Wednesday, December 6, 2023

ప్రశాంతంగా నిమజ్జనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : చెదురుమొదురు ఘటనలు మినహా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మళ్లీ ఏడాది తిరిగిరమ్మంటూ లంబోదరులను సాగనంపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా పది వేలకు పైగా విగ్రహాలకు నిర్వాహకులు రిజిస్టర్ చేసుకున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 90 వేల గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతి ముందుగా నిమజ్జనం చేశారు. ఈసారి భారీగా విగ్రహాలు ఏర్పాటు చేయ డంతో నిమజ్జనం ఆలస్యమైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేయడమే నిమజ్జనం ఆలస్యానికి ఓ రకంగా కారణమైంది. గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమజ్జనోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అవసరం మేరకు వివిధ జిల్లాల్లో విధులు కేటాయించగా నిమజ్జనం వరకు నిర్ణీత ప్రాంతంలో విధుల్లో పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 60 వేల మంది నిమజ్జన బందోబస్తులో మోహరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 40 వేల మంది పోలీసులు నిమజ్జన బందోబస్తులో పాల్గొన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈసారి గణపతి లడ్డూలకు అనూహ్యమైన పోటీ పెరిగింది. బండ్లగూడ జాగీర్ పరిధిలోని సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన లడ్డూ ఏకంగా కోటి 26 లక్షలు పలికింది. అలాగే బాలాపూర్ గణేష్ లడ్డూ 27 లక్షలకు అమ్ముడు పోయింది.
పోలీసుల కృషి ప్రశంసనీయం…
వినాయక నిమజ్జన మహా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేలా చూడటంలో పోలీసులు చేసిన కృషి ప్రశంసనీయమని డిజిపి అంజనీకుమార్ కొనియాడారు. లక్షలాది సంఖ్యలో జనం పాల్గొన్న నిమజ్జన యాత్ర శాంతియుతంగా ముగియటంలో సహకరించిన వేర్వేరు ప్రభుత్వ శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. పోలీస్‌కమాండ్‌కంట్రోల్‌లో ఏర్పాటు చేసిన వార్‌రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి సూచనలు ఇవ్వటం ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడగలిగారన్నారు. అదే క్రమంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన పోలీసు సిబ్బంది సైతం గణనాథుల శోభాయాత్ర, నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు.
అపశృతులు.. ఐదుగురు మృత్యువాత..?
కాగా, నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సంజీవయ్య పార్క్ స్ట్రెచ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్, ఇబ్రహీంపట్నం వద్ద గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల మధ్య ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 1:45 గంటలకు, ఇబ్రహీంపట్నంలో గణేష్ విగ్రహాన్ని తీసుకువెళుతున్న ట్రాలీ నుండి ప్రమాదవశాత్తు జారిపడి 8వ తరగతి చదువుతున్న అంకిల శరానంద్ (14) మృతి చెందాడు. ఈ ఊరేగింపు చెర్లపటేల్‌గూడ గ్రామం నుండి సమీపంలోని స్థానిక సరస్సుకు వెళుతుండగా, బాలుడు, అతని స్నేహితులు,కుటుంబ సభ్యులతో కలిసి, ప్రమాదవశాత్తూ వాహనం నుండి జారి పడిపోయాడని ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ జి.రామకృష్ణ తెలిపారు. వెనుక చక్రం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎ. అయాన్ష్ (5) తన తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై ఇంటికి వెళుతుండగా బషీర్‌బాగ్ వద్ద గణేష్ విగ్రహాలను తీసుకెళ్తున్న లారీని వారు ఢీకొట్టారు. అయాన్ష్ తండ్రి వాహనాన్ని లారీని ఢీకొట్టాడు. వారు సాగిన తీరును చూడలేక బైక్‌ను ఢీకొట్టారని, అయాన్ష్ అక్కడికక్కడే మృతి చెందాడని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ముందస్తు జాగ్రత్తలే…
గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేలా ఇటు పోలీసు సిబ్బంది వినియోగంతో పాటు అటు సాంకేతికంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పోలీసు అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా తక్షణమే ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. ఇక ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నా ప్రజలకు అసౌకర్యం కలగని రీతిలో పోలీసులు పలు ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ముందుగా ఇబ్బందులను పసిగట్టలేని కొందరు ప్రజానీకం గణేష్ నిమజ్ఝన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలతో కొంతమేర ఇబ్బందులకు గురయ్యారు. ఇక మహిళల భద్రతపై పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి పలువురు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేని రీతిలో పోలీసు అధికారులు సమన్వయంతో తమ సిబ్బందిని వేగిర పర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News