Friday, March 29, 2024

మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former Minister Juvwadi

 

జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హాజరైన మంత్రులు హరీశ్‌రావు, ఈటల, కొప్పుల
సిఎం కెసిఆర్ సంతాపం

మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల కరీంనగర్‌లోని తన నివాసానికి తరలించారు. ఆదివారం తెల్లవారు జామున కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జువ్వాడి తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు నర్సింగరావు, కృష్ణా రావు ఉన్నారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అంత్యక్రియలను ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో నిర్వహించారు.

రత్నాకర్‌రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సిఎం ప్రార్దించారు. ఈ క్రమంలో రత్నాకర్ రావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సిఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంత్యక్రియల్లో మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జెడ్‌పి చైర్మన్ పుట్ట మధు, ఎంఎల్‌ఎలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ హోంమంత్రి జానారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అంచెలంచెలుగా ఎదిగిన జువ్వాడి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరైన జువ్వాడి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ దక్షత ఉన్ననేతగా పేరుగాంచారు. ధర్మపురి సమీపంలోని తిమ్మాపూర్ ఆయన స్వగ్రామంలో సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కాలక్రమంలో ల్యాండ్స్ అండ్ మెజర్‌మెంట్స్ బ్యాంక్ చైర్మన్‌గా, జగిత్యాల సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో జగిత్యాల నుంచి ఎంఎల్‌ఎగా పోటీచేసి ఓటమిని చవిచూశారు. 1989లో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తొలిసారి ఎంఎల్‌ఎగా గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ అల్లుడు భీమ్‌సేన్‌ను ఓడించిన జువ్వాడి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999, 2004లో వరుసగా రెండుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పని చేశారు.2009 ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News