Friday, May 3, 2024

వ్యవసాయంతోనే జిఎస్‌డిపి పెరిగింది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

GSDP increased with agriculture

హైదరాబాద్: ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు అనేక ప్రతిపక్షాలు కేసులు వేశాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. కోటి ఎకరాల మాగాణం అని తాను కన్న కల కోటి 25 లక్షలకు వెళ్తోందన్నారు. గొదావరి జలాలు వాగుల్లోనూ వదులుతున్నామని, తెలంగాణలో వ్యవసాయాన్ని పండగలా మార్చామన్నారు. పట్టుబట్టి నీటి సమస్యలను అంతం చేశామని, వంద శాతం నివాసాలకు మంచి నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. ప్రాణం పోయినా స‌రే నీళ్ల విష‌యంలో రాజీప‌డే స‌మ‌స్యే లేదని,  రాయ‌ల‌సీమ ప్రాజెక్టుపై అన్ని ర‌కాలుగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.   అసెంబ్లీలో ద్రవ్య వినిమియ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. తెలంగాణ జిఎస్‌డిపి పెరగడానికి ప్రధాన కారణం వ్యవసాయమన్నారు. వ్యవసాయం కారణంగా తెలంగాణలో 17.7 శాతం జిఎస్‌డిపి పెరిగిందన్నారు. సరాసరి జిఎస్‌డిపి పెరిగిందని, రాష్ట్రాలు తీసుకునే అప్పులు కూడా జిఎస్‌డిపిపై ఆధారపడి ఉంటాయని తెలియజేశారు.

అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్రం తీసుకునే అప్పులు ఆర్‌బిఐ పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో కరోనా సమయంలో తక్కువ అప్పులు తీసుకొని అభివృద్ధిలో ముందుకు సాగుతున్న రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ మెచ్చుకున్నారు. అవసరమైన మేరకే అప్పులు తీసుకున్నామని, యుపి 33 శాతం, రాజస్థాన్ 34శాతం, పంజాబ్ 32 శాతం అప్పులు తీసుకుంటే తెలంగాణ 22.8 శాతం అప్పులు మాత్రమే తీసుకుందన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణను ముందుకు తీసుకొని పోతున్నామని చెప్పారు. కరోనా నియంత్రణలో దేశంలోనే తెలంగాణ బెస్ట్ స్టేట్ అని కొనియాడారు. కరోనాతో ప్రపంచం ఎంతో నష్ట పోయిందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో పది లక్షల ఎనబై వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని కెసిఆర్ వెల్లడించారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. స్వీయ క్రమశిక్షణతోనే కరోనాను కట్టడి చేయగలమన్నారు. త్వరలోనే ఆర్ టిసి ఉద్యోగుల వేతనాలను కూడా పెంచుతామని కెసిఆర్ హామీ ఇచ్చారు.  జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ జీతాలు ఇస్తామ‌ని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News