Wednesday, May 8, 2024

రైళ్లు, పట్టాలపై రైతుల పచ్చజెండాలు

- Advertisement -
- Advertisement -
Farmers rail roko passes off peacefully
నాలుగు గంటలు ఆగిన రైళ్లు, ప్రశాంతం సంఘటితం, బలోపేతం

న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల దేశవ్యాప్త రైలురోకో ప్రశాంతంగా విజయవంతం అయింది. ఇప్పటివరకూ చట్టాల రద్దుకు రోడ్లు దిగ్బంధం చేసిన రైతులు ఇప్పుడు ఉద్యమ ఉధృతిలో భాగంగా గురువారం రైలు పట్టాలపై భైఠాయించారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, యుపి ఇతర ప్రాంతాలలో రైళ్లను రైతు నిరసనకారులు నిలిపివేశారు.దీనితో దీని ప్రభావం దేశవ్యాప్తంగా పడింది. ఇకముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో రైల్వే అధికారులు ముందుగానే దూర ప్రాంత రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నిరసనలను సంఘటిత రూపంలో తీవ్రతరం చేస్తోంది. చట్టాల రద్దుకు తమ డిమాండ్‌ను బలోపేతం చేసే దిశలో గతవారం దేశవ్యాప్త రైలురోకో పిలుపు నిచ్చిం ది. తాము ప్రశాంతంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకూ రైలురోకో నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. హర్యానాలోని కురుక్షేత్ర వద్ద రైతులు గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలుపైకి ఎక్కారు. ఈ సమయంలో రైలు స్టేషన్‌లో నిలిచి ఉంది. కురుక్షేత్ర స్టేషన్ నుంచి మధ్యాహ్నం బయలుదేరాల్సిన ఈ రైలు రైతుల భైఠాయింపులతో నిలిచిపోయింది.

పంజాబ్‌లో నిరసనకారులు పట్టాలపై తిష్టవేశారు. పంజాబ్‌లో రైతుల ఉద్యమం బలంగా ఉంది. అక్కడ ఢిల్లీ లూథియానాఅమృత్‌సర్ రైల్వే మార్గంలో రైలు పట్టాలపై రైతుల ఆందోళన సాగింది. జలంధర్ కంటోన్మెంట్ జమ్మూ రైల్వే ట్రాక్‌ను జలంధర్‌లో ముట్టడించారు. హర్యానాలో నిరసనకారులు మహిళలతో పాటు రైల్వే పట్టాలపై నిలబడ్డారు. అంబాలా, కురుక్షేత్ర, పానీపట్,పంచకుల, ఫతేబాద్ జిల్లాల్లో రైతుల నిరసనల ప్రభావం రైళ్ల రాకపోకలను దెబ్బతీసింది. అంబాలా ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో రైతుల బృందం బికెయు నేత గులాబ్ సింగ్ నాయకత్వంలో పట్టాలెక్కారు. షాహ్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఇక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. తమ ఉద్యమం పట్టాల పై అయినా రోడ్లపై అయినా ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటుందని అంబాలాకు చెందిన నేత గులాబ్ సింగ్ మనకాపూర్ తెలిపారు. పంజాబ్, హర్యానాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో ముందుగానే రైళ్లను నిలిపివేశారు. దీనితో రైలు ప్రయాణికులు ముందుగానే పరిస్థితి తెలుసుకుని ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. పలు చోట్ల భద్రతా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు.

అవాంఛనీయ ఘటనలు లేవు : రైల్వే

నాలుగు గంటల రైతుల రైల్‌రోకో ప్రశాంతంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగిందని రైల్వే అధికారులు గురువారం సాయంత్రం ప్రకటన వెలువరించారు. రైళ్ల రాకపోకలపై నామమాత్రపు ప్రభావం పడిందని, కొద్ది గంటల వ్యవధిలోనే అంతా కుదుటపడిందని తెలిపారు. దేశవ్యాప్తంగా రైళ్ల ప్రయాణ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అన్ని జోన్లలో ఇప్పుడు రైళ్లు సాధారణ పరిస్థితులకు అనుగుణంగా సాగుతున్నాయని వివరించారు. కొన్ని చోట్ల కొద్ది సేపు రైళ్లు స్టేషన్‌లలోనే నిలిపివేశారని, తరువాత ఇవి నడిచాయని తెలిపారు. రైల్వేలు భద్రతా ఏర్పాట్లలో భాగంగా 20 అదనపు కంపెనీల రైల్వే పోలీసు బృందాలను రంగంలోకి దింపాయి. కీలక ప్రాంతాలలో పోలీసుల హడావిడి కన్పించింది. దీనితో ప్రయాణికులు కంగుతిన్నారు. యుపి, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా వంటి చోట్ల పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా నిరసనలకు దిగాలని ఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికార యంత్రాంగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమన్వయపర్చుకుని చర్యలు చేపట్టేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు కుమార్ తెలిపారు.

ఉద్యమం ప్రశాంతయుతం : తికాయత్

తమ నిరసనలు శాంతియుతంగా ఉంటాయని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ రైలు రోకో కార్యక్రమానికి ముందు తెలిపారు. నిరసనల కొనసాగింపు ప్రక్రియకు సంకేతంగా రైళ్లను నిలిపివేస్తామని, అయితే ప్రయాణికులను బాధించడం తమ ఉద్ధేశం కాదన్నారు. స్టేషన్లలోని ప్రయాణికులకు తాము పాలు, లస్సీ, రొట్టేలు, పండ్లు అందిస్తామని తెలిపారు. తమ నిరసనల గురించి వారికి తెలియచేస్తామన్నారు. హిస్సార్‌లో రెండు ర్యాలీలు జరిగాయని, ఇందులో తాను పాల్గొన్నానని, ముంబైలో శుక్రవారం సభ జరుగుతుందని చెప్పారు. దేశంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ర్యాలీలు ఉంటాయని వివరించారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత ఇవ్వడం వల్లనే సమస్యకు పరిష్కారం దక్కుతుందన్నారు.

రైలురోకోతో తేలిందేమిటంటే… రైతుల ఉద్యమం దేశవ్యాప్తమని

ఇప్పుడు గురువారం జరిగిన రైలురోకో దేశవ్యాప్తంగా విజయవంతం అయిందని,దీనితోనే తమ ఉద్యమం దేశవ్యాప్తం అని,కొన్ని ప్రాంతాలకే పరిమితం కాదని వెల్లడైనట్లు రైతు నేతలు తెలిపారు. రైలు రోకో తరువాతి దశలో క్రాంతికారి కిసాన్ యూనియన్ గురుదాస్‌పూర్ ప్రాంత నేత భజన్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. పలు రైతు సంఘాలు కలిసి ఐక్యవేదికగా ఏర్పడి ఈ ఉద్యమం సాగిస్తున్నామని , కేంద్రం తరచూ ఈ ఉద్యమం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అంటోందని, ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా చిన్నా పెద్ద స్టేషన్లు, సుదీర్ఘదూరపు రైలు పట్టాలపై రైతుల ఉద్యమం సాగిందని , ప్రభుత్వం ఇకనైనా తమ తప్పుడు భావనలు వీడితే మంచిదని రైతు నేతలు హితవు పలికారు. పలు రాష్ట్రాల రైతులు నిరసనలలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని విస్తరింపచేసేందుకు ఈ రైలురోకో మార్గాన్ని ఎంచుకున్నామని తెలిపారు. సింఘు సరిహద్దులలో సాగుతున్న నిరసన స్థలి నుంచి రైతు నేతలు విలేకరులతో మాట్లాడారు.

రైల్వే లాగానే రైతులకు దేశవ్యాప్త అనుసంధాన వ్యవస్థ ఉందని, ఇది ఆసేతు హిమాచలం ఉందని, దీనిని ఎవరూ కాదనలేరని , ఆగిన రైళ్లతో తమ సాగే ఉద్యమం ఉధృతిని చాటుకుంటుందని తెలిపారు. వెంటనే మూడు వివాదాస్పద చట్టాలు రద్దు కావాలి. అప్పుడు తమ ఉద్యమం ఆగిపోతుందని, ఈ దిశలో తాము అన్ని స్థాయిల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని బికెయు నేతలు తెలిపారు. తమ నాలుగు గంటల రైలురోకో కేవలం సంకేత సూచకం అని, ప్రజలు ఇక్కట్లకు గురి కాకుండా ఉండటం తమ ఆలోచన అని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలకు అనుగుణంగా స్పందించాలని, అప్పుడు వారు కంటినిండా కునుకు తీస్తారు, తాము తిరిగి ఇళ్లకు వెళ్లి కుటుంబాల వద్దకు వెళ్లుతామని నేతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News