంతో ఈ సినిమా నెక్స్ లెవెల్‌లో ప్రేక్షకులను అలరించింది. ఎప్పటిలాగే అర్జున్ సర్కారుగా తన పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. అతని నుంచి అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్, వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగింది.
ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో నాని ప్రేక్షకులను మైమరపించారు. ’హిట్ 3’తో తెలుగు తెరకు నేరుగా పరిచయమైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. అడవి శేష్ క్లైమాక్స్‌లో మెరుపులా ఎంట్రీ ఇచ్చాడు. అమిత్ శర్మ, శ్రీనాథ్ మాగంటి, రావు రమేశ్, సముద్రఖని తదితరులంతా బాగానే నటించారు. షాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, మిక్కీ జే మేయర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని సీన్స్‌ను అద్భుతంగా చూపించాయి. ఇక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సినిమా చివరలో ఏసీపీ వీరప్పన్ గా కార్తీ సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో ’హిట్ -4’కు అతనే హీరో అని మేకర్స్ చెప్పేశారు.