Thursday, May 2, 2024

మాది గాంధీ వారసత్వం..మోడీ గాడ్సే వారసుడు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ప్రభుత్వం గాంధీ ఆశయాలను కచ్చితంగా ఆచరిస్తున్నది
ప్రధానికి బిజెపి నేతలు తప్పుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు
కనీసం నిజామాబాద్‌లోనైనా మోడీ నిజాలు మాట్లాడాలి
ఎంఎల్‌సి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీది గాంధీ స్ఫూర్తి అయితే.. బిజెపిది గాడ్సే స్ఫూర్తి అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌తో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి బిఆర్‌ఎస్ తరపున నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ ఆశయాలను సిఎం కెసిఆర్ ప్రభుత్వం కచ్చితంగా ఆచరిస్తున్నదని తెలిపారు. గాంధీ సినిమాను దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు రాష్ట్రంలో ప్రదర్శించి జాతిపిత గురించి మరింతగా తెలిసేలా చేశామని అన్నారు. నకిలీ గాంధీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆరోపించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు అలవోకగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మోడీ లాంటి వ్యక్తి గల్లీ నాయకుడి స్థాయిలో వ్యవహరించారని మండిపడ్డారు. ప్రాజెక్టుల ద్వారా ఒక చుక్క నీరు పారలేదని మోడీ నిస్సిగ్గుగా మాట్లాడారని, ఇంత కన్నా అబద్దం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.

నిజామాబాద్‌లోనైనా నిజాలు మాట్లాడాలి..
తెలంగాణ ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోతే ఇన్ని లక్షల టన్నుల ధాన్యం ఎలా పండిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రధాని మోడీని నిలదీశారు. మోడీకి బిజెపి నేతలు తప్పుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చారని ఆరోపించారు. కనీసం మంగళవారం జరుగనున్న నిజామాబాద్‌లోనైనా స్క్రిప్ట్ సరి చేసి మాట్లాడాలని సూచించారు. రైతు ఆత్మహత్యలపై కేంద్ర మంత్రి తోమర్ ఓ మాట చెబితే ప్రధాని మరో మాట చెప్పారని, ఆ మాటలు విని అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని కోరారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధుకు,కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధికి పోలిక ఎక్కడ అని ప్రశ్నించారు. రైతు బంధు ద్వారా ఇప్పటికే తమ ప్రభుత్వం రూ. 75 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశామని, కేంద్రం జమ చేసింది రూ.10 వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు.

బిజెపి అంటే బిజినెస్ జనతా పార్టీ..
బిజెపి పార్టీ అంటే బిజినెస్ జనతా పార్టీ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. పసుపు బోర్డుపై తొమ్మిదేళ్లుగా మొత్తుకుంటే ఇపుడు ఎన్నికల ముందు మోడీ ప్రకటన చేశారని పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఎపుడో ఇవ్వాల్సిందని, కానీ ఇప్పుడు ప్రకటించారని అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయానికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని మోడీ అబద్దాలు మాట్లాడారని, ప్రధాని మాట్లాడింది తప్పు అని ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ గాంధీ కెసిఆర్‌నే ప్రజలు నమ్ముతారు..
గాడ్సే వారసులకు, నకిలీ గాంధీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ గాంధీ కెసిఆర్‌నే ప్రజలు నమ్ముతారని స్పష్టం చేశారు. మళ్ళీ ప్రజల ఆశీర్వాదం కెసిఆర్‌కే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మరని అన్నారు. కర్ణాటక ప్రస్తుతం కరువుతో అల్లాడుతోందని, కర్ణాటక మోడల్ ఫెయిల్ మోడల్ అని విమర్శించారు. కాంగ్రెస్ పథకాలు ముందట పడవని చెప్పారు. కాంగ్రెస్ ఏ పథకం అమలు చేసినా.. అది చివరి దాకా అమలు కాదని చరిత్ర చెబుతోందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News