సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశం రోజురోజుకూ మరింత ముదురుతోంది. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్‌కు మధ్య జరిగిన చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో 24 యూనియన్ల సినీ కార్మికులు పాల్గొనడం విశేషం. అయితే, శనివారం నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్‌కు మధ్య జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు. ఈ క్రమంలో నిర్మాతలు మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆదివారం నుంచి తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించడంతో ఈ సమస్య మరింతగా ముదిరింది. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. చివరకు ఈ సమస్య ఎలా ముగుస్తుందో చూడాలి.
మెగాస్టార్ మాతో టచ్‌లోనే ఉన్నారు
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి తమతో టచ్‌లో ఉన్నారన్నారు. ఛాంబర్‌తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారని చెప్పారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామని ప్రకటించారు. కార్మికులకు పీపుల్స్ మీడియా వారు రూ.90 లక్షలు ఇవ్వాలని.. ఆ డబ్బులన్నీ తక్షణమే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చేవరకు టీజీ విశ్వప్రసాద్‌కు సంబంధించిన సినిమాల షూటింగ్స్‌ను బ్యాన్ చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు.