న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై గతంలో తన స్వరం వినిపించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పై మాజీ రా చీఫ్ ఎఎస్ దౌలత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకంగా పోరాడినా లోలోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారని ఆరోపించారు. ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై పేరుతో విడుదలైన పుస్తకంలో దౌలత్ ఈ విషయాలు వెల్లడించారు. “ బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో ఫరూక్ అబ్దుల్లా … మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. కానీ లోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారు. ఎన్నోసార్లు మోడీ సర్కార్ చర్యలపై సానుకూలంగా స్పందించారు.
ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన వచ్చిన సమయంలో వ్యక్తిగతంగా ఫరూక్ అబ్దుల్లా నాతో మాట్లాడారు.ఈ బిల్లుకు మద్దతు తెలపడంలో తప్పేంటి ? దీనిపై మనమెందుకు విశ్వాసం ఉంచకూడదు ? అని అన్నారు. ” ఈ విషయాన్ని దౌలత్ పుస్తకంలో పేర్కొన్నారు. “ ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫరూక్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా (ప్రస్తుత సిఎం) ఢిల్లీ లోని ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. అయితే ఈ విషయాన్ని చివరివరకు రహస్యంగా ఉంచారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిన తరువాత కొన్ని నెలల పాటు అబ్దుల్లా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. బయటకొచ్చాక తాను ఏం మాట్లాడినా పార్లమెంట్‌లోనేనని అన్నారు ” అని కీలక విషయాలను ప్రస్తావించారు. దౌలత్ తన పుస్తకంలో వెల్లడించిన అంశాలపై నేషనల్ కాన్ఫరెన్స్ తీవ్రంగా స్పందించింది. తన పుస్తకాన్ని సంచలనంగా మార్చేందుకు దౌలత్ చేస్తున్న ప్రయత్నమని నేషనల్ కాన్ఫరెన్స్ విమర్శించింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. మరోవైపు , జమ్ముకశ్మీర్ లోని ప్రతిపక్షాలు ఫరూక్ అబ్దుల్లాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. దౌలత్ చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని, మాజీ సిఎంకు ఆయన సన్నిహితుడని పేర్కొన్నాయి. ఫరూక్ విషయాలన్నీ ఆయనకు బాగా తెలుసని అన్నాయి. దౌలత్ పుస్తకంలో ప్రస్తావించిన ఈ విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.