Wednesday, May 8, 2024

నకిలీ బర్త్ సర్టిఫికేట్లు ఇస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నకిలీ బర్త్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న నలుగురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మొఘల్‌పుర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 243 బర్త్ సర్టిఫికేట్లు, థంబ్ స్కానర్, సిపియూ, మానిటర్, ప్రింటర్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భవానీనగర్‌కు చెందిన ఎండి ఇబ్రహిం, రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ అమీర్, కాలాపత్తర్‌కు చెందిన ఎండి షాబాజ్, ఎండి షానవాజ్ కలిసి నకిలీ బర్త్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు.

జిహెచ్‌ఎంసి జారీ చేసే బర్త్ సర్టిఫికేట్లను నిందితులు నకిలీవి ఇస్తున్నారు. నగరంలో వివిధ ఆస్పత్రుల్లో పుట్టిన వారి వివరాలు జిహెచ్‌ఎంలో భద్రపరుస్తారు. బర్త్ సర్టిఫికేట్లు కావాల్సిన వారు అక్కడి నుంచి తీసుకుని మీసేవాలో ధరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ వివరాలు లేని వారు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్లను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకుని మీసేవలో ధరఖాస్తు చేసుకోవాలి. ఇలా పుట్టిన రోజు వివరాలు లేని వారిని టార్గెట్‌గా చేసుకుని మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఎండి ఇబ్రహిం మిగతా వారితో కలిసి దందా చేస్తున్నాడు.

పుట్టిన వివరాలు లేని వారు ముగ్గురు నిందితులను సంప్రదించడంతో వారిని ఇబ్రహింకు అప్పగిస్తున్నారు. ఇబ్రహిం వారి నుంచి పేరు, పుట్టిన రోజు, తల్లిపేరు వివరాలు తీసుకుని రూ.2,000లు, రూ.2,500లకు నకిలీ బర్త్ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు నిందితులు 3,000 సర్టిఫికేట్లను జారీ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌క్టర్లు శివకుమార్, రాఘవేంద్ర, ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, షేక్‌బురాన్, నర్సింహులు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News