Wednesday, August 6, 2025

ఒకవైపే చూసి.. ఒకవైపే విన్నారు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ హింసించమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగిస్తోంది
కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ విచారణ కుట్రపూరితం
నివేదిక ఒక ట్రాష్ సిడబ్లూసి అనుమతి, కేబినెట్ నిర్ణయంతోనే నిర్మాణాలు
మేడిగడ్డ బ్యారేజీకి వ్యాప్కోస్ గ్రీన్‌సిగ్నల్ 
అయినా వ్యక్తిగత నిర్ణయాలతో ప్రాజెక్టులు కట్టారనడం అబద్ధం: హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ విచారణ కుట్ర పూరితంగా జరిగినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగైనా కెసిఆర్ హింసించమే లక్షంగా కాంగ్రెస్ పాలన సాగిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే కెసిఆర్ నిర్వర్తించారని… ప్రాజెక్టుపై ఒక సిఎం సమీక్ష చేయడం ఆయన బాధ్యత అని పేర్కొన్నారు. అది రాజకీయ జోక్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి సమీక్ష చేయకుండా ఎలా ఉంటారని…కెసిఆర్ కూడా అదే చేశారని చెప్పారు. ఈ విషయాన్ని కూడా కెసిఆర్ సొంత నిర్ణయంగా రేవంత్ ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు చాలా వచ్చాయి.. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే నివేదికలు న్యాయస్థానాలలో, ప్రజా క్షేత్రంలో నిలబడవు అని పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టి కెసిఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్‌ను హింసించాలనే ధోరణి తప్పా.. సిఎం రేవంత్‌రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ మంత్రి హరీష్‌రావు మంగళవారం తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి ఆధారాలతో వివరించారు. హరీష్‌రావు ప్రెజెంటేషన్‌ను కార్యకర్తలు చూసేలా పార్టీ జిల్లా కార్యాలయాల్లో నేతలు ఎల్‌ఇడి స్క్రీన్లు జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం, విద్యుత్ కమషన్ల పేరుతో సిఎం రేవంత్‌రెడ్డి వరుస సీరియళ్లు నడుపుతున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు దుయ్యబట్టారు. ఎలాగైనా కెసిఆర్‌ను హింసించాలన్నదే రేవంత్‌రెడ్డి ఉద్దేశమని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడం తప్ప రాష్ట్రానికి సిఎం చేసిందేమి లేదని మండిపడ్డారు.

కాళేశ్వరంను పడావు పెట్టి బనకచర్లకు నీరు పోవాలన్నది సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచర్లకు నీళ్లు ఇవ్వాలని సిఎం చూస్తున్నారని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు దండుకునేందుకు కమీషన్లు, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు కోసం రాజకీయ కమిషన్లు.. ఇలా రాష్ట్రమంతా కమీషన్లమయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు దెబ్బతిన్నా అక్కడకు ఎన్‌డిఎస్‌ఎఎ వెళ్లలేదని ప్రశ్నించారు. మేడిగడ్డకు మాత్రం ఎన్‌డిఎస్‌ఎ మూడు సార్లు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో, బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతున్నప్పుడు ఎన్‌డిఎస్‌ఎ నివేదిక ఇస్తుందని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటపెట్టారని ఆరోపించారు.

సర్ ఆర్థర్ కాటన్ మాదిరిగా.. కెసిఆర్ నిలిచిపోతారు
మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని కాళేశ్వరం నిర్మించామని హరీష్‌రావు తెలిపారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించిందా..? అని ప్రశ్నించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాటన్ మీద కూడా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కమిషన్ వేసిందని తెలిపారు. దేశంలో చాలా కమిషన్లు న్యాయస్థానాల ముందు నిలబడలేదని చెప్పారు. సర్ ఆర్థర్ కాటన్ మాదిరిగా.. కెసిఆర్ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఉద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కెసిఆర్‌ను కూడా భవిష్యత్ తరాలు దేవుడిగా కొలుస్తాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ పేరుతో వండి వార్చిన నివేదికను బయటపెట్టారని విమర్శించారు. మొత్తం నివేదికను బయటపెట్టలేదని చెప్పారు. 650పేజీల రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి నివేదిక బయటపెట్టి అసెంబ్లీలో చర్చ పెడితే… చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. కాళేశ్వరం నివేదికలో నచ్చిన పేరాలను లీక్ చేశారని… నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కెసిఆర్ ఓపెన్ ఛాలెంజ్‌కు ఇంత వరకు స్పందన లేదు
తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లకు ఒప్పందం చేసుకొని ఉంటే రాజీనామా చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కెసిఆర్ సవాల్ చేశారని హరీష్‌రావు గుర్తు చేశారు. కెసిఆర్ ఓపెన్ ఛాలెంజ్‌కు ఇంత వరకు స్పందన లేదని విమరించారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా..? అని అడిగారు. తమ్మిడిహట్టి వద్ద అగ్రిమెంట్ జరిగి ఉంటే.. ఏడెండ్లు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి ఎత్తలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హరీష్‌రావు ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2007 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మంట్టి ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే విద్యుత్ సమస్యను పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చామని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించామని, మీడియం ఇరిగేషేన్ ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కాల్వ తొవ్వలేదు, ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదు, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. రెండేళ్లలో ఢిల్లీకి కమిషన్లు మోశారు.. ప్రతిపక్షాలపై కేసులు, కమిషన్లు తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. వచ్చే మూడేళ్లు కూడా ఈ ప్రభుత్వం చేసేది ఇదే అని పేర్కొన్నారు.

పిసి ఘోష్ కమిషన్ నివేదిక కేంద్రాన్ని తప్పుపట్టినట్లుంది
పిసి ఘోష్ కమిషన్ నివేదిక కేంద్రాన్ని తప్పుపట్టినట్లుందని హరీష్‌రావు విమర్శించారు. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం అని గుర్తుచేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కుట్రతో జరిగిన వ్యవహారమని ఆరోపించారు. నివేదిక నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారుల్ని తప్పుపట్టినట్లే అని పేర్కొన్నారు. కెసిఆర్, హరీశ్ రావును కమిషన్ పిలవదు అని మొదట అన్నారు..ఆ తర్వాత రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఒక వైపే చూసి, ఒక వైపే విని, ఒక వైపే నిల్చుని ఇచ్చిన నివేదికలా కనిపిస్తోందని విమర్శించారు. నివేదిక ఒక ట్రాష్ అని, ఆధారాలు లేని ఆరోపణలు అని పేర్కొన్నారు. కాళేశ్వానికి కేంద్రం ఇచ్చిన అనుమతులు చూపిస్తే.. సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా కడిగేస్తామని హెచ్చరించారు. సిఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. మైక్ కట్ చేసి పారిపోకూడదని సవాల్ విసిరారు. సిడబ్ల్యూసి అనుమతి, కేబినెట్ నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సంస్థ మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టవచ్చని చెప్పిందని గుర్తుచేశారు.

తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ డిజైన్ చేసిన కాంగ్రెస్‌పైనే మెదట చర్యలు తీసుకోవాలని కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలు వాప్కోస్ డిపిఆర్, హై పవర్ కమిటీ సిఫార్సులు, కేబినెట్ నిర్ణయం, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకే జరిగాయని, ఇవన్నీ స్పష్టంగా ఉంటే సోల్ డిసీజన్ అని కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణ చేశారని మండిపడ్డారు. బ్యారేజీల నిర్మాణం వ్యక్తుల నిర్ణయం అనేది పచ్చి అబద్దం అని పేర్కొన్నారు. మేడిగడ్డకు కేబినెట్ అప్రూవల్ లేదని సీఎం, మంత్రులు చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్ధం అని, సీడబ్ల్యూసీ సూచన మేరకు ప్రాజెక్టును పునర్ పరిశీలించమని వ్యాప్కోస్ సంస్థను కోరినట్లు పేర్కొన్నారు. దీనిని 2016 జూన్ 14న కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిపిఆర్‌కు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కు అప్పగించింది కాబట్టి, మరోసారి వ్యాస్కోస్ సంస్థకే తమ ప్రభుత్వం కూడా అప్పగించిందని గుర్తు చేశారు.

వందేళ్ల భవిష్యత్తు కోసమే కాళేశ్వరం
ముమ్మాటికీ తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిందని ఓ వైపు అంటూనే…మరోవైపు మూసీకి గోదావరి జలాలు తీసుకొస్తామని ఎలా చెబుతారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇటీవల యాదాద్రి జిల్లాకు వెళ్లి గంధమల్లకు కొబ్బరికాయ కొట్టింది రేవంత్‌రెడ్డినే అని, కాళేశ్వరం నీళ్లే గంధమల్ల ప్రాజెక్టుకు పోతాయని చెప్పారు. మల్లన్న సాగర్ నుండి నీళ్లు మూసీలోకి నీళ్లు పోయడానికి రూ.6000 కోట్లకు టెండర్లు ఫైనల్ చేశారని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమే అని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిందని అబద్దపు మాటలు చెప్పి.. గందమల్లకు కొబ్బరికాయలు కొట్టి, మల్లన్నసాగర్‌కు టెండర్లు ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. కెసిఆర్ వందేళ్ల రాష్ట్ర భవిష్యత్ కోసం కాళేశ్వరం, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించారని హరీష్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News