Sunday, May 19, 2024

ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు

- Advertisement -
- Advertisement -

Skin Bank

 

అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు
మరణాల రేటును తగ్గించడంపై దృష్టి
డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు

హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. కాలిన గాయాలతో రాష్ట్రంలో పెద్దఎత్తున మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలను ప్రారంభించింది. కాలిన గాయాలతో మరణాల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోంది. మలేరియా, క్షయవ్యాధి వంటి సంక్రమణ వ్యాధుల వల్ల సంభవించే మరణాల కంటే ఈ మరణాల సంఖ్యనే అధికంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 70 లక్షలకు పైగా ప్రజలు కాలిన గాయాలతో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మరణాల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే నగరంలో తొలి స్కీన్ బ్యాంక్‌ను పూర్తి స్థాయిలో ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఈ ఆసుపత్రికి ప్రతి నెలా సుమారు 100 మంది పేషంట్లు కాలిన గాయాలతోనే వస్తున్నారని తెలుస్తోంది. ఆసుపత్రిలో కాలిన గాయాలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నప్పటికీ పేషెంట్లకు సరిపడా చర్మం అందుబాటులో ఉండడం లేదు. ఎక్కువ శాతం కాలిన గాయాలతో వచ్చే వారికి దశల వారీగా చర్మం తీసి కాలిన ప్రాంతంలో సర్జరీ ద్వారా అమర్చుతున్నారు. కాలిన వ్యక్తి తొడ భాగంతో పాటు ఇతర భాగాల నుంచి తీస్తున్న చర్మం గాయాలపై సరిపోవడం లేదు. ఒక వ్యక్తి నుంచి ఒక సారి చర్మం తీసిన తరువాత మళ్లీ అదే భాగం నుంచి చర్మం తీసుకోవాలంటే 2, 3 వారాల పాటు ఆగాల్సి వస్తోంది. దీంతో సదరు రోగికి ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా పేషెంట్ ప్రాణాలను ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే ఇన్ఫెక్షన్‌కు తావు లేకుండా ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉస్మానియాలో సంవత్సరానికి 1,000 వరకు ప్లాస్టిక్ సర్జరీలు జరుగుతున్నాయి. కాలిన గాయాలు, చేతికి, కాళ్లకు, శరీరంపై ఇతర భాగాల్లో తీవ్ర గాయాలు, తెగిన చేతులు, వేళ్లు అతికించడం ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరం అవుతోంది. ఇప్పటి వరకు రోగి శరీరంలోని వివిధ భాగాల నుంచి చర్మాన్ని సేకరించి గాయాలైన చోట అమర్చుతున్నారు. ఇది 15 నుంచి -20 శాతం మాత్రమే సేకరించడానికి సాధ్యమవుతోంది. అంతకంటే ఎక్కువ చర్మం అవసరమైనప్పుడు కష్టమవుతోంది. అందుకే చర్మ బ్యాంకు ఏర్పాటు అత్యవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా ఈ బ్యాంకు ఏర్పాటు చేయడం వల్ల చనిపోయిన వ్యక్తి నుంచి పలు అవయవాలను సేకరించినట్లే ప్రమాదాల్లో మృతి చెందిన వారి నుంచి కూడా కుటుంబ సభ్యుల అనుమతితో 12 గంటల్లోపు చర్మాన్ని సేకరించి భద్రపరించేందుకు అవకాశముంటుంది.

అవయవాలను సాధారణంగా 4 నుంచి 7 గంటల్లోపే ఇతరులకు అమర్చాల్సి ఉంటుంది. అమర్చిన తర్వాత కూడా జీవితాంతం అవసరమైన మందులను వాడాలి. చర్మాన్ని మాత్రం ఎన్ని రోజులైనా భద్రపరిచేందుకు వీలుంది. ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి కొన్ని రోజులపాటు కవర్‌గా మాత్రమే దానిని వాడతారు. తర్వాత ఇది ఊడిపోతుంది. అందుకే ఎక్కువగా మందు లు వాడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ముంబయి, గుజరాత్, పుణె, ఢిల్లీలలో మాత్రమే ఈ తరహా బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నాయి. ప్రైవేటులో ఒక శాతం చర్మానికి గ్రాఫ్టింగ్‌చేయాలంటే రూ. 30 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఖర్చవుతోం ది. ఇక 30- నుంచి 40శాతం కాలిన గాయాలైతే గ్రాఫ్టింగ్‌కు రూ. 15 లక్షలపైనే ఖర్చు అవుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో ఈ బ్యాంకు ఏర్పాటు చేస్తే పేదలు, సామాన్యులకు మేలు జరుగుతుందని వైద్యులు భావిస్తున్నారు.

First Skin Bank in Osmania
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News