Monday, May 13, 2024

నర్సింగ్ రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం సీరియస్

- Advertisement -
- Advertisement -

Government is serious about Nursing recruitment

 

సంబంధిత అధికారులకు వేరే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం
పూర్తిస్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం
ప్రతి అభ్యర్థి సర్టిఫికేట్లను మరోసారి పరిశీలించనున్న అధికారులు
రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న హెల్త్ డిపార్ట్‌మెంట్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తున్న నర్సింగ్ రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీనిలో భాగంగా వెయిటేజ్ మార్కుల పర్యవేక్షణను పరిశీలించిన అధికారులకు వేరే బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. ఎంక్వైరీ కమిటీ పూర్తి స్థాయి నివేదిక తర్వాత తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే స్టాఫ్ నర్సు నియామకాల్లో అనర్హులకు వెయిటేజ్ మార్కులు కలిపినట్లు గత నాలుగు రోజులుగా టిఎస్‌పిఎస్‌కి దాదాపు వందకు పైగా ఫిర్యాదులు అందడంతో ఈ అంశంపై ఏకంగా సిఎం సైతం సీరియస్‌గా ఉన్నారని ఆరోగ్యశాఖలోని కొందరు ఉన్నతాధికారులు వెల్లడించారు.

అయితే టిఎస్‌పిఎస్‌సి ద్వారా 3311 మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో భాగంగా వెయిటేజ్ మార్కులను క్లైమ్ చేసుకున్న 1827 మంది అభ్యర్ధుల సర్టిఫికేట్లను మరోసారి పరిశీలించనున్నట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి అభ్యర్థి పత్రాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో నేరుగా పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. ఓరిజినల్ సర్టిఫికేట్లు, ఈయర్ ఆఫ్ పాసింగ్‌ను పరిశీలించిన తర్వాతనే సదరు క్యాండెట్లకు అప్రూవల్ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక రెండు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి కూలంకుశంగా నివేదికను సమర్పిస్తామన్నారు. ఈ స్టాఫ్ నర్సుల నియామకాల్లో అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు….

టిఎస్‌పిఎస్ ఆధ్వర్యంలో 2017లో విడుదలైన నోటిఫికేషన్ నెం.57 స్టాఫ్ నర్సు నియామకాలపై రోజురోజుకి ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. కేవలం ఐదు రోజుల్లో దాదాపు వందకు పైగా ఫిర్యాదులు అందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ అంశంపై ఒకవైపు ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నప్పటికీ, తాము నష్టపోయామని ఫిర్యాదు చేసేందుకు ప్రతి రోజూ పదుల సంఖ్యలో స్టాఫ్ నర్సులు ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు క్యూ కడుతున్నారు. కానీ వారు ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. కొంత మంది అభ్యర్ధులు టిఎస్‌పిఎస్‌కి వెళ్తే, వైద్యశాఖకు వెళ్లాలని, ఆరోగ్యశాఖకు వస్తే ఇక్కడ ఫిర్యాదులు తీసుకునే అధికారులు లేరని స్టాఫ్ నర్సు అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. కావున ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని వారు వైద్యశాఖను కోరుతున్నారు. ఇదిలా ఉండగా తమకు తెలియకుండానే వెయిటేజ్ మార్కులు కలిసినట్లు మరి కొందరు అభ్యర్ధులు అభిప్రాయపడుతున్నారు.

అనర్హులైన తమకు వెయిటేజ్ మార్కులు ఎలా కలిశాయో అర్థం కావడం లేదని వారు చెప్పుకొస్తున్నారు. కానీ ఆ అభ్యర్ధులు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కావడం గమనార్హం. మరోవైపు వెయిటేజ్ మార్కులు పొందిన అనర్హులు తమకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడాలని ఇప్పటికే మెడికల్ యూనియన్లు, మరి కొంత మంది ఉన్నతాధికారులను ఆశ్రయించి ఫైరవీలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై చాలా సీరియస్‌గా ఉందని, ఎలాంటి పరిస్థితుల్లో అనర్హులకు జాబ్ రాదని ఆరోగ్యశాఖ అధికారులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి తెరపడాలంటే ఎంక్వైరీ కమిటీ నివేదిక రావాల్సిందేనని అధికారులు తెలిపారు. అయితే ఈ అంశంలో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన అభ్యర్ధులపై చర్యలు తీసుకుంటారా? అక్రమ మార్గంలో మార్కులు వేసిన అధికారులపై చర్యలు ఉంటాయా? ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ బేసిస్ వర్క్ చేసినట్లు సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? అనే అంశంపై క్లారిటీ రావాలంటే మరో వారం రోజుల పాటు వేచిచూడాల్సిందేనని ఆరోగ్యశాఖలోని ముఖ్య అధికారి మన తెలంగాణకు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News