Monday, April 29, 2024

డాక్టర్లు కంటికి కనిపించే దేవుళ్ళు..

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: సమాజంలో డాక్టర్ల పాత్ర కీలకమని, డాక్టర్లు కనిపించే దేవుళ్ళని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. సదరం సర్టిఫికేట్ల కోసం జిల్లాల నుండి దరఖాస్తు చేసుకొని ఉస్మానియాలో ప్రభుత్వ హాస్పిటల్‌లో హాజరు అవుతున్న వికలాంగులకు ఓపికగా సేవలందిస్తున్న డాక్టర్లను గుర్తిస్తూ ఆసుపత్రి అవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వారిని ఘనంగా పూల బోకే, శాలువాతో సత్కరించి బెస్ట్ సర్వీస్ అవార్డును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆసరా పథకం ద్వారా నెలకు రూ.4016లు పెన్షన్లు అందిస్తూ వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, ప్రభుత్వం వికలాంగులకు ఎలాంటి సంక్షేమ పతకాలు అందాలన్న వారికి సదరం సర్టిఫికేట్లు తప్పనిసరి ఉండాలే నిబంధన ఉందని దీంతో రాష్ట్రంలో సదరం క్యాంపులకు డిమాండ్ పెరిగిందన్నారు. దీంతో డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుందని అయినా చాలా ఓపికగా రోగుల ఇబ్బందిని తెలుసుకుంటూ పరిష్కారం చూపుతున్న వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవలు మరవలేనివని కుటుంబ సభ్యులు కూడా దగ్గరగా ఉండలేని పరిస్థితుల్లో కూడా మానవతా హృదయంతో అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించిన చరిత్ర డాక్టర్లకు ఉందని గుర్తు చేశారు.

ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసిందని, దీంతో అనేక మంది కొత్తగా డాక్టర్స్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఏర్పడ్డాయి. లక్ష కు 22మంది ఎంబిబిఎస్ డాక్టర్స్ ఉంటారని అద్భుతమైన నూతన దవాఖానలు రాబోతున్నాయని రాష్ట్రం తెల్ల కోటు విప్లవం తీసుకొచ్చిన చరిత్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. జిల్లాలో సదరం క్యాంపులో తిరస్కరణ అయిన వారు ఉస్మానియా హాస్పిటల్‌కి వస్తే ఇక్కడి డాక్టర్లు ఓపికగా సేవలను అందిస్తు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు.

ఉస్మానియా ఆసుపత్రిలో ఆర్థో విభాగంలో 2017 నుండి ఇప్పటివరకు 2599 దరఖాస్తులు రాగా అర్హతలను పరిశీలించి 1490 మందిని అర్హులుగా గుర్తించి సదరం సర్టిఫికెట్లు అందించారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ఇంకా వేగవంతం చేసి వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్లను కోరారు. వికలాంగులకు సేవలందిస్తున్న మీ సేవలు మరువలేనివని, మీ అందరిని సత్కరించటం మా అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా సూపరింటెండెంట్ డా.నాగేందర్, డా.తిమ్మారెడ్డి, డా.రమేష్, డా.క్రిష్ణరెడ్డి, డా.ప్రవీణ్ , డా.సతీష్, డా.అబ్బాస్, డా.ఆగ్నేష్, డా.రంగలక్ష్మి, డా.వీణ , డా.అఖిలేష్ , డా.అర్చన , డా.శ్రీధర్ , డా.మస్తాన్ రెడ్డి సెర్ప్ ఉద్యోగులు విజయలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News