Wednesday, May 8, 2024

అత్యంత ప్రియతమ ఆత్మీయుడ్ని కోల్పోయా

- Advertisement -
- Advertisement -

Modi Deeply saddened by Shinzo Abe death

గొప్ప పాలనా దక్షత ఉన్న నేత
ఆయనతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం
ప్రధాని మోడీ తీవ్ర విచారం
అబె గౌరవార్థం రేపు జాతీయ సంతాప దినంగా ప్రకటన

న్యూఢిల్లీ: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతితో అత్యంత ప్రియతమ ఆత్మీయుల్లో ఒకరిని కోల్పోయానని, ఆయన మృతి షాక్‌కు గురి చేసిందని ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ నా ప్రియతమ స్నేహితుల్లో ఒకరైన అబె మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయనొక మహా రాజనీతిజ్ఞుడు. గొప్ప పాలనా దక్షత ఉన్న నేత. జపాన్‌ను, ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో నాకు అనుబంధం ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన మా పరిచయం.. నేను ప్రధాని అయిన తర్వాత కూడా కొనసాగింది. ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వ్యవహారాలపై ఆయనకున్న పరిజ్ఞానం నాపై అమితమైన ప్రభావం చూపించింది. ఇటీవల జపాన్ వెళ్లిన సమయంలో ఆయనను మరోసారి కలుసుకునే అవకాశం లభించింది. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. ఎప్పటిలాగే చమత్కారంగా మాట్లాడారు. అదే చివరి సమావేశం అవుతుందని అస్సలు ఊహించలేదు. అబె కుటుంబానికి జపాన్ దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో జపాన్ ప్రజలకు భారత్ సంఘీభావంగా ఉంటుంది. ఆయన మృతిపట్ల గౌరవ సూచకంగా ఈ నెల 9న ఒక రోజు జాతీయ సంతాపదినంగా పాటిస్తున్నాం’ అని ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల వారిద్దరూ కలిసిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

సోనియా సంతాపం

కాగా అబె మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అబె, భారత్ మధ్య స్నేహం కొనసాగుతోందని, రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్న సోనియా ఆయన మృతితీరని లోటని అన్నారు. కాగా భారత్ జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో అబె చేసిన కృషి అభినందనీయం అని పేర్కొన్న రాహుల్ గాంధీ, ఆయన కుటుంబానికి, జపాన్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రపంచ నేతల దిగ్భ్రాంతి

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె మృతి పట్ల ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అబెపై కాల్పుల వార్త తెలియగానే ప్రచారాన్ని అర్ధంతరంగా నిలిపి వేసుకుని హుటాహుటిన టోక్యో చేరుకున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా మీడియాతో మాట్లాడుతూ ఇది అనాగరిక, హింసత్మక ఘటన అని పేర్కొన్నారు. దీన్ని తాము ఎంతమాత్రం సహించబోమని,ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అబె మృతిపట్ల అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అబెపై దాడి ఘటన విని తాము షాక్‌కు గురయ్యామని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటీష్ ప్రధాని బొరిస్ జాన్సన్, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెమ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మార్కోమ్, ప్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానెసె, ఇటలీ ప్రధాని మారియో ద్రాఘీ, ఇండోనేసియా విదేశాంగ మంత్రి రెట్నో మరుసడి సహా పలు దేవాల నేతలు అబె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News