Thursday, May 2, 2024

వ్యవసాయ బిల్లుల కలకలం

- Advertisement -
- Advertisement -

Farmers protest on Agricultural bills

 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో చర్చ లేకుండా ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య ఆమోదించిన మూడు కీలకమైన వ్యవసాయ బిల్లులు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాలలో రైతులు ఆగ్రవేశాలతో ఉద్యమ బాట పట్టారు. 2022 నాటికి రైతులు ఆదాయాలు రెట్టింపు చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణల కోసం ఈ బిల్లులు తీసుకు వచ్చిన్నట్లు బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే మౌలికంగా రాష్ట్రాల అధికార పరిధిలోకి వచ్చే వ్యవసాయం, వయ్వసాయ మార్కెటింగ్ అంశాలపై రాష్ట్రాల ప్రమే యం లేకుండా ఈ విధంగా ఏకపక్షంగా బిల్లులు తీసుకు రావడం గమనిస్తే వేరే ఉద్దేశ్యాలు ఉన్నట్లు భావించవలసి వస్తుంది.

స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారత ఆర్ధిక విధానాల రూపకల్పనలో కీలకమైన వ్యవసాయం, గ్రామీణ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 1991లో చేపట్టిన ఆర్ధిక సంస్కరణలు సహితం ఈ రంగానికి విస్తరింపలేదు. అందుకనే రైతుల పాలిట విషం విరజిమ్మే నిత్యావసర వస్తువుల చట్టం, వ్యవసాయ మార్కెట్ కమిటీల సంస్కరణకు ప్రధాని మోదీ పూనుకోవడం స్వాగతనీయమే. అయితే బిల్లులను చూస్తే మాటలు తప్పా ఆచరణలో కొన్ని కార్పొరేట్ వర్గాలను దృష్టిలో పెట్టుకొని తీసుకు వచ్చిన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. బిల్లులకన్నా ముందుగా మూడు నెలల క్రితం తీసుకు వచ్చిన ఆర్డినెన్సులు దేశంలో రైతులకు ఎటువంటి ప్రయోజనం కలిగించక పోవడమే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

వ్యవసాయ, గ్రామీణ రంగాలను ఎంతగా నిర్లక్ష్యానికి గురిచేస్తున్న కరోనా మహమ్మారికి మొత్తం అన్నిరంగాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహితం దాదాపు దివాళా స్థితికి చేరుకున్నా నేడు మనలను ఆడుకొంటున్నది ఈ రంగాలు కావడం గమనార్హం. అయితే మొదటి నుండి మోదీ ప్రభుత్వం మౌలికమైన ఆర్ధిక సంస్కరణల విషయంలో దివాళా తనాన్ని ప్రదర్శిస్తున్నదని సుబ్రమణియన్ స్వామి వంటి ప్రముఖ ఆర్ధిక వేత్తలే చెబుతున్నారు. ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిన నోట్లరద్దు, జీఎస్టీ, లాక్ డౌన్ లు అందించిన దారుణమైన ఫలితాలు చూసిన వారికి ఈ ప్రభుత్వం ఆర్ధిక అంశాల సామర్థ్యంపై అనుమానం కలుగక మానదు. మూడు వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన సాయంతమే ఉల్లిపాయల ఎగుమతులపై ఏకపక్షంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించడం ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణిని వెల్లడి చేస్తుంది. ఉల్లిపాయలు నిత్యావసర వస్తువులు కావు.

రైతులకు కొంచెం ఆదాయం వస్తుంది అనుకొంటే వెంటనే ప్రభుత్వం ఖంగారుతో ఎగుమతులు నిషేధించడం చాలాకాలంగా వస్తున్నది. దానితో మన ఎగుమతి మార్కెట్ లలో మన విధానాల పట్ల విశ్వాసం కోల్పోవలసి వస్తున్నది. ఈ బిల్లులు వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయడం లేదు. రాష్ట్రాలలో అధికార పార్టీ నేతలు, దళారుల ప్రాబల్యంతో అవి కొనసాగుతూనే ఉంటాయి. కానీ మార్కెట్ లకు వెలుపల కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నది. దానినే అందంగా రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకొనే స్వేచ్ఛ ఇస్తున్నామని చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని 2016లో బీహార్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే అక్కడి రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని లిబర్టీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బరున్ మిత్ర గుర్తు చేస్తున్నారు. అట్లాగే నిత్యావసర వస్తువుల జాబితా నుండి కొన్ని ఉత్పత్తులను తొలగించినా ఆ చట్టాన్ని రద్దు చేయలేదు.

దానితో తిరిగి ఎప్పుడైనా తిరిగి ఆ ఉత్పత్తులను ఆ జాబితాలో చేర్చే అవకాశం ఉన్నదని ఆయన గుర్తు చేస్తున్నారు. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో, రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంటుందో అప్పుడు ఉల్లిపాయల మాదిరిగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆంక్షలు విదిస్తుంది. మొత్తం మీద వినియోగదారులు, కంపెనీలు, దళారుల ప్రయోజనాలకు ఇస్తున్న ప్రాధాన్యతను రైతులకు గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ సందర్భంగా మద్దతు ధరల విషయమై కేంద్ర ప్రభుత్వం గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. మద్దతు ధరకు ఢోకా ఉండదని ప్రభుత్వం అంటుండగా, మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేయరాదని కంపెనీలపై బిల్లులో ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెబుతున్నారు. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకై కంపెనీలు రైతులతో కాంట్రాక్టు చేసుకొనే అవకాశాన్ని ఈ చట్టాలు కల్పిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు కంపెనీలు 25 శాతంకు పైగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి కాంట్రాక్టులు అనధికారికంగా చేసుకొంటున్నాయి.

అటువంటి కాంట్రాక్టు లను అధికారికంగా చేసుకోవడం చాల సంక్లిష్టతతో కూడుకొని ఉండడమే కాకుండా కార్పొరేట్ కంపెనీల అకృత్యాలతో పోరాడే పటిమ రైతులకు ఉండదు. ఈ సందర్భంగా తలెత్తే వివాదాల పరిష్కార బాధ్యతను ఆర్డీఓ లకు అప్పజెబుతున్నారు. తలకు మించిన బాధ్యతలు మోస్తున్న ఆర్డీఓలు కార్పొరేట్ సంస్థల దగా నుండి రైతులను కాపాడగలరా?
ఈ చట్టాలను తీసుకు రావడంలో ప్రభుత్వం మంచి ఉద్దేశ్యాలను వ్యక్తపరుస్తున్నప్పటికీ ఆచరణలో రైతులకు కలిగే ప్రయోజనాల పట్ల ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ సహితం అనుమానాలు వ్యక్తం చేసింది. రైతులకు గిట్టుబాటు ధర లభించే విషయమై భరోసా లేదని స్పష్టం చేస్తున్నది.

వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రాకుండా వ్యవస్థనే నిర్వీర్యపరిస్తే రైతులు బైట కంపెనీలకు ఎటువంటి నియంత్రణ లేకుండా తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితులలో కొద్దీ పాటి కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ మార్కెట్ లపై ఆధిపత్యం వహిస్తూ రైతుల వద్ద నుండి కారుచవుకగా కొనుగోలుకు ప్రయత్నం చేస్తాయి. పైగా ఈ కంపెనీలు మద్దతు ధరకన్నా తక్కువకు కొనుగోలు చేయరాదనే నిబంధనలు చట్టంలో లేవు. రైతులతో కుదుర్చుకున్న కాంట్రాక్టు లలో మంచి ధరకు హామీ ఇచ్చినా, ఉత్పత్తులు వచ్చిన తర్వాత నాణ్యత తగురీతలో లేదని వంకలతో ఇష్టమొచ్చిన ధరలకు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది.

వ్యవసాయ మార్కెట్ లో ఒకటి, రెండు కార్పొరేట్ కంపెనీలు ఆధిపత్యం వహిస్తూ ఉంటె రైతులకు ధరల విషయంలో బెట్టు చేసే అవకాశం ఉండదు. పైగా, రైతు అంటే ‘తాను గాని లేదా తాను అద్దెకు తీసుకున్న కార్మికుల ద్వారా గాని వ్యవసాయ ఉత్పత్తులు చేసేవారు‘ అంటూ ఈ బిల్లులతో నిర్వచించారు. దాని ప్రకారం కంపెనీలు సహితం తాము రైతులమని చెప్పుకొనే అవకాశం కలుగుతుంది. దానితో మొత్తం రైతుల ప్రయోజనాలకు తీవ్రమైన విఘాతం కలుగుతుంది. రైతులు అంటే వ్యవసాయం ప్రవృత్తిగా గల వ్యక్తులు మాత్రమే అని, కంపెనీలు కాదని బిల్లులతో స్పష్టం చేసి ఉండవలసింది.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడం గురించి ప్రభుత్వం వద్ద ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక లేదని, ఆ విషయమై ఎప్పుడో ఒక కమిటీ వేసినా ప్రస్తుతం ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదని వ్యవసాయ మంత్రి తోమర్ చెప్పడం గమనిస్తే వ్యవసాయరంగం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడంలో గత ప్రభుత్వాల వారసతాన్నే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

                                                                                                             చలసాని నరేంద్ర

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News