Sunday, April 28, 2024

వచ్చే ఏడాది ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు

- Advertisement -
- Advertisement -

వచ్చే ఏడాది ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు
33 జిల్లాలకుగానూ 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు
వచ్చే విద్యా సంవత్సరానికి మిగిలిన నూతన
మెడికల్ కాలేజీలకు ప్రతిపాదనలు రూపొందించాలి
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష
9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి దేశంలో రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనల మేరకు వేగంగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాది మిగిలిన 8 జిల్లాలో మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని చెప్పారు.

అతి తక్కువ సమయంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. ఇప్పటికే 33 జిల్లాల్లో 25 జిల్లాలకు మెడికల్ ఏర్పాటు కాగా, మిగిలిన 8 జిల్లాల మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు భూసేకరణకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని మంత్రి శాఖ సెక్రెటరీ రిజ్విని ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఎన్‌ఎంసి మార్గదర్శకాల ప్రకారం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఒ విశాలాక్షి, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్ , టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేందుకు, ప్రభుత్వం తరఫునుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు తమవంతుగా ప్రతి ఒక్కరు బాగా పని చేయాలని కోరారు. కొద్ది కాలం నుండి మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి విరామం లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన సహాయ సహకారం అందిస్తుందని తెలిపారు. పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసినట్లు మంత్రి చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉంది
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అనేక గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దేశంలోనే తెలంగాణ వైద్యరంగంలో అగ్రస్థానంలో ఉందని, ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం, వైద్యులు, అధికారులు, సిబ్బంది కృషి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్ పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి కొత్త మెడికల్ కాలేజీలు ఇచ్చారని, వైద్యులను, వైద్య పరికరాలను ఇచ్చారని తెలిపారు. సిఎం అడిగినవన్నీ మనకు వెంటనే మంజూరు చేస్తున్నారని, ఆయన ఆశయం నెరవేరేలా మనందరం కృషి చేయాలని అన్నారు.
స్పెషాలిటీ సేవలు జిల్లా పరిధిలోనే అందాలని ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. ఎన్‌ఎంసి నిబంధనల ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌లపైన ఉందని అన్నారు. తరగతులు, అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు.

వందవ రోజుకు చేరిన కంటి వెలుగు పరీక్షలు
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం శనివారంతో 100వ రోజుకు చేరనుంది. 99 పనిదినాల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి అంటే 25.1 శాతం మందికి గ్లాసెస్ పంపిణీ చేశారు. ఇందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందజేశారు. 18.08 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ పూర్తయ్యింది. ఇప్పటికే 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో భాగంగా కంటి వెలుగుపై మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. ఈ పథకం విజయవంతంగా 100వ రోజుకు చేరడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 100 శాతం పరీక్షలు పూర్తి కాని జిల్లాల్లో పరీక్షలు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రచారం కల్పించి అవగాహన పెంచాలన్నారు. కంటి వెలుగు విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ఇతర శాఖలు, ప్రజాప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News