Sunday, April 28, 2024

భట్టి విక్రమార్కపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్..

- Advertisement -
- Advertisement -

నల్గొండ: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాను, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఏమి చేయలేదంటూ, ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టుపై కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలు ఆయన అవగాహన రాహిత్య విమర్శలని , తిక్కల భట్టికి ఆయన మధిర నియోజకవర్గo తప్ప రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు, నదులు, వాగులు, వంకలు ఉన్నాయో తెలియదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం నల్గొండలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు పాదయాత్రలు చేసి అలసిపోయారని, భట్టికి కూడా అలుపు తప్ప మరేమీ మిగలదన్నారు.

ప్రతిపక్ష పార్టీ నాయకుల పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని, కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న డిండి ప్రాంతంలో రెండు పంటలకు నీరు ఇచ్చింది ఆయనకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఏఎంఆర్పీ ఎత్తిపోతల పథకం పుణ్యమేనని భట్టి గ్రహించాలన్నారు. ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని భట్టి విమర్శించడం అర్ధరహితమన్నారు. ఉమ్మడి జిల్లాకు మూడు మెడికల్ కళాశాలలు, దేవరకొండకు వంద పడకల ఆసుపత్రి, సాగర్ ఏరియా ఆసుపత్రి విస్తరణ, మిర్యాలగూడ కు 250 పడకల ఆసుపత్రి కెసిఆర్ పాలనలో వచ్చాయన్నారు. 24 గంటల విద్యుత్తు అమలవుతుందన్నారు. మరి కాంగ్రెస్ పాలనలో అవన్నీ ఎందుకు చేయలేదో భట్టి సమాధానం చెప్పాలన్నారు.

అభివృద్ధి ఎలా చేయాలో సిఎం కెసిఆర్ వద్ద కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలన్నారు. వైఎస్సార్ మాదిరిగా పంచే, అంగీ వేసుకొని పగటివేషగాడిగా భట్టి పాదయాత్ర చేసినంత మాత్రాన వైయస్సార్ అయిపోడని గుత్తా ఏద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే సీఎం ఎవరో తెలియదని, దమ్ముంటే ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. జిల్లా కాంగ్రెస్ లోనే ముగ్గురు సిఎం అభ్యర్థులు ఉన్నారన్నారు. భట్టి పాదయాత్రలోనే కాంగ్రెస్ వర్గాలు తన్నుకున్నాయన్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చించిన విస్తరి అవుతుందన్నారు. తెలంగాణకు సిఎం కెసిఆర్ పాలన శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్రం మత ఘర్షణలు, అస్థిర, అవినీతి లేకుండా ప్రశాంతంగా అభివృద్ధి చెందాలంటే బిజెపి, కాంగ్రెస్ లను అధికారానికి దూరం పెట్టాలని, వచ్చే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News