Thursday, May 2, 2024

ప్రతి జిల్లాలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్

- Advertisement -
- Advertisement -

Talasani

 

హైదరాబాద్: పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలలో ఉన్న సమస్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముందుగా శాఖల వారిగా రాష్ర్టస్థాయిలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. అనంతరం జిల్లాల వారిగా శాఖలపై సమావేశాలు నిర్వహించి సమస్యలపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను రూపొందించి అందజేయాలన్నారు. దీనిని సిఎం దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. 15 రోజులలో అధికారులతో మరో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రాష్ర్ట పర్యటన సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలుసుకొని వాటి గురించి ఇతర రాష్ట్రాలలో వివరిస్తున్నారని తెలిపారు. 2017 జూన్‌లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం కింద 76.92 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా వాటి వలన 70.88 పిల్లలు జన్మించాయని అన్నారు. వీటి విలువ సుమారు రూ.3189 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా విజయ పాల ఉత్పత్తుల విక్రయాలను మరింతగా పెంచేందుకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పలు నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, మరిన్ని ఔట్ లెట్ ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. మత్స్యకారుల సంక్షేమ కోసం ఈ సంవత్సరం 64 కోట్ల చేపపిల్లలు, 3.5 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను ఉచితంగా అన్ని నీటి వనరులలో విడుదల చేయడం జరిగిందని అన్నారు.

చేపల కోసం సుదూర ప్రాంతాలలోని చేపల మార్కెట్ లకు ప్రజలు వెళుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజల వద్దకే వెళ్ళి చేపలు విక్రయించేలా త్వరలో నగరంలోని 150 డివిజన్‌లలో డివిజన్ కు ఒకటి చొప్పున మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల నగరంలో ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు విశేష స్పందన వచ్చిందని, రాష్ర్టంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇలాంటి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ ను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల కార్యదర్శిగా బాద్యతలు చేపట్టిన అనిత రాజేంద్ర మంగళవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, టిఎస్‌ఎల్‌డిఎ ఎం.డి మంజువాణి, పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, డెయిరీ అధికారులు మల్లయ్య, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

 

Fish Food Festival in each district
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News