Friday, May 3, 2024

జల విలయం

- Advertisement -
- Advertisement -

10 మంది యాత్రికుల మృతి, 40మంది గల్లంతు?
కొట్టుకుపోయిన యాత్రికుల టెంట్లు…కుంభవృష్టితో యాత్ర నిలిపివేత

శ్రీనగర్ : అమర్‌నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మికంగా వరద పోటెత్తింది. 15మంది మృత్యువాత పడ్డారు. 40మంది వరకు గల్లంతయ్యారు. సుమారు 12 వేల మంది భక్తులు వరద ముంపులో చిక్కుకున్నారు. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. సాయంత్రం 5.30గం. నుంచి కుంభవృష్టి మొదలైంది. భోలేనాథ్ గుహ సమీపంలో గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుందని, శుక్రవారంనాడు అది మరింత తీవ్ర రూపం దాల్చడంతో ఆకస్మిక వరద వచ్చినట్లు, దాని ఉధృతికి యాత్రికుల టెంట్లు మొత్తం కొట్టుకుని పోయాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. చాలా మంది కనిపించకుండా పోవడంతో వరదలో కొట్టుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కురిసిన ఏకధారకు 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐటిబిపి, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు లైట్ల వెలుతురులో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షంతో సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి
అమరనాథ్ బేస్ క్యాంప్ వద్ద కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో యాత్రికుల గుడారాలు కొట్టుకు పోయి 15 మంది యాత్రికులు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో మరో 40 మంది జాడ తెలియడం లేదు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రధాని సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. బాధితలకు అన్ని రకాల సాయం అందించడానికి చర్యలు తీసుకొంటున్నట్లు కూడా ఆయన తెలిపారు. జమ్మూ, కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిన్హాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలు అమలు జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకున్నారు.

నదిలో కొట్టుకుపోయిన కారు: 9 మంది మృతి
నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ధేలా నది పొంగి ప్రవహిస్తుండడంతో శుక్రవారం ఉదయం రాంనగర్ వద్ద వంతెనపైన ఒక కారు కొట్టుకుపోయి తొమ్మిదిమంది మరణించారు. తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్లు ఎస్‌ఎస్‌పి పంకజ్ భట్ తెలిపారు. మృతులంతా పర్యాటకులని, వీరు పంజాబ్‌కు తిరిగివెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ సంఘటనలో కార్బెట్ కాలనీకి చెందిన నజియా అనే 22 ఏళ్ల వ్యక్తిని సజీవంగా కాపాడి రాంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. కారు రిజిస్ట్రేషన్ పంజాబ్‌కు చెందినది కావడంతో మృతులు పంజాబ్‌కు చెందిన వారిగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతులలో ఆరుగురు మహిళలు కాగా ముగ్గురు పురుషులని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై నది పొంగి ప్రవహిస్తోందని, నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయిందని ఎస్‌ఎస్‌పి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News